ఇద్దరూ తగ్గడం లేదుగా?

వైసీపీ అధికారంలో ఉంది. నేతలు సంయమనంతో వ్యవహరించాలని పదే పదే అధిష్టానం చెబుతున్నా నేతలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. యువనేతలు కూడా ఇందులో నుంచి మినహాయింపులేదు. తూర్పు [more]

Update: 2020-10-27 06:30 GMT

వైసీపీ అధికారంలో ఉంది. నేతలు సంయమనంతో వ్యవహరించాలని పదే పదే అధిష్టానం చెబుతున్నా నేతలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. యువనేతలు కూడా ఇందులో నుంచి మినహాయింపులేదు. తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు యువనేతల మధ్య ఏర్పడిన విభేదాలు పార్టీ హైకమాండ్ కు తలనొప్పి తెప్పిస్తుంది. ఎవరినీ కాదనలేని పరిస్థితి. ఎవరినీ ఒప్పించలేని స్థితి. వారే ఎంపీ మార్గాని భరత్. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.

మొదటి సారి గెలిచినా…..

ఇద్దరూ మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన వారే. సొంత బలం కంటే జగన్ బొమ్మతోనే వీళ్లిద్దరూ గెలిచారని ఎవరైనా సులువుగా చెప్పేయగలరు. చిన్న వయసులోనే రాజమండ్రి ఎంపీ భరత్ ఎంపికయ్యారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన భరత్ యువకుడు కావడంతో పార్లమెంటులోనూ ఆయనకు పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. పదవులను కట్టబెట్టింది. అయితే తన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను కలుపుకునిపోవడంలో భరత్ విఫలమయ్యారని చెప్పవచ్చు.

రాజానగరం నుంచి గెలిచినా….

ఇక జక్కంపూడి రాజా కూడా తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు మరణం తర్వాత వారి ఇంట్లో గెలుపు పిలుపు విన్పించలేదు. మొన్నటి ఎన్నికల్లో జగన్ రాజానగరం టిక్కెట్ ఇవ్వడంతో గెలుపొందారు. జగన్ కూడా ఆయనకు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఇచ్చారు. తొలిసారి ఎమ్మెల్యే అయినా రాజా నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించి మరోసారి గెలుపు కోసం ప్రయత్నించాలి. కానీ జక్కంపూడి రాజా అనవరసర వివాదాలకు వెళుతున్నారన్న టాక్ పార్టీలో విన్పిస్తుంది.

ఆధిపత్యం కోసం…..

అయితే ఇద్దరూ తొలసారి గెలిచినా ఇద్దరిలో ఏ ఒక్కరూ తగ్గకపోవడంతో రోజురోజుకూ విభేదాలు పెరిగిపోతున్నాయి. ఎవరికి వారే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. రాజానగరం నుంచి గెలిచిన జక్కంపూడి రాజా ఇప్పుడు రాజమండ్రి సిటీపై కూడా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుండటంతో వివాదం మరింత పెరిగింది. వీరిద్దరిని అధిష్టానం కట్టడి చేయకుంటే తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందంటున్నారు. క్యాడర్ లో కూడా రెండు వర్గాలుగా విడిపోవడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతుంది.

Tags:    

Similar News