ఈమె కూడా టిక్కెట్ రేసులో ఉన్నట్లేనా… ?

భీమిలీ విశాఖ జిల్లాలో కీలకమైన నియోజకవర్గం. ఎవరి కన్ను అయినా ఈ సీటు మీదనే ఉంటుంది. ఒక విధంగా భీమిలీ స్వీట్ సీటే కాదు, హాట్ సీటు [more]

Update: 2021-09-20 14:30 GMT

భీమిలీ విశాఖ జిల్లాలో కీలకమైన నియోజకవర్గం. ఎవరి కన్ను అయినా ఈ సీటు మీదనే ఉంటుంది. ఒక విధంగా భీమిలీ స్వీట్ సీటే కాదు, హాట్ సీటు కూడా. తెలుగుదేశం పార్టీ తో పాటు వైసీపీకి కూడా ఈ సీటు మీద మోజు ఎక్కువే. దశాబ్దాల పాటు టీడీపీ ఇక్కడ పాగా వేసింది, కంచుకోటగా చేసుకుంది. ఇక్కడ నుంచే ఎంతో మంది నాయకులు కూడా ఆ పార్టీకి తయారయ్యారు. ఇదిలా ఉంటే భీమిలీ వైసీపీలో సైతం కొత్త నాయకులు అనేక మంది తయారవుతున్నారు. వారందరి చూపు ఎమ్మెల్యే టికెట్ మీదనే ఉంది. అసలే మంత్రి గా ఉన్న అవంతి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు ఇది. దాంతో ఈ కొత్త పోటీ ఏంటి అన్న చర్చ కూడా సాగుతోంది.

ఆమె అలా ముందుకు …

భీమిలీ నుంచి వచ్చిన అక్రమాని విజయనిర్మల ఈ రోజు విశాఖలో కీలక మహిళా నేతగా మారిపోయారు. ఆమెకు 2019 ఎన్నికల్లో జగన్ విశాఖ తూర్పు నియోజకవర్గం సీటు ఇచ్చారు. ఇక తాజాగా జరిగిన నామినేటెడ్ పందేరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విఎమ్మార్డీయే చైర్ పర్సన్ గా కూడా పదవిని ఇచ్చి విశాఖ రాజకీయాల్లో ఆమె ప్రాధాన్యతను మరింతగా పెంచారు. అక్రమాని విజయనిర్మల పూర్వాశ్రమంలో భీమిలీ వైస్ చైర్మన్ గా పనిచేశారు. ఆమె అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థితికి చేరుకున్నారు. ఇపుడు అక్రమాని విజయనిర్మలతో నాడు టీడీపీ తరఫున పోటీ పడిన మరో మహిళా నేత కూడా వైసీపీలో చేరి తన సత్తా చాటుతున్నారు.

ప్రభావం ఎక్కువే…

తెలుగుదేశం పార్టీ ప్రభలు బాగా వెలిగిపోతున్నపుడు భీమిలీ మునిసిపాలిటీ చైర్ పర్సన్ గా తెలుగుదేశం తరఫున గెలిచిన నేత కొప్పుల ప్రభావతి. ఆమె బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. ఆమె భర్త రమేష్ టీడీపీలో చురుకైన నాయకుడు. ఇక ప్రభావతి చైర్ పర్సన్ గా ఉన్నపుటే అక్రమాని విజయనిర్మల వైస్ చైర్మన్ గా చేశారు. ఇపుడు విజయనిర్మల కీలకమైన పొజిషన్లో ఉన్నారు. దాంతో తాను కూడా అంత ఎత్తుకు ఎదగాలని ప్రభావతి గట్టి ప్లానే వేసుకున్నారు. ఆమె వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మద్దతుతో వైసీపీలో చేరారు. ఇలా చేరడమేంటి అలా ఆమెను జీవీఎంసీలో కో ఆప్షన్ మెంబర్ గా వైసీపీ చేసేసింది. ఆమె ఇపుడు భీమిలీ రాజకీయాల్లో ఆ పదవితో తన ప్రభావం చూపించనున్నారు.

గట్టి పోటీనే…?

భీమిలీ మునిసిపాలిటీలో ప్రభావతి సామాజికవర్గం ఎక్కువగా ఉంది. అలాగే ఆమెకు కూడా గట్టి పట్టుంది. దీంతో రానున్న రోజులలో భీమిలీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని టాక్. అసలు ఆమెను పార్టీలోకి తీసుకోవడం వెనక కూడా చాలా కధ ఉందని అంటున్నారు. అవంతి శ్రీనివాసరావు నాన్ లోకల్. మరి లోకల్ కార్డుతో ప్రభావతిని రంగంలోకి దింపితే గెలుపు ఖాయమే కాకుండా అవంతి సహా ఎవరూ నోరెత్తే ఛాన్స్ ఉండదు అని వైసీపీ హై కమాండ్ ఏవో లెక్కలు వేసుకున్నట్లుగా ఉందిట. అలాగే బీసీకి, అందునా మహిళకు టికెట్ ఇచ్చామని చెప్పుకోవడానికి భీమిలీని ఇండైరెక్ట్ గా తమ కంట్రోల్ లో పెట్టుకోవడానికి వైసీపీ పెద్దలు వ్యూహాత్మకంగానే ప్రభావతిని రంగంలోకి దింపారని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రభావతి ఏ రేంజిలో తన సత్తా చాటుతారో.

Tags:    

Similar News