ఆ వైసీపీ ఎమ్మెల్యే సైకిల్‌కు సూప‌ర్ ఛాన్స్ ఇచ్చేస్తున్నారే ?

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలపై ఇప్పుడుప్పుడే వ్యతిరేకత మొదలవుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేసిన నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల నుంచి వ్యతిరేకత [more]

Update: 2021-09-12 06:30 GMT

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలపై ఇప్పుడుప్పుడే వ్యతిరేకత మొదలవుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేసిన నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఏదో ప్రభుత్వ పథకాల ద్వారా మొన్నటివరకు కాలం గడిపిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు చిక్కులు తప్పేలా లేవు. తొలి రెండేళ్లలో చాలా మంది ఎమ్మెల్యేల‌కు ప్రజ‌ల‌కు ఇచ్చిన హామీల్లో క‌నీసం 10 శాతం హామీలు కూడా నెర‌వేర్చలేదు. వీరికి యేడాదిన్నర పాటు క‌రోనా కూడా పెద్ద సాకుగా మారింది. ఏదేమైనా చాలా మంది ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక కావ‌డంతో పాటు ప్రజ‌ల‌ను ప‌ట్టించుకోలేద‌న్నది వాస్తవం. ఈ క్రమంలోనే మెరుగైన పనితీరు కనబర్చని ఎమ్మెల్యేలని ప్రజలు సైడ్ చేసేలా కనిపిస్తున్నారు.

వ్యతిరేకత పెరిగి…..

ఇప్పటికే ఏపీలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత పెరిగినట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటోన్న‌ ఎమ్మెల్యేల్లో కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గ‌తంలో నియోజ‌క‌వ‌ర్గ కేంద్రమైన కైక‌లూరు స‌ర్పంచ్‌గా ప‌నిచేసిన దూలం గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్రభంజ‌నంలోనూ గ‌ట్టి ఫైట్ ఎదుర్కొని మ‌రీ గెలిచారు. ప్రజలకు అండగా ఉండటంలో ఈయన వెనుకబడి ఉన్నారని నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లే కాదు వైసీపీ కేడ‌ర్ కూడా చెపుతోంది.

ఎక్కడి సమస్యలు అక్కడే…?

కొల్లేరు ప్రభావిత ప్రాంత‌మైన కైక‌లూరులో ఎక్కడి స‌మ‌స్యలు అక్కడే తిష్టవేశాయి. పాత స‌మ‌స్యల‌కు తోడు.. ఈ రెండేళ్లలో రోడ్లన్నీ ఛిద్రమైపోయాయి. ఒక్కటంటే ఒక్క రోడ్డు కూడా పోసిన పాపాన పోలేద‌ని అక్కడ ప్రజ‌లు వాపోతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇళ్ల స్థలాల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది.నియోజ‌క‌వ‌ర్గంలో ప్రధాన ర‌హ‌దారుల ప‌రిస్థితి ఘోరంగా ఉంది. దీనికి తోడు ఆయ‌న ఓ ఎమ్మెల్యే స్థాయిలో పార్టీని న‌డ‌ప‌లేక‌పోతున్నార‌ని వైసీపీ నేత‌లే చెపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేపై వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇదే ఇప్పుడు టీడీపీకి అడ్వాంటేజ్ కానుంది. ఈ అడ్వాంటేజ్‌ని ఉపయోగించుకుంటే కైకలూరులో టీడీపీకి తిరుగుండదనే చెప్పాలి.

పక్కన పెడతారా?

ప్రస్తుతం ఇక్కడ టీడీపీ తరుపున మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పనిచేస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఈయన ఇక్కడ టీడీపీ తరుపున గెలిచారు. కానీ 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా ఇక్కడ కామినేని శ్రీనివాస్ గెలిచారు. 2019 ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ తరుపున జయమంగళ పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఓడిపోయాక జయమంగళ కొన్నిరోజులు పార్టీలో యాక్టివ్‌గా లేరు. ఒకానొక ద‌శ‌లో పార్టీ ఇన్‌చార్జ్‌ను మార్చేస్తార‌న్న ప్రచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో జ‌యమంగ‌ళ మ‌ళ్లీ యాక్టివ్ అవ్వడంతో పాటు పార్టీపై ప‌ట్టు నిలుపుకున్నారు. మ‌రోవైపు వైసీపీ ఇక్కడ వ‌చ్చే ఎన్నిక‌ల్లో క్యాస్ట్ ఈక్వేష‌న్ల నేప‌థ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను ప‌క్కన పెడుతుంద‌న్న మ‌రో ప్రచారం కూడా ఆ పార్టీలోనే వినిపిస్తోంది.

Tags:    

Similar News