వైసిపి లో నామినేటేడ్ పదవుల భర్తీకి గ్రూప్ ల సెగ?

వైసిపి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిపొయింది. పార్టీ ని అధికారంలోకి తెచ్చేందుకు దాదాపు దశాబ్ద కాలం శ్రమించిన పార్టీ క్యాడర్ ఆశలు ఎట్టకేలకు ఫలించినా వారు [more]

Update: 2020-06-13 02:00 GMT

వైసిపి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిపొయింది. పార్టీ ని అధికారంలోకి తెచ్చేందుకు దాదాపు దశాబ్ద కాలం శ్రమించిన పార్టీ క్యాడర్ ఆశలు ఎట్టకేలకు ఫలించినా వారు దక్కుతాయన్న పదవులు మాత్రం అందని ద్రాక్ష గానే రాజమండ్రి లో మిగిలిపోయాయి. చిన్న చిన్న పోస్ట్ ల నుంచి కీలకమైన నామినేటెడ్ పదవుల వరకు భర్తీ కాకుండా ఉండిపోయాయి. దీనికి ప్రధానంగా వైసిపి లో ఉన్న గ్రూప్ ల ఆధిపత్య పోరే కారణమని క్యాడర్ ఆవేదనతో ఉంది. ఈ వ్యవహారం సరిదిద్దాలిసిన అధిష్టానం సైతం కిమ్మనకుండా చోద్యం చూస్తూ ఉండటంతో వైసిపి కార్యకర్తల్లో నైరాశ్యం రాజ్యమేలుతుంది.

ఆ రెండు గ్రూప్ లు ఒకే చెబితేనే …

రాజమండ్రిలో పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ రామ్ ది ఒక గ్రూప్ గా, రాజానగరం ఎమ్యెల్యే జక్కంపూడి రాజా వర్గం మరో గ్రూప్ గా కొనసాగుతున్నాయి. ఈ రెండు గ్రూప్ ల నడుమ సఖ్యత లేకపోవడంతో ఏ కార్యక్రమం జరిగినా ఎవరికి వారే యమునా తీరే మాదిరి వ్యవహారం నడుస్తుంది. వర్గ విభేదాలు ముదిరి పాకాన పడిన నేపథ్యంలో ఇప్పటికే భర్తీ కావలిసిన కీలక పోస్ట్ లకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ దక్కడం లేదు. గోదావరి అర్బన్ డెవలప్మెంట్ నుంచి మార్కెట్ యార్డ్ లు, దేవాలయ కమిటీలు, హితకారిణి సమాజం ఇలా అన్ని ఖాళీగానే ఉన్నాయి. వీటి భర్తీ ఎప్పటికి పూర్తి అవుతుందో ఏ నేత స్పష్టం చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. గత టిడిపి సర్కార్ పదవి నుంచి దిగే ఆరు నెలల ముందు మాత్రమే నామినేటెడ్ పదవుల భర్తీ చేసింది. వారిలో చాలామంది కొత్త ప్రభుత్వం వచ్చినా పదవుల నుంచి వైదొలగకపోవడం కూడా వైసిపి లో ఆశావహులకు నిరాశే మిగిల్చింది. అయితే కొత్త ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా వారి పదవులకు మంగళం పాడినా వైసిపిలో గ్రూప్ ల గోల తో నామినేటెడ్ పోస్ట్ లు ఊరిస్తూనే ఉన్నాయి.

సుబ్బారెడ్డి సమన్వయ లోపం …

ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా వ్యవహారాలు చూస్తున్న టిటిడి ఛైర్మెన్ వైవి సుబ్బారెడ్డి గ్రూప్ లను సమన్వయం చేయడంలో ఘోరంగా విఫలం అవుతున్నారన్న విమర్శలు వైసిపి వర్గాల్లో వినిపిస్తున్నాయి. రెండు ప్రధాన గ్రూప్ లను ఆయనే ప్రోత్సహిస్తున్నారని కొందరు అంతర్గతంగా విమర్శిస్తూ ఉంటే మరికొందరు ఆయనకు ఇతర వ్యాపకాలు అధికంగా ఉండటంతో తూర్పు రాజకీయాలపై సమయం కేటాయించలేకపోతున్నారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి పార్టీని పరుగులు పెట్టించాలిసిన క్యాడర్ మాత్రం నిరుత్సహంతో నిరాశపడిపోయింది.

జెండా మోసిన వారికి…..

తమ జగనన్న అధికారం చేపట్టినా జండా మోసిన వారికి నిరాశే మిగిలిందని ద్వితీయ శ్రేణి వర్గాలు రాజమండ్రిలో వాపోతున్నాయి. వాస్తవానికి రాజమండ్రి అర్బన్ రూరల్ లలో వైసిపి గత ఎన్నికల్లో పరాజయం పాలై బలహీనంగా కనిపిస్తుంది. అలాంటి చోట వైసిపిని బలోపేతం చేయాలంటే క్యాడర్ లోని ముఖ్యనేతలకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టి పార్టీలో జోష్ పెంచాలి. కానీ దీనికి భిన్నంగా గ్రూప్ రాజకీయాలతో వచ్చే పదవులకు సైతం ఒకరికి ఒకరు ఎసరు పెట్టుకోవడంతో వైసిపి పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా రాజమండ్రి అర్బన్ రూరల్ లో రాజ్యమేలుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News