జగన్ గతాన్ని మరిచిపోతారా..?

కేంద్ర రాజకీయాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పెదవి విప్పడం లేదు. అయినా ఆయన ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై అనేక ఊహాగానాలు [more]

Update: 2019-05-18 02:30 GMT

కేంద్ర రాజకీయాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పెదవి విప్పడం లేదు. అయినా ఆయన ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై అనేక ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్ని రోజులుగా జగన్ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారని బాగా ప్రచారం జరిగింది. తెలుగుదేశం పార్టీ అయితే ఈ విషయాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకొని మరీ ప్రచారం చేసింది. తర్వాత జగన్ కేసీఆర్ తో కలిశారనే ప్రచారం జరిగింది. కేటీఆర్ జగన్ ను కలవడం, కేసీఆర్ తో జగన్ ఫోన్ లో మంతనాలు జరపడం వంటి పరిణామాలతో జగన్ ఈసారి జాతీయ స్థాయిలో కేసీఆర్ తో కలిసి ముందుకెళతారని మొన్నటివరకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారి జగన్ ను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. జాతీయ మీడియాలోనూ ఈ వార్తలు వస్తున్నాయి.

జగన్ ను గాలం వేస్తున్న కాంగ్రెస్..?

ఇదే అంశంపై ఓ విలేఖరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. వైఎస్ జగన్ తో కలిసి పనిచేస్తారా అని ప్రశ్నించారు. దీనికి రాహుల్ గాంధీ నేరుగా జవాబు ఇవ్వకున్నా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా నరేంద్ర మోడీ మోసం చేశారని, తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ప్రత్యేక హోదానే తమకు ముఖ్యమని, హోదా ఇచ్చే పార్టీకే తమ మద్దతు అని జగన్ స్పష్టంగా చెబుతున్నందున రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తాము ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నందున జగన్ తమతో కలవాలనేది రాహుల్ వ్యాఖ్యల వెనుక అర్థంగా కనిపిస్తోంది. ఇక, ఫలితాలు వెల్లడయ్యే రోజు జరగనున్న బీజేపీయేతర పార్టీల భేటీకి జగన్ ను కూడా ఆహ్వానించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకు గానూ సోనియా గాంధీ నేరుగా రంగంలోకి దిగారని, జగన్ కు ఆమె ఈ మేరకు సమావేశానికి హాజరుకావాల్సిందిగా లేఖ రాసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ ను క్షమించానని చెప్పిన జగన్

ఇక, జగన్ ను తమ వైపు తిప్పుకునేందుకు సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను కాంగ్రెస్ రంగంలోకి దింపింది. ఆయన వల్ల కాకపోతే జగన్ తో మంచి సంబంధాలు ఉన్న వీరప్ప మొయిలీతో మాట్లాడించాలని కాంగ్రెస్ భావిస్తోందట. అయితే, కాంగ్రెస్ తో జగన్ కలుస్తారా అనేదే ఇప్పుడు ప్రశ్న. తనను 16 నెలల పాటు జైలులో పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీకి జగన్ మళ్లీ మద్దతు ఇస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. జగన్ మాత్రం తాను కాంగ్రెస్ ను క్షమించానని, ప్రత్యేక హోదా ఇస్తామంటే ఎవరికైనా మద్దతు ఇస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇక్కడ కాంగ్రెస్ – జగన్ మధ్య చంద్రబాబు నాయుడు అడ్డంకిగా మారారు. ఆయన కాంగ్రెస్ కూటమిలో లేటుగా చేరినా కీలకంగా మారారు. రాహుల్ గాంధీ కూడా చంద్రబాబుకు పెద్ద పీట వేస్తున్నారు. మరి, తన ప్రత్యర్థి చంద్రబాబుకు పెద్ద పీట వేస్తున్న కాంగ్రెస్ వైపు జగన్ వెళ్లే అవకాశం ఉందా అనే ప్రశ్న వస్తోంది. అయితే, తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ సీట్లు తమ పార్టీకి వస్తే కాంగ్రెస్ కూటమిలోనైనా చంద్రబాబు కంటే జగన్ కే ప్రాధాన్యత పెరుగుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మరి, జగన్ గతాన్ని మరిచి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తారా..? చంద్రబాబుతో కలిసి వేదిక పంచుకుంటారా చూడాలి.

Tags:    

Similar News