ఇక్కడా వైసీపీకి అదే సీన్.. మార్పే లేదు…?

క‌ర్నూలు జిల్లాలోని కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గంలోనూ `నందికొట్కూరు` సీన్ రిపీట్ అవుతోంది. ఈ రెండూ కూడా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాలే కావ‌డం గ‌మ‌నార్హం. నందికొట్కూరులో ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్థర్‌పై రెడ్డి [more]

Update: 2021-02-15 09:30 GMT

క‌ర్నూలు జిల్లాలోని కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గంలోనూ 'నందికొట్కూరు' సీన్ రిపీట్ అవుతోంది. ఈ రెండూ కూడా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాలే కావ‌డం గ‌మ‌నార్హం. నందికొట్కూరులో ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్థర్‌పై రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన పార్టీ ఇంచార్జ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైచేయి సాధిస్తున్న విష‌యం తెలిసిందే. ప్రతి విష‌యంలోనూ ఇద్దరి మ‌ధ్య పంచాయి‌తీ నానాటికీ ర‌చ్చకెక్కుతోంది. ఇది వైసీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మించింది. ఇటీవ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ ఇద్దరూ ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. జిల్లా సీనియ‌ర్ నేత‌లు, జిల్లా మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రులు వీళ్లను కూర్చోపెట్టి పంచాయితీలు చేసినా ఎవ్వరూ వెన‌క్కు త‌గ్గడం లేదు.

ఎమ్మెల్యేను డమ్మీని చేసి…..

ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే.. కోడుమూరులోనూ క‌నిపిస్తోంది. కోడుమూరు నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున జార‌దొడ్డి సుధాక‌ర్ విజ‌యం సాధించారు. అయితే ఈయ‌న గెలుపు గుర్రం ఎక్కేందుకు పార్టీ స‌మ‌న్వయక‌ర్తగా ఉన్న కోట్ల హ‌ర్షవ‌ర్ధన్‌రెడ్డి సాయం చేశారు. ఎన్నిక‌ల స‌మయంలో అన్నీ తానై వ్యవ‌హ‌రించి.. సుధాక‌ర్ గెలుపు కోసం కృషి చేశారు. సేమ్ నందికొట్కూరులో ఆర్థర్ ఎమ్మెల్యేగా, బైరెడ్డి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఎలా ఉన్నారో ? కోడుమూరులోనూ సుధాక‌ర్ ఎమ్మెల్యేగా ఉంటే హ‌ర్షవ‌ర్థన్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే డ‌మ్మీ అయిపోయారు. ఏ కార్యక్రమం జ‌రిగినా.. ఒంట‌రిగానే పాల్గొనాల్సి వ‌స్తోంది. ఇక్కడ ఏం జ‌ర‌గాల‌న్నా.. అన్నీ .. కోట్ల హ‌ర్ష వ‌ర్ధన్ క‌నుస‌న్నల్లోనే సాగుతున్నాయి. పార్టీ, ప్రభుత్వ వ్యవ‌హారాల్లో అన్నీ తానై వ్యవ‌హ‌రిస్తున్నారు. దీంతో అధికారులు కూడా ఎమ్మెల్యే క‌న్నా కూడా స‌మ‌న్వయ‌క‌ర్తకే వాల్యూ ఇస్తున్నార‌ట‌.

క్యాడర్ రెండు వర్గాలుగా…..

ఇక‌,పార్టీ ప‌రంగా చూసుకున్నా.. నాయ‌కులు, కార్యక‌ర్తలు రెండుగా విడిపోయారు. ఎవ‌రికి వారుగా నాయ‌కులకు మ‌ద్దతు ఇస్తున్నారు. అయితే.. ఎమ్మెల్యే సుధాక‌ర్‌కు ఇది ఇబ్బందిగా మారిన‌ప్పటికీ.. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధిపై మాత్రం దృష్టి పెడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. నియోజ‌క‌వ‌ర్గానికి ఐటీఐ సాధించారు. అదే స‌మ‌యంలో స్థానిక స‌మ‌స్యల‌పై దృష్టి పెట్టి సాధిస్తున్నారు. దీంతో సుధాక‌ర్‌కు జ‌నంలో రేంజ్ పెరుగుతోంది. అయితే రాజ‌కీయంగా, ప్రభుత్వ వ్య‌వ‌హారాల్లో సుధాక‌ర్ కోట్ల దూకుడుకు చెక్ పెట్టలేక పోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

ఏ కార్యక్రమానికి అయినా…

ఇక‌, వ్యాపార‌, వాణిజ్య వ‌ర్గాల్లోను, పారిశ్రామిక వ‌ర్గాల్లోనూ ఎమ్మెల్యే కంటే.. స‌మ‌న్వయ‌క‌ర్త హ‌ర్షకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అనుమ‌తులు కావాల‌న్నా..షాపుల ఓపెనింగ్‌కు రావాల‌న్నా.. హ‌ర్షకే ఆహ్వానాలు అందుతున్నాయి. అదేవిధంగా.. జిల్లా స్థాయి అధికారులు కూడా ఎమ్మెల్యే‌ను ప‌క్కన పెట్టి కోట్ల చెప్పిన‌ట్టు న‌డుచుకుంటున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఇరు ప‌క్షాల మ‌ధ్య తీవ్రస్థాయిలో న‌డుస్తోన్న ఆధిప‌త్య పోరు కోడూమూరును కూడా మ‌రో నందికొట్కూరుగా మారుస్తుందా ? వీరు స‌మ‌న్వయంతో ముందుకు వెళ‌తారా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News