వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా కూడా ఉంటారా?

వైసీపీ ఎమ్మెల్యేలు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. అయితే.. ఎవ‌రిదారి వారిదే అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. కొంద‌రు ఎమ్మెల్యేలు దూకుడుగా ఉంటే.. మ‌రికొంద‌రు.. మాత్రం మౌన‌మునుల్లా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇంకొంద‌రు అధికారుల‌కే [more]

Update: 2021-08-03 13:30 GMT

వైసీపీ ఎమ్మెల్యేలు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. అయితే.. ఎవ‌రిదారి వారిదే అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. కొంద‌రు ఎమ్మెల్యేలు దూకుడుగా ఉంటే.. మ‌రికొంద‌రు.. మాత్రం మౌన‌మునుల్లా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇంకొంద‌రు అధికారుల‌కే పాఠాలు చెబుతుంటే.. మ‌రికొంద‌రు.. స‌బ్జెక్టు పై ఏమాత్రం అవ‌గాహ‌న లేకుండా వ్యవ‌హ‌రిస్తున్నార‌నే కామెంట్లు వ‌స్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంభాల జోగులు వ్యవ‌హారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప్రభుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు.. వివిధ ప‌థ‌కాల‌పై ఎమ్మెల్యేలు అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని.. సీఎం జ‌గ‌న్ ఎప్పటిక‌ప్పుడు.. చెబుతున్నారు.

మంత్రి అయి ఉండి కూడా…?

ఎక్కడ ఏ స‌భ నిర్వహించినా.. ముందు మీరు తెలుసుకోండి.. త‌ర్వాత‌.. ప్రజ‌లకు చెప్పండి.. అని జ‌గ‌న్ చెబుతున్నారు. అయితే.. ఎమ్మెల్యేలు చాలా మంది ఈ విష‌యాన్ని ప‌క్కన పెడుతున్నారు. ఇటీవ‌ల ఒక మంత్రికే ఏకంగా.. జ‌గ‌న‌న్న ఇళ్లకు, జ‌గ‌న‌న్న టౌన్ షిప్‌ల‌కు తేడా తెలియ‌డం లేద‌ని వార్తలు వ‌చ్చాయి. ప్రస్తుతం వైసీపీ స‌ర్కారు జ‌గ‌న‌న్న ఇళ్లను అమ‌లు చేస్తోంది. త్వర‌లోనే జ‌గ‌న‌న్న టౌన్ షిప్‌ల‌కు ప్రతిపాద‌నలు సిద్ధం చేస్తోంది. జ‌గ‌న‌న్న ఇళ్లు పేద‌ల‌కు సంబంధించిన‌వి అయితే.. టౌన్ షిప్‌లు.. మ‌ధ్యత‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు కేటాయించాల‌ని అనుకున్న ఇళ్లు. అయితే.. ఈ రెండిటికి తేడా తెలియ‌ని మంత్రి ఒక‌రు బ‌హిరంగ వేదిక‌పై ఒక‌టి చెప్పబోయి ఒక‌టి చెప్పి సోష‌ల్ మీడియాలో చిక్కుకున్నారు.

దిశ చట్టంపై….?

ఇక‌, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే జోగులు కూడా ఇలానే వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ స‌ర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చ‌ట్టం ఏదైనా ఉంటే.. అది దిశ‌. మ‌హిళ‌ల‌కు భద్రత క‌ల్పించే ఉద్దేశంతో తీసుకువ‌చ్చిన దిశ చ‌ట్టానికి కొన‌సాగింపుగా.. వైసీపీ స‌ర్కారు అనేక విప్లవాత్మక ప‌రిణామాల‌ను తెర‌మీదికి తెచ్చింది. దిశ యాప్‌, దిశ పోలీస్ స్టేష‌న్లు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో దిశ యాప్‌ను రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మ‌హిళ ఫోన్‌లోనూ ఇన్ స్టాల్ చేయించే కార్యక్రమాన్ని అధికారుల‌కే అప్పగించారు. ఈ క్రమంలో అధికారులు ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. అవ‌గాహ‌న కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజాంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దిశ యాప్‌పై అధికారులు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని నిర్ణయించారు.

ఈయనొక్కడే కాదు….

దీనికి వైసీపీ ఎమ్మెల్యే కంబాల జోగుల‌ను ఆహ్వానించారు. తొలుత ఈ స‌భ‌లో ప్రసంగించిన ఆయ‌న‌ దిశ యాప్‌పై మాట్లాడుతూ.. దీని గురించి వివ‌రించాల్సి ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంద‌ని.. ప్రతి ఒక్కరూ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల‌ని ఆయ‌న చెప్పి ఉంటే.. ప‌రిస్థితి వేరేగా ఉండేది. కానీ, ఆయ‌న మాత్రం.. త‌న‌కు అస‌లు దిశ అంటే ఏంటో తెలియ‌ద‌ని.. ఇప్పుడే వింటున్నాన‌ని, చిత్రంగా మాట్లాడారు. దీంతో స‌భ‌కు వ‌చ్చిన మ‌హిళ‌లు ఘొల్లున న‌వ్వేశారు. ప్రస్తుతానికి ఇది జోక్‌గా ఉన్నా.. జ‌గ‌న్ కు చేరితే.. సీరియ‌స్ యాక్షన్ త‌ప్ప‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే అదే స‌మ‌యంలో వైసీపీ ఎమ్మెల్యేల్లో జోగులు ఒక్కరు మాత్రమే కాద‌ని.. ఇలా స‌బ్జెక్ట్ లేని వాళ్లు ప‌దుల సంఖ్యలోనే ఉన్నార‌ట‌..! అందుకే వారంతా అధికారుల‌కు అలుసు అవుతున్నార‌ని అంటున్నారు.

Tags:    

Similar News