ద్రోణంరాజు వారసుడికి ఎమ్మెల్సీ పదవి ?

స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ కుటుంబానికి ఉత్తరాంధ్రా రాజకీయాల్లో ఎంతో విశిష్ట స్థానం ఉంది. ఆ సంగతి అందరికీ తెలిసిందే. ఆయన శిష్య ప్రశిష్యులు రాజకీయంగా ఇపుడు ఉన్నత [more]

Update: 2020-10-27 13:30 GMT

స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ కుటుంబానికి ఉత్తరాంధ్రా రాజకీయాల్లో ఎంతో విశిష్ట స్థానం ఉంది. ఆ సంగతి అందరికీ తెలిసిందే. ఆయన శిష్య ప్రశిష్యులు రాజకీయంగా ఇపుడు ఉన్నత స్థానంలో ఉన్నారంటే దానికి కారణం ద్రోణంరాజు గురు స్థానంలో ఉంటూ తీర్చిదిద్దడమే. ఇక ఆయన కుమారుడు శ్రీనివాస్ కూడా తండ్రి నుంచే రాజకీయ ఓనమాలు దిద్దారు. ఆయన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని చూశారు. విద్యార్ధి కాంగ్రెస్ నాయకుడిగా అరంగేట్రం చేసి చట్ట సభల దాకా వచ్చారు. ఎన్నో కీలక‌మైన పదవులు దక్కించుకున్నారు. కానీ బ్యాడ్ లక్ తో చిన్న వయసులోనే ఆయన కన్నుమూశారు.

వారసుడు రావాలి…

ద్రోణంరాజు కుటుంబంలో మూడవ తరం రాజకీయాల్లోకి రావాలని ఇపుడు అంతా కోరుకుంటున్నారు. ముఖ్యంగా శ్రీనివాస్ అభిమానులైతే ఆయన కుమారుడికి వైసీపీ మద్దతుగా నిలవాలని ఆశిస్తున్నారు. విశాఖ సౌత్ లో ఉన్న ద్రోణంరాజు శ్రీనివాస్ అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున వచ్చి కుమారుడు శ్రీవాత్సవ్ కి మద్దతు ఇస్తున్నారు. తండ్రి బాటన నడవాలని కూడా సూచిస్తున్నారు. దాంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ఉన్న ద్రోణంరాజు శ్రీ వాత్సవ్ అనివార్యంగా రాజకీయ రంగప్రవేశం చేయడానికి రెడీ అయ్యారు. ఇక పైన తాను తండ్రి, తాత ఆశయాలు నెరవేరుస్తాను అని అంటున్నారు.

ఆదుకుంటాం …

మరో వైపు వైసీపీ పెద్దలు కూడా ద్రోణంరాజు శ్రీవాత్సవ్ ని ప్రోత్సహిస్తున్నారు. తప్పకుండా పార్టీ అండగా నిలిచి ఆదుకుంటుందని కూడా హామీ ఇస్తున్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్ సంతాప సభలో ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జి, ఎంపీ విజయసాయిరెడ్డి అయితే శ్రీనివాస్ వారసత్వాన్ని కొనసాగించమని సభాముఖంగా శ్రీవాత్సవ్ ని కోరారు. తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని శ్రీనివాస్ తనకు అఖరుసారిగా ఫోన్ చేసి కోరిన సంగతిని కూడా విజయసాయిరెడ్డి చెబుతూ తాను ఆ హామీని నెరవేరుస్తాను అని చెప్పుకొచ్చారు. దాంతో విశాఖ జిల్లా రాజకీయాల్లో కొత్త వారసుడు రంగప్రవేశానికి అంతా సిద్ధమైపోయింది.

జగన్ చేతుల్లోనే ….

త్వరలోనే ద్రోణంరాజు శ్రీవాత్సవ్ ముఖ్యమంత్రి జగన్ కి స్వయంగా కలుస్తారు అని అంటున్నారు. ఆయన్ని తీసుకుని వెళ్ళి ఆదుకోవాలని జగన్ని కోరడానికి విజయసాయిరెడ్డి సుముఖంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మధ్యనే విజయనగరానికి చెందిన సీనియర్ వైసీపీ నేత సాంబశివరాజు మరణించారు. ఆయన వారసుడిగా కుమారుడికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి జగన్ గౌరవించారు. ఇపుడు అదే బాటలో శ్రీనివాస్ కుమారుడికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇప్పించడానికి వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన ద్రోణంరాజు కుటుంబం మద్దతు వైసీపీకి కావాలి. విశాఖ సిటీ పరిధిలో ఆ సామాజికవర్గం పెద్ద ఎత్తున ఉంది. దాంతో రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో గెలవడానికి ఇది ఉపయోగపడుతుంది అంటున్నారు. మొత్తానికి జగన్ కరుణిస్తే మరో వారసుడు ఎమ్మెల్సీ అవుతాడు అంటున్నారు.

Tags:    

Similar News