నోటి దురదే చేటు తెచ్చింది

ఏపీ తాజా రాజకీయపరిణామాల్లో రెండు కీలక అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. రైతులపై ఎస్వీబిసి ఛైర్మన్ గా ఉన్న నటుడు పృద్వి రాజ్ చేసిన వ్యాఖ్యలు, [more]

Update: 2020-01-13 05:00 GMT

ఏపీ తాజా రాజకీయపరిణామాల్లో రెండు కీలక అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. రైతులపై ఎస్వీబిసి ఛైర్మన్ గా ఉన్న నటుడు పృద్వి రాజ్ చేసిన వ్యాఖ్యలు, ఆడియో టేపుల్లో అయన సరస సంభాషణలు ఒక వైపు చర్చనీయాంశమయి ఆయన పదవికి ఎసరు పెట్టాయి. మరోపక్క కాకినాడ ఎమ్యెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు జనసేన, వైసిపి నడుమ తీవ్ర ఉద్రిక్త పరిస్థితినే కొనితెచ్చాయి. ఈ రెండు అంశాల్లో పృథ్వి, ద్వారంపూడి నోటి దురదే వైసిపి కి చేటు తేవడం గమనార్హం. అయితే పదవికి పృథ్వి రాజీనామాతో ఆయన ఎపిసోడ్ ముగిసిపోగా ద్వారంపూడి వివాదం కొనసాగేలాగే కనిపిస్తుంది.

స్లిప్ అయ్యారా … కావాలనే రెచ్చగొట్టారా …?

కాకినాడ ఎమ్యెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ప్రసంగాలు ఎప్పుడు హాట్ గా వుండవు. ఆయన పెద్ద వాగ్దాటి వున్న నాయకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకోలేదు. సాదా సీదాగా సాగే ద్వారంపూడి మాటలు ఒక్కసారిగా ఆయన బూతు పురాణంతో వేడెక్కిపోయాయి. ఇది ఆయన టంగ్ స్లిప్ అయ్యి పలికిన చిలక పలుకులు అయితే కావన్నది ఆయన మాట్లాడిన తీరు చుసిన ఎవరికైనా అర్ధం అవుతుంది. కావాలనే చంద్రబాబు, లోకేష్, పవన్ లను రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు చేశారని ద్వారంపూడి ప్రసంగం పరిశీలించిన వారికి తెలిసిపోతుంది. ఇది వైసిపి మైండ్ గేమ్ లో భాగంగానే చేశారనే పలువురు లెక్కేస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యల వల్ల అధికారపార్టీకి మేలు ఎంత అన్నది పక్కన పెడితే, మరీ దిగజారి ద్వారంపూడి చేసిన కామెంట్స్ మాత్రం వైసిపి కి ముఖ్యంగా వ్యక్తిగతంగా జగన్ మోహన్ రెడ్డి కి తీరని నష్టమే తెచ్చిపెడతాయని భావిస్తున్నారు.

ఆద్యులు ఎవరు …?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతల మాట్లాలు బిలో ది బెల్ట్ గా నడుస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ అండ్ కో వాడిన భాష ఆంధ్రుల మనసును తీవ్రంగా గాయపరిచింది. ఆంధ్రులు దొంగలు, దోపిడీ దారులంటూ దుమ్మెత్తిపోసేవారు వారంతా. దీనికి తరువాత ఆయన క్షమాపణ చెప్పి కడుపులో పెట్టుకు చూసుకుంటామని ఉద్యమ సమయంలో వేడి కోసం అలాంటి వ్యాఖ్యలు చేయాలిసి వచ్చిందన్నారు. ఆ తరువాత కెసిఆర్ అండ్ కో బాగా విమర్శలు చేసింది చంద్రబాబు టీం మీదే. లంగా గాళ్ళు, లఫంగి లు లత్కోర్ లు, సన్నాసులు, చవటలు, అంటూ తెలుగులో జంధ్యాల సినిమాల్లో కూడా వాడని తిట్లన్నీ తిట్టిపోశారు.

గతంలో జగన్ పైనా….

కట్ చేస్తే గత పదేళ్ళుగా వైఎస్ జగన్ పై అదే స్థాయిలో టిడిపి విరుచుకుపడేది. దొంగ, దోపిడీదారుడు, జేబులు కొట్టేవాడు, పిల్లలను ఎత్తుకుపోయే పార్టీ అంటూ రకరకాలుగా టార్చర్ పెట్టింది. జగన్ సోదరిపై అయితే మరింత దారుణంగా వ్యక్తిత్వ హననానికి ఒక టీం నే పెట్టి సోషల్ మీడియా లో దాడికి పాల్పడ్డారు. ఇక జనసేన అధినేత లేదా నాయకులు వేదికలపై ఆ స్థాయిలో తిట్టకపోయినా తమ సోషల్ మీడియా శతఘ్ని టీం తో ఆడ మగ తేడా లేకుండా విచ్చలవిడిగా బూతుల దండకమే చదివేవారు.

వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తున్నారా …?

ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసిపి వాటన్నిటికీ వడ్డీతో సహా బదులు ఇచ్చే పనిలో పడినట్లే కనిపిస్తుంది. అందుకోసం ప్రజలు ఏమనుకున్నా ఇబ్బంది లేదనే దూకుడునే ఆశ్రయిస్తుంది. వైసిపి నేతలు మంత్రులు, ఎమ్యెల్యేలు, ఒకరేమిటి అంతా బూతు పురాణం అందిపుచ్చుకుని టిడిపి, జనసేన పై మూకుమ్ముడి దాడికి పాల్పడుతున్నారు. అన్ని ప్రచార ప్రసార మాధ్యమాల్లో ఈ అంశాలకే అంతా ప్రాధాన్యత ఇవ్వడం కూడా చెత్త వాగుడు వాగేందుకు నేతలను ప్రోత్సహిస్తుంది. సమాజానికి ప్రయోజనం లేని తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టే ఈ ధోరణి ఎప్పటికి అన్ని పార్టీలు స్వస్తి పలుకుతాయో అప్పుడే రాజకీయాలపై కొంతైనా అందరిలో చులకన భావం తగ్గుతుందని ప్రజాస్వామ్య వాదులు వేదన చెందుతున్నారు.

Tags:    

Similar News