కొత్త స్నేహాలు…ఎంతదాకా… ?

ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే వైసీపీది ఒంటరి పోరే. నేనొక్కడినే అంటారు జగన్. ఆయన పదేళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీతో జట్టుకట్టలేదు. తన కష్టాన్ని నమ్ముకున్నారు. జనాలలో [more]

Update: 2021-08-24 02:00 GMT

ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే వైసీపీది ఒంటరి పోరే. నేనొక్కడినే అంటారు జగన్. ఆయన పదేళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీతో జట్టుకట్టలేదు. తన కష్టాన్ని నమ్ముకున్నారు. జనాలలో ఆదరణ పెంచుకున్నారు. మరో వైపు చూస్తే టీడీపీకి పొత్తు పొడిస్తే కానీ తెల్లారే సీన్ ఉండదు. కానీ ఏ పార్టీ వంకా చూడని మచ్చ లేని రికార్డు వైసీపీకే ఉందని చెప్పాలి. అటువంటి వైసీపీ ఇపుడు వామపక్షాల వైపు మొగ్గు చూపుతోందా అన్న చర్చ అయితే వస్తోంది.

దోస్తీతో కుస్తీ..?

వైసీపీ ఎన్నడూ లేని విధంగా కామ్రేడ్స్ తో భుజం కలుపుతోంది. వారి పక్కన కూర్చుని బీజేపీ వ్యతిరేక నినాదాలు ఇస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం ఇలా వామపక్షాలను వైసీపీకి దగ్గర చేసింది. మరీ ముఖ్యంగా సీపీఎం తో వైసీపీ చెలిమి చర్చగానే ఉంది. విశాఖ కార్పోరేషన్ లో సీపీఐ కార్పోరేటర్ ఒకరు ఉన్నారు. ఆయన విశాఖ సిటీలో బలమైన నేత. స్టీల్ ప్లాంట్ కి మద్దతుగా కార్పోరేటర్లు అంతా ఆందోళన చేపట్టాలని ఆయన మేయర్ కి సూచించారు. అంతే సై అంటూ వైసీపీ కార్పోరేటర్లు అంతా రంగంలోకి దిగిపోయారు.

విజయసాయిరెడ్డితో కలసి….

మరో వైపు విశాఖలో సీనియర్ మోస్ట్ సీపీఎం నేతలు ఉన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు అయిన సీహెచ్ నరసింగరావు విజయసాయిరెడ్డిల మధ్యన మంచి స్నేహం సాగుతోంది. స్టీల్ ప్లాంట్ ఇష్యూ వచ్చాక ఈ సాన్నిహిత్యం మరింతగా పెరిగింది. సీపీఎం నేతలు అయితే ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇస్తూ కలివిడిగా ఉంటున్నారు. సీపీఐ తో పోలిస్తే సీపీఎం వైసీపీతో కలసి ఆందోళలను చేసేందుకు సిద్ధపడుతోంది. ఈ నేపధ్యంలో ఉక్కు కర్మాగారం విషయంలో విశాఖ రాజకీయ పార్టీలు చీలిపోయాయి. తెలుగుదేశం దారి వేరుగా ఉంది.

కొత్త సమీకరణలా..?

ఏపీలో ఒకసారి అధికారంలోకి వచ్చిన వైసీపీకి తత్వం బాగా బోధపడి ఉంటుంది అంటున్నారు. పొత్తులు ఎత్తులు అన్నీ కూడా ఈసారి బాగా ఉపయోగపడతారు అని చెబుతున్నారు. వైసీపీ కూడా మిత్రుల ఆవశ్యకతను నెమ్మదిగా గ్రహిస్తోంది అని కూడా మాట వినిపిస్తోంది. అందరినీ శత్రువులుగా చేసుకుని ముందుకు సాగడం అంటే బహు కష్టమే కాకుండా రాజకీయంగా కూడా తగిన వ్యూహం కాదు అన్నది కూడా ఆ పార్టీకి అర్ధమవుతోంది అని కూడా విశ్లేషిస్తున్నారు. అందువల్ల రేపటి రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అని కూడా అంటున్నారు. మొత్తానికి సీపీఎం తో దోస్తీ వైసీపీని ఎక్కడిదాకా తీసుకువెళ్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News