గుంటూరు వైసీపీలో చక్రం తిప్పుతున్నదెవరు?

రాష్ట్ర రాజ‌ధాని గుంటూరు జిల్లాలో వైసీపీ నేత‌లు చాలా మందే ఉన్నారు. ఒక‌ప్పటి టీడీపీ కంచుకోట‌ను బ‌ద్దలు చేసి.. వైసీపీ నేత‌లు ఒక‌ ర‌కంగా జిల్లాను ఆక్రమించేశారు. [more]

Update: 2020-07-19 00:30 GMT

రాష్ట్ర రాజ‌ధాని గుంటూరు జిల్లాలో వైసీపీ నేత‌లు చాలా మందే ఉన్నారు. ఒక‌ప్పటి టీడీపీ కంచుకోట‌ను బ‌ద్దలు చేసి.. వైసీపీ నేత‌లు ఒక‌ ర‌కంగా జిల్లాను ఆక్రమించేశారు. అయితే, ఈ రెండో అతి పెద్ద జిల్లాలో ఎవ‌రి మాట చ‌లామ‌ణి అవుతోంది ? ఈ జిల్లాకు నిన్న మొన్నటి వ‌రకు ఇద్దరు మంత్రులు ఉంటే.. ఒక‌రు ఇటీవ‌ల రాజ్యస‌భ‌కు ప్రమోట్ అయ్యారు. దీంతో ఒక్కరే మిగిలారు. ఈ నేప‌థ్యంలో జిల్లా వైసీపీ రాజ‌కీయాల్లో ఎవ‌రి హ‌వా కొన‌సాగుతోంది? అస‌లు మంత్రులు చ‌క్రం తిప్పే ప‌రిస్థితి ఉందా? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. గుంటూరు రాజ‌కీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. నియోజ‌క‌వ‌ర్గాలు చాలా విస్తారంగా ఉంటాయి. దీంతో స‌మ‌స్యలు కూడా అధికంగానే ఉంటాయి.

మంత్రులను పక్కన పెట్టేసి…..

పైగా ప‌ల్నాడు ప్రాంతం ఎక్కడో విసిరేసిన‌ట్టు ఉండ‌డం కూడా జిల్లాపై ప్రభావం చూపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎక్కడిక‌క్కడ ఎమ్మెల్యేలే చ‌క్రం తిప్పుతున్నారనే వాద‌న వినిపిస్తోంది. స‌త్తెన‌ప‌ల్లి, వినుకొండ‌, మాచ‌ర్ల, గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గాల్లో అక్కడి ఎమ్మెల్యేలే అన్నీ తామై వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇక‌, సిటీ ప‌రిధిలోకి వ‌చ్చే స‌రికి.. మాత్రం నియోజ‌క‌వ‌ర్గాలు ఎన్ని ఉన్నప్పటికీ.. కొంద‌రు మాత్రమే చ‌క్రం తిప్పుతున్నారు. అయితే, చిత్రంగా వీరిలో జ‌గ‌న్ స‌ల‌హాదారు పేరు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో విజ‌య‌వాడ‌కు చెందిన మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు కూడా గుంటూరులో చ‌క్కబెడుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. జ‌గ‌న్ ప్రభుత్వంలో స‌ల‌హాదారుగా ఉన్న స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి.. గుంటూరు న‌గ‌రానికి స‌మీపంలో ఉన్న నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ తానే అన్నీ చూస్తున్నారు.

పార్టీలో కీలక నేతలే….

నిన్న మొన్నటి వ‌ర‌కు మంత్రిగా ఉన్న మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌.. , ప్రస్తుతం మంత్రిగా ఉన్న మేక‌తోటి సుచ‌రితలు..కేవ‌లం నామ్ ‌కే వాస్తే అన్నట్టుగా మారిపోయార‌ని అయితే, ఇప్పుడు ఎలాగూ మోపిదేవి లేరు కాబ‌ట్టి.. సుచ‌రిత విష‌యం నామ మాత్ర ‌మేన‌ని ఇక్కడి విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రో ట్విస్ట్ ఏంటంటే సాక్షాత్తు హోం మంత్రి ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆమె మాట కంటే పార్టీలో కీల‌కంగా ఉన్న ఇత‌ర నేత‌ల మాటే చెల్లుబాటు అవుతోంద‌ని అంటున్నారు.

ఎమ్మెల్యేల అంతటా….

ఇక‌, న‌గ‌రానికి స‌మీపంలోనే ఉన్న చిల‌క‌లూరిపేట నియోజ‌కవ ‌ర్గంలో ఎమ్మెల్యే నే అన్నీ అయి చ‌క్రం తిప్పుతున్నారు. అయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు ప‌ట్టు ఉండ‌డంతో ఆయ‌న కూడా త‌న హ‌వా చాటుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. న‌ర‌స‌రావుపేట‌లో అంతా స్తబ్దుగా ఉంది. ఇక్కడ నుంచి వ‌రుస‌గా రెండు సార్లు విజ‌యం సాధించిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ కేబినెట్లో చోటు కోసం ఆశించారు. అయితే, అది ద‌క్కక పోయే స‌రికి మౌనంగా ఉంటున్నారు. గ‌త ఐదేళ్లలో చూపించిన దూకుడు ఇప్పుడు మాత్రం చూపించ‌డం లేదు. మొత్తంగా చూస్తే.. జిల్లా రాజ‌కీయాల్లో వైసీపీ దూకుడు ఏక‌ప‌క్షంగా ఉంద‌నే అభిప్రాయం వ్యక్తమ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News