అక్కడ వైసీపీలో ఆధిప‌త్య పోరు.. ఏం జ‌రుగుతోందంటే

ప్రకాశం జిల్లాలోని ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ వైసీపీ రాజ‌కీయాలు చింద‌ర వంద‌రగా మారాయి. పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కుడికి, ఇక్కడ నుంచి విజ‌యం సాధించిన ఎమ్మెల్యేకి మ‌ధ్య [more]

Update: 2020-07-13 13:30 GMT

ప్రకాశం జిల్లాలోని ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ వైసీపీ రాజ‌కీయాలు చింద‌ర వంద‌రగా మారాయి. పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కుడికి, ఇక్కడ నుంచి విజ‌యం సాధించిన ఎమ్మెల్యేకి మ‌ధ్య తీవ్ర ఆధిప‌త్య పోరు సాగుతోంది. ఇక్కడ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున కాపు వ‌ర్గానికి చెందిన మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌.. విజ‌యం సాధించారు. అయితే, ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో కొన్నేళ్లుగా రాజ‌కీయాలు చేసిన బూచేప‌ల్లి శివ‌ప్రసాద్‌రెడ్డి 2018లో పోటీ నుంచి త‌ప్పుకొని, ఇంచార్జ్ ప‌ద‌విని వ‌దులుకున్నారు. అయితే, ఇప్పుడు మాత్రం ఆయ‌న ప‌ట్టు కోసం ప్రయ‌త్నాలు చేస్తున్నారు. త‌న వ‌ర్గాన్ని క‌లుపుకొని రాజ‌కీయాలు చేస్తున్నారు.

2014లో ఓటమి పాలయి…

దీంతో ద‌ర్శి రాజ‌కీయాలు వేడెక్కాయి. విష‌యంలోకి వెళ్తే.. 2004లో బూచేప‌ల్లి సుబ్బారెడ్డి ఇక్కడ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజ‌యం సాధించారు. త‌ర్వాత ఆయ‌న‌ను వైఎస్ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. దీంతో ఆయ‌న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి నియోజ‌క‌వ‌ర్గంపై బూచేప‌ల్లి వ‌ర్గం ప‌ట్టు పెంచుకుంది. ఈ క్రమంలోనే 2009లో బూచేప‌ల్లి కుమారుడు శివ‌ప్రసాద్‌రెడ్డి పోటీ చేసి విజ‌యం సాధించారు. అనంత‌రం జ‌రిగిన రాజ‌కీయ పెనుమార్పులు, వైసీపీ ఆవిర్భావంతో ఈయ‌న జ‌గ‌న్‌కు జై కొట్టారు. ఈ క్రమంలోనే 2014లో వైసీపీ త‌ర‌ఫున ఇక్కడ నుంచి శివ‌ప్రసాద్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నిక‌ల్లో శివ‌ప్రసాద్ రెడ్డి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలిచి ఉంటే బూచేప‌ల్లి రాజ‌కీయ‌మే మారిపోయి ఉండేది.

ఇన్ ఛార్జి లను మారుస్తూ….

ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున శిద్దా రాఘ‌వ‌రావు.. విజ‌యం సాధించి మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. ఇక, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న శివ‌ప్రసాద‌రావు.. వైసీపీ త‌దుప‌రి ఎన్నిక‌ల్లో అంటే.. 2019లో అయినా అధికారంలోకి వ‌స్తుందో రాదో.. అనే సందేహంతో ఇంచార్జ్ ప‌ద‌విని వ‌దులుకున్నారు. దీనికితోడు ఆర్ధికంగా ఇబ్బందులు కూడా ఆయ‌న‌ను చుట్టుముట్టాయి. ఇంజ‌నీరింగ్ కాలేజీల అధినేత అయినా.. ఆర్థిక స‌మస్యలతో పార్టీకి ఎడ‌మొహం పెడ‌మొహంగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఇక్కడ నుంచి 2018లో త‌ప్పుకొన్నారు. దీంతో బాదం మాధ‌వ‌రెడ్డికి ఇంచార్జ్‌గా ఛాన్స్ ఇచ్చారు. అయితే, ఆయ‌నా నాలుగు నెల‌ల‌కే ఇన్‌చార్జ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకొన్నారు. ఈ క్రమంలోనే గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు నాలుగు నెల‌ల ముందు వేణుగోపాల్‌కు ఛాన్స్ ఇచ్చారు.

ఆధిపత్య రాజకీయాలకు…..

ఆయ‌న భారీ మెజార్టీతో గెలుపు గుర్రం ఎక్కారు. ఇక‌, అక్కడి నుంచి శివ‌ప్రసాద్‌రెడ్డి చ‌క్రం తిప్పడం ప్రారంభించారు. అరె.. నేనే పోటీ చేసి ఉంటే బాగుండేది క‌దా ? అనుకుంటూ.. ఆధిప‌త్య రాజకీయాల‌కు తెర‌దీశారు. నియోజ‌క‌వ‌ర్గంలో రెడ్డి వ‌ర్గం డామినేష‌న్ ఎక్కువ‌గా ఉండ‌డంతో ఈ వ‌ర్గాన్ని మొత్తాన్ని.. శివ‌ప్రసాద్ రెడ్డి చేతుల్లో పెట్టుకున్నార‌న్న ప్రచారం జ‌రుగుతోంది. పోలీసుల బ‌దిలీల‌తో పాటు ఇత‌ర అధికారుల బ‌దిలీల‌లో కూడా ఇద్దరి మ‌ధ్య తీవ్రమైన వైరుధ్యం ఏర్పడింది. ఇక ప్రకాశం జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్సన్ ప‌ద‌వి శివ‌ప్రసాద్ రెడ్డి త‌ల్లి వెంకాయ‌మ్మకు ఇస్తార‌న్న ప్రచారం నేప‌థ్యంలో ద‌ర్శిలో అన్ని శిలాఫల‌కాల‌పై త‌న త‌ల్లి పేరు వేయాల‌ని శివ‌ప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు.

ఇద్దరి మధ్య విభేదాలు…..

ఇంకా స్థానిక సంస్థల ఎన్నిక‌లే జ‌ర‌గ‌నందున అలాంటివేమి జర‌గ‌వ‌ని వేణుగోపాల్ చెపుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నియోజ‌క‌వ‌ర్గంలో తాను స్ట్రాంగ్ అవ్వాల‌ని శివ‌ప్రసాద్ రెడ్డి ప‌ట్టుకోసం ప్రయ‌త్నాలు చేస్తుంటే.. వేణుగోపాల్ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వకుండా మందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే, శివ‌ప్రసాద్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ ప‌రిణామాల‌తో ద‌ర్శి వైసీపీలో నువ్వా-నేనా అనే రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి. శివ‌ప్రసాద్ ఎత్తులు, చాప‌కింద రాజ‌కీయం నేప‌థ్యంలో ఎమ్మెల్యే వేణుగోపాల్ కూడా అంతే రేంజ్‌లో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. దీంతో ద‌ర్శి రాజ‌కీయాలు వేడెక్కాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News