ఆ సీటుపై వైసీపీలో ఆశలు పెరిగాయి..!

గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేదు ఫలితాలు వచ్చాయి. రాయలసీమలోని మిగతా మూడు జిల్లాల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న ఆ పార్టీ అనంతపురం [more]

Update: 2019-05-13 01:30 GMT

గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేదు ఫలితాలు వచ్చాయి. రాయలసీమలోని మిగతా మూడు జిల్లాల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న ఆ పార్టీ అనంతపురం జిల్లాలో మాత్రం చతికిలపడింది. ఇక్కడి 14 నియోజకవర్గాల్లో కేవలం ఆ పార్టీ 2 స్థానాలను మాత్రమే గెలవగలిగింది. దీంతో ఈసారైనా అనంతపురం జిల్లాలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉన్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా తమకు ఎప్పుడూ అండగా ఉండే అనంతపురం జిల్లాలో ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించింది. సిట్టింగ్ స్థానాలన్నీ కాపాడుకోవాలని ఆ పార్టీ ప్రయత్నించింది. దీంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రెండు పాటీల మధ్య పోరు హోరీహోరీగా సాగింది. రెండు పార్టీలూ గెలుపే లక్ష్యంగా పనిచేశాయి. అయితే, తమ ఖాతాలో కచ్చితంగా పడే స్థానాల్లో ధర్మవరం ఒకటిగా లెక్కలేసుకుంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

తెలుగుదేశం పార్టీకి కంచుకోట

అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం టీడీపీకి ఒకరకంగా కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఇక్కడ జరిగిన ఏనిమిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏకంగా ఆరుసార్లు గెలుపొందింది. కాంగ్రెస్ తరపున కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి ఒకసారి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒకసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి మళ్లీ పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గునుగుంట్ల సూర్యనారాయణ(వరదాపురం సూరి) చేతిలో సుమారు 15 వేల తేడాతో ఓడిపోయారు. సూర్యనారాయణకు నియోజకవర్గంలో గట్టి పట్టుంది అంతకుముందు 2009 ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డిపై ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి భారీగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఈసారి కూడా మళ్లీ వీరిద్దరే తలపడ్డారు. ఇద్దరు విజయం కోసం శక్తియుక్తులు ప్రదర్శించారు. ఎన్నికల ముందు టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరి ప్రత్యర్థులపై దాడి చేసేందుకు అవకాశం ఇస్తానని కార్యకర్తలకు చెబుతున్న ఆడియో వైరల్ అవ్వడం, తర్వాత వెంకట్రామిరెడ్డి కూడా ఆయనకు అంతేస్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో ఎన్నికల ముందే నియోజకవర్గంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ఎవరు గెలిచినా మెజారిటీ తక్కువే…

నియోజకవర్గాన్ని ఈ ఐదేళ్లు అభివృద్ధి చేశారనే క్రెడిట్ సూరికి ఉంది. నియోజకవర్గానికి సాగునీరు అందించామని చెప్పుకున్నారు. సహజంగానే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ గట్టి పట్టుంది. దీంతో ఈసారి కూడా తాను గెలుస్తానని ఆయన ధీమాగా ఉన్నారు. ఇదే సమయంలో వెంకట్రామరెడ్డి కూడా ఈసారి గట్టి పోటీ ఇచ్చారనే అంచనాలు ఉన్నాయి. ఆయన ఓడిపోయినా ప్రజల్లోనే ఉంటూ ఈ ఐదేళ్లుగా తన వర్గాన్ని కాపాడుకోవడంతో పాటు బలం పెంచుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కూడా ఉంది. ఇక్కడ పద్మశాలి సామాజకవర్గం, బీసీలు గెలుపోటములను ప్రభావితం చేస్తారు. ప్రతీసారి తెలుగుదేశం పార్టీకి వీరిలో మెజారిటీ ఓటర్లు అండగా ఉండేవారు. ఈసారి వైసీపీ కూడా బీసీ ఓట్లపై ఆశలు పెట్టుకుంది. మొత్తంగా వైసీపీ గత ఎన్నికల కంటే కూడా ఇక్కడ గట్టి పోటీ ఇచ్చింది. ఇద్దరికీ గెలుపు అవకాశాలు ఉన్నా ఎవరు గెలిచినా అతి స్వల్ప మెజారిటీ మాత్రమే దక్కవచ్చు.

Tags:    

Similar News