ఏం చెప్పను బాస్‌.. మావోళ్లు కెలికేస్తున్నారు.. వైసీపీ మంత్రి నిర్వేదం

అధికార పార్టీ వైసీపీలో కీల‌క నాయ‌కుడు, జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు, మంత్రి ఒక‌రు తీవ్ర మ‌నోవేద‌న చెందుతున్నారు. కీల‌క‌మైన పొజిష‌న్‌లో ఉన్న ఆయ‌న‌కు ఇప్పుడు త‌న సామాజిక [more]

Update: 2020-03-23 05:00 GMT

అధికార పార్టీ వైసీపీలో కీల‌క నాయ‌కుడు, జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు, మంత్రి ఒక‌రు తీవ్ర మ‌నోవేద‌న చెందుతున్నారు. కీల‌క‌మైన పొజిష‌న్‌లో ఉన్న ఆయ‌న‌కు ఇప్పుడు త‌న సామాజిక వ‌ర్గం నుంచి తీవ్ర ఎదురీత ఎదుర‌వుతోంది. దీంతో ఆయ‌న త‌న‌ను తాను స‌మ‌ర్ధించుకోలేక‌, ప్రభుత్వాన్ని స‌మ‌ర్ధించ‌లేక‌.. అలాగ‌ని త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి న‌చ్చజెప్పలేక తెగ ఇబ్బంది ప‌డుతున్నారు. దీంతో ఆయన గ‌డిచిన రెండు వారాలుగా అస్సలు ఇంటి నుంచి కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ట‌. విష‌యంలోకి వెళ్తే.. ఇటీవ‌ల స్థానిక ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తూ.. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మగడ్డ ర‌మేశ్‌కుమార్‌ నిర్ణయం తీసుకున్నారు.

మంత్రికి సెగలు…..

ఈ నిర్ణయం వివాదంగా మారి దానికి రాజకీయ రంగు పులుముకున్న విష‌యం తెలిసిందే. ఆ వెంట‌నే ప్రెస్‌మీట్ పెట్టిన సీఎం జ‌గ‌న్‌.. వెంట‌నే ర‌మేశ్‌పై తీవ్ర విమ‌ర్శలు చేశారు. అదికూడా ఆయ‌నకు కులాన్ని అంట‌గ‌ట్టి వ్యాఖ్యలు చేశారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు మ‌రో వివాదానికి దారితీశాయి. అధికారుల‌కు కూడా కులం అంటిస్తారా? అంటూ.. తీవ్ర విమ‌ర్శలు వ‌చ్చాయి. అయినా కూడా సీఎం త‌ర్వాత వ‌రుస‌గా స్పీక‌ర్‌, మంత్రులు కూడా లైన్‌లోకి వ‌చ్చి.. ర‌మేశ్‌పై ఎక్కిదిగేశారు. ఈ క్రమంలోవారు కూడా కులాన్ని ఆపాదిస్తూ విమ‌ర్శలు చేశారు. ఈ ప‌రిణామాల‌తో ఒకే ఒక్కడుగా ఉన్న అదే సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రికి సెగ‌లు అంటుకున్నాయి.

రాజీనామా చేయమంటూ…

“సార్‌. మ‌నోళ్లను ఇలా సీఎం, మంత్రులు ఏకేస్తుంటే.. మీరు మౌనంగా ఉండ‌డం ఏమీ బాగోలేదు. ఎక్కడో ఒక్కచోట దీనికి ముగిం పు ప‌ల‌కాలి. రాజ‌ధాని విష‌యంలోనూ ఇలానే కులాన్ని ఆపాదించి వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కూడామీరు మౌనం పాటించారు. ఇప్పుడు కూడా మీరు మౌనంగా ఉంటే ఎలా ? ఈ ప‌రిస్థితి మ‌మ్మల్ని తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికైనా మీరు మౌనం వీడాలి. మీరు మాట్లాడితేనే త‌ప్ప మా మ‌న‌సులు శాంతించ‌వు. అవ‌స‌ర‌మైతే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయండి. మ‌న వాయిస్‌ను గ‌ట్టిగా వినిపించండి“ అని చెబుతున్నారట‌.

తలెత్తుకోలేకపోతున్నానంటూ…

దీంతో స‌ద‌రు మంత్రి ఏం చేయాలో తెలియ‌క‌.. త‌లెత్తుకోలేక పోతున్నా.. న‌న్ను ఏం చేయ‌మంటావ్! అంటూ.. స‌హ‌చ‌ర మంత్రుల‌కు ఫోన్లపై ఫోన్లు చేస్తూనే ఉన్నార‌ట‌. సో.. ఇది స‌ద‌రు మంత్రిగారి స‌మ‌స్య. ఆ మంత్రి వీలున్నప్పుడల్లా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమ‌ర్శలు చేస్తుంటారు. ఇంత‌కు స‌ద‌రు మంత్రి ఎవ‌రో ఈ పాటికే మీకు అర్థమై ఉంద‌నుకుంట‌.

Tags:    

Similar News