అభ్యర్థిని మార్చినా ఫ్యాన్ స్పీడ్ తగ్గలేదట..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వంత జిల్లా అయిన చిత్తూరులో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చూపించింది. తెలుగుదేశం పార్టీ కంటే మెజారిటీ స్థానాలు దక్కించుకున్న [more]

Update: 2019-05-07 15:30 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వంత జిల్లా అయిన చిత్తూరులో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చూపించింది. తెలుగుదేశం పార్టీ కంటే మెజారిటీ స్థానాలు దక్కించుకున్న ఆ పార్టీ ఈసారి కూడా జిల్లాలో ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక, తెలుగుదేశం పార్టీ సైతం ఈసారైనా జిల్లాలో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది. దీంతో జిల్లాలోని ప్రతీ సీటును రెండు పార్టీలూ కీలకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా మదనపల్లె నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో హాట్ సీట్లలో ఒకటిగా ఉంది. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డిని కాదని కొత్త అభ్యర్థి అయిన నవాజ్ బాషాకు టిక్కెట్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ కు టిక్కెట్ ఇచ్చింది. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నేత, మరో సీనియర్ నేత మధ్య ఇక్కడ పోటీ ఆసక్తికరంగా జరిగింది.

కొత్త అభ్యర్థిని నిలబెట్టిన జగన్

గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఈ సీటును బీజేపీకి వదిలేసింది. బీజేపీ అభ్యర్థి చల్లపల్లి నరసింహారెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పారెడ్డి 16,589 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తిప్పారెడ్డి మదనపల్లె నియోజకవర్గంలో బాగానే పట్టున్న నేత. ఆయన పట్ల పార్టీకి కూడా వ్యతిరేకత ఏమీ లేదు. కానీ, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న మదనపల్లె సీటును ఈసారి ముస్లింలకు ఇవ్వాలని పార్టీ భావించింది. దీంతో వ్యాపారవేత్త, రాజకీయాలకు కొత్త అయిన నవాజ్ బాషాకు వైసీపీ టిక్కెట్ దక్కింది. జగన్ కు సన్నిహితులైన, ఏపీ ఎన్నికల్లో జగన్ కు బహిరంగంగా మద్దతు ఇచ్చిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దిన్ ఓవైసీ ఆయనకు టిక్కెట్ ఇప్పించారనే ప్రచారం ఉంది. అయితే, టిక్కెట్ రాలేదని అసంతృప్తితో ఉన్న దేశాయ్ తిప్పారెడ్డి పార్టీకి దూరమయ్యారు. ఆయనతో పాటు ఆయన క్యాడర్ కూడా వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదు. దీంతో ఇక్కడ ప్రత్యేకంగా అనుచర వర్గం ఉన్న పెద్దిరెడ్డి కుటుంబం మదనపల్లెలో అన్నీతామై వ్యవహరించింది. అయినా కూడా చాలా మంది వైసీపీ ద్వితియ శ్రేణీ నాయకులు తిప్పారెడ్డికి మద్దతుగా వైసీపీకి ఎన్నికల్లో దూరంగా ఉన్నారు.

వైసీపీకే ఎక్కువ ఛాన్స్

తెలుగుదేశం పార్టీలోనూ వర్గపోరు సమస్యగా మారింది. మదనపల్లె టిక్కెట్ కోసం ముగ్గురు నేతలు పోటీ పడ్డారు. చివరకు దొమ్మలపాటి రమేష్ కు టిక్కెట్ దక్కింది. దీంతో మిగతా వారు పూర్తి స్థాయిలో పార్టీ విజయానికి పనిచేయలేదు. పైకి ప్రచారం నిర్వహించినా పెద్దగా కష్టపడలేదు. దొమ్మలపాటి రమేష్ పైన పలు ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఆయన అక్రమాలకు పాల్పడ్డారనే ప్రచారం జరిగింది. కాగా, తెలుగుదేశం పార్టీకి మదనపల్లె నియోజకవర్గంలో మంచి పట్టుంది. నియోజకవర్గంలో ముస్లింలు, బీసీలు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. వైసీపీ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టడంతో వారంతా ఏకపక్షంగా వైసీపీ వైపు ఉన్నారనే అంచనాలు ఉన్నాయి. బీసీలు సంప్రదాయంగా టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉన్నా ఈసారి వీరిలోనూ వైసీపీ బలం పెంచుకున్నట్లు కనిపించింది. మొత్తంగా రెండు పార్టీల్లోనూ వర్గపోరు ఇద్దరు అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. సామాజకసమీకరణలు చూస్తే మాత్రం వైసీపీ అభ్యర్థికి విజయావకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News