ఆ విషయంలో వైసీపీ పుంజుకుందా..?

గత ఎన్నికల ముందు వరకు ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి వస్తున్నారనే అంచనాలు ఉన్నాయి. జగన్ సభలకు ప్రజల నుంచి బాగా స్పందన వచ్చింది. సమైక్యాంధ్ర కోసం [more]

Update: 2019-04-11 01:30 GMT

గత ఎన్నికల ముందు వరకు ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి వస్తున్నారనే అంచనాలు ఉన్నాయి. జగన్ సభలకు ప్రజల నుంచి బాగా స్పందన వచ్చింది. సమైక్యాంధ్ర కోసం చివరి వరకు పోరాటం చేయడం, తండ్రి వైఎస్ మృతితో సానుభూతి ఉండటం వంటి అనేక కారణాల వల్ల జగన్ పట్ల 2014 ఎన్నికల్లో ప్రజల్లో సానుకూలత వ్యక్తమైంది. జగన్ కచ్చితంగా అధికారం చేపడతారని అంతా అంచనా వేశారు. అయితే, చివరకు అధికారానికి సమీపానికి వచ్చి జగన్ ఆగిపోయారు. చంద్రబాబు తన అనుభవం, రాజకీయ చతురతతో చివరి నిమిషంలో పుంజుకొని అధికారాన్ని చేపట్టారు. ఎన్నికల నాటికి జగన్ వెనుకబడటానికి, చంద్రబాబు దూసుకెళ్లడానికి ప్రధాన కారణాల్లో ఒకటి పోల్ మేనేజ్ మెంట్.

పోల్ మేనేజ్ మెంట్ లో ముందున్న టీడీపీ

అనేక ఎన్నికలను ఎదుర్కున్న చంద్రబాబు నాయుడు పోల్ మేనేజ్ మెంట్ లో దిట్ట. తెలుగుదేశం పార్టీకి ప్రతీ గ్రామంలో, ప్రతీ వార్డులో బలమైన క్యాడర్ ఉంది. దీంతో పోల్ మేనేజ్ మెంట్ లో ఆ పార్టీ ఎన్నికల రోజు మ్యాజిక్ చేసింది. సరైన వ్యూహంతో ఓట్లేయించుకొని విజయం సాధించింది. వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అయ్యింది. ఆ పార్టీ ఎదుర్కున్న మొదటి ఎన్నిక కావడం, పార్టీకి బూత్ స్థాయిలో బలమైన క్యాడర్ లేకపోవడం, కొత్త పార్టీ కావడం, పోల్ మేనేజ్ మెంట్ పై దిశానిర్దేశం చేసే వ్యవస్థ లేకపోవడం, కొత్త అభ్యర్థులే ఎక్కువగా పోటీ చేయడం వంటి కారణాలతో ఆ పార్టీ దెబ్బతింది. తెలుగుదేశంతో పోల్చుకుంటే ఈ విషయంలో వైసీపీ చాలా వెనుకబడింది. దీంతో అధినేత జగన్ కు ఇమేజ్ ఉన్నా పార్టీ ఓడిపోయింది. చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. అయితే, ఈసారి కచ్చితంగా అధికారం చేపట్టాలని పట్టుదలగా ఉన్న వైసీపీ గత ఎన్నికల్లో చేసిన తప్పులను మళ్లీ చేయొద్దని పట్టుదలగా ఉంది.

బూత్ స్థాయిలో బలపడ్డ వైసీపీ క్యాడర్

పోల్ మేనేజ్ మెంట్ లో విఫలమైనట్లు గత ఎన్నికల ఫలితాల తర్వాత గుర్తించిన ఆ పార్టీ ఈ విషయంపై అప్పటి నుంచే దృష్టి పెట్టింది. అన్ని నియోజకవర్గాల్లో బూత్ లెవల్ కమిటీలు వేసుకుంది. పార్టీలోకి చేరికలు కూడా ఉండటం, బలమైన నేతలు పార్టీలోకి రావడం, ఎక్కువగా పాత నాయకులే అభ్యర్థులుగా ఉండటంతో పోల్ మేనేజ్ మెంట్ సమస్యను వైసీపీ ఈసారి అధిగమించే అవకాశం ఉంది. జగన్ సైతం ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు బూత్ లెవల్ కమిటీలతో సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో చాలాచోట్ల బూత్ ల వారీగా పార్టీకి బాధ్యతలు స్వీకరించే క్యాడర్ లేదు. ఈసారి మాత్రం ప్రతీ బూత్ కు క్యాడర్ తయారైంది. దీంతో పోల్ మేనేజ్ మెంట్ లో వైసీపీ గతం కంటే బాగా పుంజుకున్నట్లు కనిపిస్తోంది. కేవలం, పార్టీకి, అధినేత జగన్ కు ప్రజల్లో సానుకూలత ఉంటే సరిపోదు. ఎన్నికల రోజు ప్రతీ బూత్ లో అనుసరించే వ్యూహం కూడా చాలా ముఖ్యం. ఈసారి కూడా జగన్ కు కొంత సానుకూలత కనిపిస్తోంది. సక్రమంగా పోల్ మేనేజ్ మెంట్ చేసుకుంటే విజయావకాశాలు కూడా మెరుగవుతాయనే అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News