వైసీపీ టార్గెట్ రీచ్ అవుతుందా..?

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు బీసీలు. మొదటి నుంచీ బీసీలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వైపే నిలిచారు. ఎన్టీఆర్ హయాం నుంచి [more]

Update: 2019-02-17 02:30 GMT

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు బీసీలు. మొదటి నుంచీ బీసీలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వైపే నిలిచారు. ఎన్టీఆర్ హయాం నుంచి పార్టీ కూడా బీసీలకు పెద్ద పీట వేసింది. ఇప్పిటికీ బీసీలు ఎక్కువగా టీడీపీ వైపే ఉంటారనే అంచనాలు ఉన్నాయి. అయితే, తమ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ ప్రత్యర్థి ఓటు బ్యాంకును తమ వైపు మలుచుకోవడమే ఏ పార్టీ లక్ష్యమైనా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే లక్ష్యంగా ముందుకుపోతోంది. ఆది నుంచీ టీడీపీకి దన్నుగా ఉన్న బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించాలని అనుకుంటున్నారు. ఇప్పటికే బీసీల కోసం నవరత్నాల్లో జగన్ కొన్ని పథకాలను ప్రవేశపెట్టారు. రాజమండ్రితో పాటు పలు పార్లమెంటు స్థానాలను బీసీలకు కేటాయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో అలెర్ట్ అయిన తెలుగుదేశం పార్టీ గత నెల రాజమండ్రిలో జయహో బీసీ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభ ద్వారా బీసీలంతా తమ వైపే ఉంటారని మరోసారి చాటి చెప్పే ప్రయత్నం చేసింది.

భారీ ఎత్తున నిర్వహించేందుకు…

ఈ నేపథ్యంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీడీపీకి కౌంటర్ సభ నిర్వహించ తలపెట్టింది. ఏలూరులో ఇవాళ బీసీ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి బీసీలను పెద్దఎత్తున సమీకరించేలా కసరత్తు చేశారు. ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ.. సభలో కీలక నిర్ణయాలు ప్రకటంచనున్నట్లు తెలుస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీసీలకు చేయబోయే మేలు గురించి బీసీ డిక్లరేషన్ పెట్టేందుకు వైసీపీ కసరత్తు చేస్తోంది. బీసీల కోసం చేపట్టే కార్యక్రమాలను వైసీపీ అధినేత జగన్ ప్రకటించనున్నారు. దీనికి తోడు నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో బీసీలకు జరిగిన నష్టాన్ని జగన్ వివరించనున్నారు.

ఆర్.కృష్ణయ్యను ఆహ్వానించడం ద్వారా…

ఇక, వైసీపీ ఈ సభ నేపథ్యంలో మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సభకు అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఆహ్వానించింది. నిత్యం బీసీల ప్రయోజనాల గురించి పోరాడే ఆయన బీసీల్లో మంచి గుర్తింపు ఉంది. ఈ సభకు హాజరవుతానని ఆయన ప్రకటించారు. అంతేకాదు, వైఎస్సార్ హయాంలో బీసీలకు జరిగిన మేలు, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ కు వైసీపీ మద్దతుగా ఉన్న విషయాన్ని కృష్ణయ్య స్వయంగా ప్రకటించనున్నారు. జగన్ లేదా ఇతర వైసీపీ నేతలు ఈ విషయాన్ని చెప్పడం కంటే బీసీ నేత చెబితే ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. బీసీలకు చంద్రబాబు చేసి నష్టాన్ని కూడా ఈ సభా వేదికగా చెబుతానని ఆర్.కృష్ణయ్య ఇప్పటికే ప్రకటించారు. ఇక, ఈ సభపైన తెలుగుదేశం పార్టీ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తోంది. తమ సభకు వచ్చిన జనాల్లో 10 శాతం కూడా వైసీపీ సభకు రారని టీడీపీ నేతలు అంటున్నారు. మరి, వైఎస్సార్ కాంగ్రెస్ బీసీ గర్జన సభ ఎలా జరుగుతుంది.. బీసీలను జగన్ ఆకట్టుకుంటారో లేదో చూడాలి.

Tags:    

Similar News