జెండా మోసిన కార్యకర్త పీకేయడానికి రెడీ అయ్యాడా ?

ఏ పార్టీకి అయినా జీవగర్ర జెండే మోసే కార్యకర్త అవుతాడు. పార్టీ కోసం ఎంతో త్యాగం చేస్తాడు. తీరా అధికారంలోకి వచ్చాక తన సంగతి కూడా చూడమంటాడు. [more]

Update: 2021-02-03 03:30 GMT

ఏ పార్టీకి అయినా జీవగర్ర జెండే మోసే కార్యకర్త అవుతాడు. పార్టీ కోసం ఎంతో త్యాగం చేస్తాడు. తీరా అధికారంలోకి వచ్చాక తన సంగతి కూడా చూడమంటాడు. తెలుగుదేశం ఈ విషయంలో అతి చేస్తే వైసీపీ ఉత్త చేతులు చూపిస్తోంది. ఈ రెండూ కూడా పార్టీకి చేటు తెచ్చేవే. ప్రజలు ఎన్నికల్లో ఓటు చేస్తారు అనుకున్నా వారిని పోలింగ్ బూతుల దాకా తీసుకురావాల్సింది సగటు కార్యకర్తే. మరి అతనికే అన్యాయం జరిగితే ఎవరితో చెప్పుకుంటాడు.

అసలు విషయం కక్కేశారా…?

వైసీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అన్నది చేదు నిజం. దీన్ని ఎవరూ బయటకు చెప్పలేకపోతున్నారు. అయితే ముక్కు సూటిగా ఉండే డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ మాత్రం ఉన్న విషయాన్ని బయటకు కక్కేశారు. ఆయన ఏకంగా జగన్ కుడి భుజం అయిన విజయసాయిరెడ్డి ఎదుటే చెప్పేశారు. ఇలాగైతే కష్టమే సారూ అంటూ గట్టిగానే చెపేశారు. కార్యకర్తలకు న్యాయం చేయాల్సిందే అంటూ పెద్ద డిమాండ్ తాజాగా పెట్టేశారు. లేకపోతే అడుగు కూడా ముందుకు వేయలేమని తేల్చేశారు.

వెనక లేరుగా…?

శ్రీకాకుళం జిల్లాలో ఏ పార్టీ నాయకుడి కార్యాలయం చూసినా ఇపుడు బోసి పోయి ఉంది. ఎందుకంటే కార్యకర్తల సందడి అక్కడ లేనే లేదు. అది డిప్యూటీ సీఎం ఆఫీస్ అయినా స్పీకర్ తమ్మినేని కార్యాలయం అయినా మరో ఎమ్మెల్యే కార్యక్రమం అయినా క్యాడర్ మేము రాము అనేస్తున్నారు. ఎందుకు రావాలి అంటూ గట్టిగానే నిలదీస్తున్నారు. వైసీపీ సర్కార్ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది. ఒక్క జెండా పట్టిన కార్యకర్తకు తప్ప అని ముఖం మీదనే చెప్పేస్తున్నారు. దాంతో బెంబేలెత్తుతున్న నేతలు ఆ విషయాన్ని మెల్లగా విజయసాయిరెడ్డి చెవిన వేశారు.

అనావృష్టి అయితే అంతేగా..?

కార్యకర్తలను గౌరవించడంలో చంద్రబాబు పూర్తిగా హద్దులు దాటేశారు. జన్మభూమి కమిటీల పేరిట వారి చేతికే అధికారం ఇచ్చేశారు. దాని ఫ‌లితాన్ని ఆయన గత ఎన్నికల్లో చవి చూశారు. ఇపుడు జగన్ కార్యకర్తలను కడు దూరం పెడుతున్నారు. జనాలకు ఇది బాగానే ఉంది. అన్నీ వారి ముంగిటికి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందుతున్నాయి. కానీ పార్టీ మాత్రం జనంలో కనిపించడంలేదు. రేపటి రోజున వైసీపీ క్యాడర్ జనాల వద్దకు వెళ్ళి ఓట్లు ఎలా అడుగుతారు అంటున్నారు. వారికి ఏ పదవీ ఇవ్వకపోతే ఎలా చైతన్యం వస్తుంది అన్నదే చర్చగా ఉంది. మొత్తానికి చూస్తే బాబు అలా ఇబ్బంది పడితే జగన్ ఇలా కోరి ఇక్కట్లు తెచ్చుకుంటారా అన్న చర్చ అయితే ఉంది. మొత్తానికి తాము బోడి మల్లయ్యలం అయ్యామని వైసీపీ క్యాడర్ రోదిస్తూంటే టీడీపీ క్యాడర్ ఎకసెక్కమాడుతోందిట.

Tags:    

Similar News