ఫ్యాన్ స్పీడ్ పెరిగింది

వైసీపీ మడి కట్టుకుని కూర్చోవడానికి సిధ్ధంగా లేదని తేలిపోయింది. అదీ రాజకీయ పార్టీయే. నీతులు చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ అన్ని పార్టీలు వాటిని పాటిస్తేనే ఎవరైనా [more]

Update: 2019-09-27 05:00 GMT

వైసీపీ మడి కట్టుకుని కూర్చోవడానికి సిధ్ధంగా లేదని తేలిపోయింది. అదీ రాజకీయ పార్టీయే. నీతులు చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ అన్ని పార్టీలు వాటిని పాటిస్తేనే ఎవరైనా ఏమైనా చేయగలుగుతారు. అక్కడికీ జగన్ అధికారంలోకి వచ్చాం కదా అని విపక్ష ఎమ్మెల్యేలకు గాలం వేయడంలేదు. ఫిరాయింపులకు తాను వ్యతిరేకమని చెప్పేశారు. ఎవరు తన పార్టీలోకి వచ్చినా ఆ పార్టీకి, ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీరాలని షరతు పెట్టారు. అయితే ఇతర పార్టీ నాయకులను తీసుకునే విషయంలో మాత్రం జగన్ అలాంటి నిబంధనలు పెట్టుకోదలచుకోలేదు. వారిని వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకోవాలనుకుంటున్నారు. ఆ విధంగా వైసీపీని బలోపేతం చేసుకోవాలని స్థానిక ఎన్నికలను ఏకపక్షం చేసుకోవాలని భావిస్తున్నారు.

బలమైన నాయకులతో….

ఇక బలమైన నాయకులను వైసీపీలోకి ఆహ్వాహించడం ద్వారా జగన్ ఏపీలో వైసీపీని పటిష్టం చేయదలచుకున్నారు. ఈ క్రమంలో జనసేన, టీడీపీలలో ఉన్న బలమైన నాయకులకు గాలం వేస్తున్నారు. బీజేపీ నుంచి జనసేన తరఫున తాజా ఎన్నికల్లో రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆకుల సత్యనారాయణను వైసీపీలోకి తీసుకునేందుకు పచ్చ జెండా ఊపేశారని టాక్. ఆయన కనుక వస్తే పార్టీ బలం పెరగడమే కాదు, లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి గెలుపు ఖాయమని లెక్కలేసుకుని మరీ తీసుకువస్తున్నారని సమాచారం. దసరా పండుగ తరువాత మంచి ముహూర్తం చూసుకుని మరీ ఆకుల వైసీపీ కండువా కప్పుకుంటారని టాక్. ఇదే విధంగా జనసేనలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం వైసీపీ వైపు చూస్తున్నట్లుగా టాక్. వారిని చేరదీయడం ద్వారా అక్కడ పార్టీని గట్టిపరచుకోవడమే కాకుండా జనసేన లేకుండా చేసినట్లవుతుందన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా చెబుతున్నారు.

టీడీపీకి దెబ్బ….

ఇక కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చినా టీడీపీకి క్షేత్ర స్థాయిలో బలం ఉంది. ఆ సంగతి జగన్ కి బాగా తెలుసు. పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలపైన ఇపుడు వైసీపీ చూపు పడిందని అంటున్నారు. అయిదేళ్ళ పాటు పార్టీ అధికారంలో ఉన్నా కూడా తమ్ముళ్లకు పదవులు దక్కలేదు. అలా అసంతృప్తి తో ఉన్న వారిని ఆకట్టుకుని ఫ్యాన్ నీడకు చేర్చడం ద్వారా టీడీపీకి గట్టి దెబ్బ కొట్టాలని చూస్తున్నారట. ఇక ఏపీలో కోస్తా, గోదావరి జిల్లాలో ఈ రకమైన ఆపరేషన్ వైసీపీ వేగవంతం చేసిందని చెబుతున్నారు. అదే కనుక జరిగితే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎదురు లేకుండా పోతుంది. అదే సమయంలో టీడీపీకి కాపు కాసే వారు కూడా దొరకని పరిస్థితి ఉంటుందని అంటున్నారు. వైసీపీ తలుపులు బార్లా తెరచిన వేళ పసుపు శిబిరం వణుకుతోంది ఏం జరుగుతుందో చూడాలి మరి

Tags:    

Similar News