వైసీపీలో మామ‌, అల్లుళ్ల దందా మామూలుగా లేదే….?

గుంటూరు జిల్లాలో అధికార వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు ఆయ‌న మామ త‌మ ప‌ద‌వుల‌ను అడ్డం పెట్టుకుని నియోజ‌క‌వ‌ర్గంలో న‌డిపిస్తోన్న దందాకు అంతూ పంతూ లేద‌న్న [more]

Update: 2021-02-07 13:30 GMT

గుంటూరు జిల్లాలో అధికార వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు ఆయ‌న మామ త‌మ ప‌ద‌వుల‌ను అడ్డం పెట్టుకుని నియోజ‌క‌వ‌ర్గంలో న‌డిపిస్తోన్న దందాకు అంతూ పంతూ లేద‌న్న విమ‌ర్శలు సాధార‌ణ ప్రజ‌ల నుంచి సొంత పార్టీ కార్యక‌ర్తల వ‌ర‌కు అంద‌రిలోనూ వినిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ఇర‌వై రోజుల ముందే అనూహ్యంగా సీటు ద‌క్కించుకున్న ఆ నేత ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ద‌శాబ్దాలుగా పాతుకుపోయిన టీడీపీ సీనియ‌ర్ నేత‌ను ఓడించాడు. చాలా ల‌క్‌లో త‌క్కువ మెజార్టీతోనే ఆ నేత ఎమ్మెల్యే అయ్యారు. అస‌లు ఆ నేత‌కు సీటు ఇవ్వడం వెన‌కే ఆ పార్టీలో ఉన్న ఆ నేత మామ అయిన ఓ వృద్ధ నేత‌ను సంత‌ప్తి ప‌ర‌చాల‌న్న ల‌క్ష్యమే. స‌ద‌రు నేత ఎమ్మెల్యే అయ్యారో లేదో అప్పటి నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు మారిపోయాయి.

కులానికే ప్రాధాన్యత……

ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ద‌శాబ్ద కాలంగా పార్టీ కోసం క‌ష్టప‌డిన వారంద‌రిని ఆయ‌న ప‌క్కన పెట్టేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ రాజ‌కీయం పోయి.. కుల రాజ‌కీయం రాజ్యమేలుతోంది. మ‌న పార్టీ వాడా కాదా ? అన్నది కాకుండా… మ‌న కులం వాడా ? ఏ పార్టీ అయినా ప‌ర్వాలేద‌న్న రాజ‌కీయం ప్రస్తుతం ఈ నేత త‌న నియోజ‌క‌వ‌ర్గంలో కంటిన్యూ చేస్తున్నాడు. ఇక అవినీతికి, దోపిడీకి అడ్డే లేద‌ని అంటున్నారు. ఆ మాట‌కు వ‌స్తే అధికార పార్టీలోనే కాకుండా గుంటూరు జిల్లాలోనే ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే ఇబ్బందికి గురయ్యేది ఆ నేతే అన్న చ‌ర్చ జిల్లాలోనే జోరుగా న‌డుస్తోంది.

వాళ్లకే పదవులు..కాంట్రాక్టులు….

ఎన్నిక‌ల్లో టీడీపీకి ప‌నిచేసిన‌… జ‌నసేన‌లో కీల‌కంగా వ్యవ‌హ‌రించిన త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల‌ను చేర‌దీసి.. కేవ‌లం త‌న కులం అన్న భావ‌న‌తోనే వాళ్లకు ప‌ద‌వులు కాంట్రాక్టులు క‌ట్టబెడుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నో ప‌ల్లెల్లో పార్టీ కోసం సంవ‌త్సరాలుగా ప‌నిచేసిన ఎస్సీ, బీసీ వ‌ర్గాల‌ను కాద‌ని.. త‌న కులం వాళ్లు నాలుగైదు కుటుంబాలు ఉన్నా వాళ్లకే పెత్తనం క‌ట్టబెట్టి వాళ్ల క‌నుస‌న్నల్లోనే రాజ‌కీయం న‌డిపిస్తోన్న ప‌రిస్థితి. దీంతో పార్టీలో మిగిలిన సామాజిక వ‌ర్గాల నేత‌లు అంద‌రూ ర‌గిలిపోతున్నారు. ఈ ప‌రిస్థితి వైసీపీలో స‌గ‌టు కార్యక‌ర్తకు కూడా ఎంత మాత్రం మింగుడు ప‌డ‌డం లేదు.

అందుబాటులో లేకుండా..?

నియోజ‌క‌వ‌ర్గంలో స్థానికంగా అందుబాటులో ఉండ‌ని ఆ ఎమ్మెల్యే గుంటూరులో ఉంటూ త‌న సామాజిక వ‌ర్గం నేత‌ల‌ను పెట్టుకుని.. వారితోనూ క‌మీష‌న్ల దందా న‌డిపిస్తున్నార‌ట‌. ఇక ఆయ‌న మామ కూడా వైసీపీలో కీల‌క ప‌ద‌విలో ఉండ‌డంతో అల్లుడికి వంత పాడుతున్నారు. ఎక్కడెక్కడో ఉన్న త‌మ బంధువుల‌ను కూడా తీసుకువ‌చ్చి నియోజ‌క‌వ‌ర్గంలో ఏ చిన్న ప‌ద‌వి ఉన్నా వారికి క‌ట్టబెట్టేస్తున్నారు. ఇక ఆయ‌న టీడీపీ మాజీ ఎమ్మెల్యేతో మిలాఖ‌త్ అయి ఆయ‌న‌పై నోరెత్తకుండా ఉండేందుకు ఆయ‌న‌తో కూడా క‌మీష‌న్ డీల్ కుదుర్చుకున్నాడ‌న్న టాక్ జిల్లాలో కోడై కూస్తోంది. ఈ ఎమ్మెల్యే ఆ మాజీ ఎమ్మెల్యే ఎవ‌రూ ఎవ‌రిపై చిన్న విమ‌ర్శ కూడా చేసుకోక‌పోవ‌డ‌మే వీరి మిలాఖ‌త్ అనుమానాల‌కు ఊత‌మిచ్చేలా ఉంది.

తగ్గించుకోమని చెప్పినా……

జ‌గ‌న్‌తో పాటు పార్టీ ప‌రిశీల‌కులు సైతం స‌ద‌రు ఎమ్మెల్యేకు కాస్త త‌గ్గించుకోమ‌ని వార్నింగ్ ఇచ్చినా.. ఆ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌న‌కు సీటు వ‌స్తుందా ? వచ్చినా గెలుస్తామా ? అప్పుడు రాజెవ‌రో ? రెడ్డెవ‌రో ? రాక‌రాక వ‌చ్చిన అవ‌కాశం ఎందుకు వ‌దులుకుంటాను ? ఇప్పుడేగా నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాలి క‌దా ? అని త‌న తంతు మాత్రం ఆప‌డం లేద‌ట‌. మ‌రి స‌ద‌రు ఎమ్మెల్యే తీరుతో నియోజ‌క‌వ‌ర్గంలోనే కాక‌.. జిల్లాలోనే పార్టీకి చెడ్డపేరు వ‌చ్చేలా ఉంది.

Tags:    

Similar News