వారు టచ్ లోకి వచ్చేశారట

గ‌త ఐదేళ్లపాటు ఏపీలో అధికారం చ‌లాయించిన టీడీపీలో ఇప్పుడు పార్టీ అస్తిత్వానికే పెను ప్రమాదం పొంచి ఉందా ? నాయ‌కులు పార్టీపై న‌మ్మకాన్ని కోల్పోతున్నారా ? ఒక‌ప‌క్క [more]

Update: 2019-12-25 03:30 GMT

గ‌త ఐదేళ్లపాటు ఏపీలో అధికారం చ‌లాయించిన టీడీపీలో ఇప్పుడు పార్టీ అస్తిత్వానికే పెను ప్రమాదం పొంచి ఉందా ? నాయ‌కులు పార్టీపై న‌మ్మకాన్ని కోల్పోతున్నారా ? ఒక‌ప‌క్క టీడీపీపై ప్రజ‌ల‌కు విశ్వాసం సన్నగిల్లడం, పార్టీలో చంద్రబాబు త‌ర్వాత ఎవ‌రు పార్టీని న‌డిపిస్తారు ? అనే ప్రశ్న వ‌చ్చిన‌ప్పుడు స‌మాధానం లభించ‌క‌పోవ‌డం వంటి ప‌రిణామాల‌ను చూస్తుంటే.. పార్టీలోని సీనియ‌ర్లు స‌హా జూనియ‌ర్లు కూడా ఇక‌, పార్టీలో ఉండి ప్రయోజ‌నం ఏంట‌నే ఆలోచ‌న‌లో ప‌డిపోతున్నారు. ఇదిలావుంటే, అధికార పార్టీ వైసీపీ దూకుడు పెంచుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్రభంజ‌నం సృష్టించిన పార్టీ. ఎవ‌రు అవున‌న్నా.. కాదన్నా.. కూడా గ‌డిచిన ఆరు మాసాల్లో ప్రజ‌ల‌కు మ‌రింత చేరువైంది.

దీపం ఉండగానే…

అనేక ప‌థ‌కాలు, నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాల‌తో ప్రభుత్వం దూసుకుపోతోంది. దీంతో అన్ని వ‌ర్గాల ప్రజ‌లు కూడా ఇప్పుడు వైసీపీకి జై కొడుతున్నారు. ఇక సంక్రాంతి త‌ర్వాత జ‌రిగే స్థానిక సంస్థల ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆరు మాసాల్లోనే ప‌రిస్థితి ఇలా ఉంటే. వ‌చ్చే ఎన్నికల నాటికి మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు వైసీపీ చేసే ప్రయ‌త్నాలు ఊహిస్తే.. టీడీపీ వంటి పార్టీల‌కు డిపాజిట్లు కూడా గ‌ల్లంత‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న ఎమ్మెల్యేలు దీపం ఉండ‌గానే ప‌రిస్థితిని చ‌క్కదిద్దుకోవాల‌ని భావిస్తున్నారు.

ఎమ్మెల్సీలు సయితం…..

దీంతో అధికార పార్టీలోకి భారీ ఎత్తున వ‌ల‌స‌లు ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే, ఇప్పుడే తొంద‌ర ప‌డ‌కూడ‌ద‌ని భావిస్తున్న నాయ‌కులు కూడా క‌నిపిస్తున్నారు. మ‌రో నెల రోజుల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో టీడీపీ పుంజుకుంటే స‌రేస‌రి.. లేకుంటే మాత్రం త‌మ దారి తాము చూసుకోవాల‌ని ఇప్పటికే ఎమ్మెల్యే స్థాయి నాయ‌కులు, సీనియ‌ర్లు ఓ నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. ఇక‌, ఎమ్మెల్సీల విష‌యాన్ని తీసుకుంటే.. ప్రస్తుతం శాసన మండ‌లిలో టీడీపీకి మంచి బ‌లం ఉంది. దీంతో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల‌ను మండలి వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రభుత్వానికి ఒకింత ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్పడింది.

కొందరు ఎమ్మెల్యేలు….

ప్రతి కీల‌క బిల్లుల‌కు టీడీపీ మండ‌లిలో అడ్డు ప‌డుతుండ‌డంతో అస‌లు మండ‌లినే ర‌ద్దు చేస్తే.. పోలా? అనే దారిలో ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, వైసీపీకి చెందిన నాయ‌కులు మండ‌లిలో ఉండ‌డంతో జ‌గ‌న్ ఈ విష‌యంలో ఆచితూచి వ్యవ‌హ‌రిస్తున్నారు. అదే స‌మ‌యంలో మండ‌లి నుంచి కూడా జంపింగుల‌ను ప్రోత్సహించే అవ‌కాశం క‌నిపిస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరే ఎమ్మెల్సీల‌కు వైసీపీ నుంచి మ‌ళ్లీ ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వడ‌మో లేదా ? ఇత‌ర‌త్రా ప్రలోభాల‌తో త‌మ వైపున‌కు తిప్పుకోవ‌డ‌మో చేసేందుకు వైసీపీ రెడీగా ఉంద‌ట‌. అయితే అంద‌రు ఎమ్మెల్సీల విష‌యంలో ఈ ప్లాన్ వ‌ర్కవుట్ అవ్వక‌పోయినా త‌మ‌కు ప‌నికి వ‌స్తార‌నుకునే ఎమ్మెల్యేలు ఇద్దరు, ముగ్గురుతో రాజీనామా చేయించి.. వారిని పార్టీలో చేర్చుకుని మ‌ళ్లీ అదే ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చేలా జ‌గ‌న్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇదే జ‌రిగితే మండ‌లిలోనూ టీడీపీకి ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News