అతి చేస్తే అంతమే కదా?

ఏపీలో రాజకీయం దేశంలోని ఇతర రాష్ట్రాలకు భిన్నం. ఓ విధంగా తమిళనాడు తరహాలో సాగుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడలాగానే ఇక్కడా రెండు కుటుంబాల మధ్య కొన్ని దశాబ్దాలుగా [more]

Update: 2019-11-07 14:30 GMT

ఏపీలో రాజకీయం దేశంలోని ఇతర రాష్ట్రాలకు భిన్నం. ఓ విధంగా తమిళనాడు తరహాలో సాగుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడలాగానే ఇక్కడా రెండు కుటుంబాల మధ్య కొన్ని దశాబ్దాలుగా వైరం రాజకీయాల్లోనూ ప్రతిబింబిస్తోంది. ఇక రెండు ప్రాంతీయ పార్టీల కల్చర్ గత పదేళ్ళుగా ఏపీలో కూడా వచ్చేసింది. వైఎస్సార్, నారా ఫ్యామిలీ నుంచి రెండు తరాలు ఇపుడు పొలిటికల్ రేసులో సై అంటే సై అంటున్నారు. ఒకరికి ఒకరు ప్రత్యర్ధులు అన్న సంగతిని ఎపుడో మరచిపోయారు. రాజకీయ శత్రువులుగా భావించి కాలు దువ్వుతున్నారు. పొలిటికల్ సీన్ నుంచి ఒకరినికి ఒకరు ఎలిమినేషన్ చేయాలని గట్టిగానే యుధ్ధం చేస్తున్నారు. దీంతో ప్రతి చిన్న సమస్యను చిరిగి చాటను చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో ఇపుడు వైసీపీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. టీడీపీకి అయితే అధికారం అన్నది అలవాటు అయిపోయిన వ్యహహారమే. పైగా పాతుకుపోయి ఉండడంతో వ్యవస్థలను సైతం గుప్పిట పట్టడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్యలా ఉంది.

రంగుల మోజేంటో…..

ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ రంగులు సర్కారీ భవనాలు ఇష్టం వచ్చినట్లుగా పులిమేయడం ఏపీలో సాధారణ విషయం అయిపోయింది. అయిదేళ్ల పాటు ఏపీలో రాజ్యం చేసిన టీడీపీ అన్నింటికీ పసుపు రంగు పులిమేస్తూ సంబరపడిపోయింది. ఇక మాదే రాజ్యం, మేమే శాశ్వతం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చింది. టీడీపీ రంగూ హంగూ ఎంతవరకూ వచ్చాయంటే ఆఖరుకు మరుగుదొడ్లను సైతం వదలకుండా పూర్తిగా పసుపు పూసేసి దర్జా చేశారు. ఇక ప్రచార‌ యావ చూసుకుంటే ఆర్టీసీ బస్సులు టీడీపీ వాకిటి వాహనాలు అయిపోయాయి. వాటి మీద చంద్రన్న బొమ్మలు, నినాదాలు, జేజేలతో చికాకు పుట్టించేలా పబ్లిసిటీ పిచ్చితో హోరెత్తించారు. ఆఖరుకు మహానాడు వేడుకలలో అప్పడాలను సైతం వదలలేదు, చంద్రబాబు బొమ్మతో అప్పడాలు మీద ముద్రించడం బాబు నాటి ప్రచార పటాటోపానికి పరాకాష్ట. ఇపుడు అదే తీరులో వైసీపీ కధ కూడా సాగుతోంది.

హోళీ ఆడేస్తున్నారు…..

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటోంది వైసీపీ సర్కార్. చంద్రబాబు పాలనతో మరుగుదొడ్ల వరకే ప్రచారం ఆగితే ఇపుడు ఏకంగా శ్మశానాల వరకూ కూడా వైసీపీ దాన్ని ముందుకు తీసుకుపోయింది. వైసీపీ మూడు రంగులను కలగలిపి మరీ తేడా పాడా చూడకుండా ఎక్కడపడితే అక్కడ పూసేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు కూడా మూడు రంగులు పులిమేసి మా పాలన చూసుకోమంటున్నారు. కొత్తగా వచ్చిన గ్రామ సచివాలయాల వ్యవ‌స్థ గురించి అసలు చెప్పనక్కరలేదు. కొత్త బిల్డింగులన్నీ వైసీపీ రంగులతో హోళీ చేసుకుంటున్నాయి. దీని మీద టీడీపీ, బీజేపీ నాయకులు గట్టిగా తగులుకుంటున్నారు. ఇదేం తీరు అంటూ ఆక్షేపిస్తున్నారు.

కొత్త రంగులు అందుకే…..

అయితే టీడీపీకి ఆ అర్హత లేదని వైసీపీ నేతలు అంటున్నారు. తాము కొత్త వ్యవస్థను సృష్టించామని, అందుకే సచివాలయాలకు రంగులు అద్దుతున్నామని విశాఖ జిల్లా పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఘాటుగా జవాబు చెబుతున్నారు. గతంలో పంచాయతి భవనాలు చావు కళతో ఉంటే వాటికి పెళ్ళి కళను తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన సమర్దించుకుంటున్నారు. ఎవరు పాలన చేసినా ప్రజల సొమ్ముతోనే కదా, ఈ మాత్రం దానికి మంది సొమ్ము ఇలా ఖర్చు చేయడమేంటని జనంలోనూ కొంత చికాకు కనిపిస్తోంది. మరి ముఖ్యమంత్రి జగన్ కి తెలిసే ఇవన్నీ చేస్తున్నారా లేక అతి ఉత్సాహంతో అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రౌండ్ లెవెల్లో చేస్తున్న హడావుడా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా అతి ఎపుడూ మంచిది కాదన్నది అంతా గుర్తు పెట్టుకోవాలి.

Tags:    

Similar News