ఢిల్లీలో పరువు తీస్తున్నారే… దెందూ.. దొందేనా?

వైసీపీ, టీడీపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నడూ పోరాడలేదు. ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు వైసీపీ పదిహేను నెలలుగా అధికారంలో ఉన్నప్పుడూ అదే [more]

Update: 2020-09-28 08:00 GMT

వైసీపీ, టీడీపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నడూ పోరాడలేదు. ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు వైసీపీ పదిహేను నెలలుగా అధికారంలో ఉన్నప్పుడూ అదే తంతు. రెండు పార్టీలు రాష్ట్రంలోనే కాకుండా, జాతీయ స్థాయిలో ఒకరిపై ఒకరిని విమర్శించుకుంటూ పలుచన అవుతున్నాయి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన దానిపై కాకుండా వైసీపీ, టీడీపీలు రాష్ట్ర పరువును ఢిల్లీ వీధుల్లో తీసేస్తున్నాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

రాష్ట్ర సమస్యల మాటేదీ?

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే రాష్ట్రాల డిమాండ్లు ఎక్కువగా విన్పించాల్సి ఉంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల ఎంపీలు తమ రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తుంటాయి. కానీ ఏపీ ఎంపీలు అందుకు విరుద్ధం. కేంద్ర ప్రభుత్వంపై పోరాడతామని ఆర్భాటంగా ప్రకటిస్తాయి. చివరకు సమావేశాలు ప్రారంభమయిన తర్వాత దాని ఊసే ఉండదు. వైసీపీ టీడీపీ పై కక్ష సాధింపు కోసం ఆందోళన చేస్తే, టీడీపీ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది.

బాబు పాలనలో అవినీతిపై…..

ఈ పార్లమెంటు సమావేశాల్లో వైసీపీ రాజధాని భూముల అవినీతి, ఫైబర్ గ్రిడ్ అవినీతి అంశాలను సీబీఐ చేత విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. నిజానికి అధికారంలో ఉన్నది వైసీపీనే. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఈ అంశంపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరితే కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుంది. కానీ వైసీపీ ఎంపీలు మాత్రం జాతీయ స్థాయిలో టీడీపీ, చంద్రబాబు పరువును తీసేందుకే ప్రయత్నించింది. ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా కేంద్రం ప్రతిపాదించే అన్ని బిల్లులకూ మద్దతు తెలిపింది.

వైసీపీ ప్రభుత్వం అసమర్థతపై….

ఇక టీడీపీ కూడా ఏం తక్కువ తినలేదు. కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ లో విజృంభిస్తుందని, వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్లనే ఏపీ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని టీడీపీ ఆరోపిస్తుంది. రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. ప్రభుత్వం అన్నింటా విఫలమయిందని చెప్పడానికే టీడీపీ ఎక్కువగా పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రస్తావించింది తప్పించి రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేదు. ఇలా రెండు పార్టీలు పార్లమెంటు సమావేశాలను రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా, తమ పార్టీ ప్రయోజనాల కోసం మాత్రం చక్కగా ఉపయోగించుకున్నారు.

Tags:    

Similar News