చక్కబెట్టేస్తున్నారు….!!!

దాదాపు పథ్నాలుగు నెలల పాటు పాదయాత్రలో ఉన్న జగన్ ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు. తన లండన్ పర్యటనను రద్దు చేసుకున్న జగన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో పార్టీ [more]

Update: 2019-01-23 01:30 GMT

దాదాపు పథ్నాలుగు నెలల పాటు పాదయాత్రలో ఉన్న జగన్ ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు. తన లండన్ పర్యటనను రద్దు చేసుకున్న జగన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో పార్టీ పై దృష్టి పెట్టారు. పాదయాత్రలో ఉన్న సమయంలో పార్టీ లో తలెత్తిన విభేదాలను జగన్ పెద్దగా పట్టించుకోలేదు. తన శిబిరం వద్ద కొద్దిమందితో చర్చలు జరిపినా అవి ఫలితం ఇవ్వలేదు. మరి కొద్దిరోజుల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సి రావడంతో నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలను చక్కబెట్టే పనిలో పడ్డారు వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి.

నియోజకవర్గాల వారీగా….

గత ఐదు రోజుల నుంచి లోటస్ పాండ్ లో వివిధ నియోజకవర్గాల సమీక్ష జరుపుతున్నారు. విభేదాలు ఉన్న నేతల మధ్య సయోధ్య కుదుర్చుకుంటూ వెళుతున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరేసి ఇన్ ఛార్జిలు ఉండటంతో వారిద్దరూ టిక్కెట్ తమదేనన్న ప్రకటనలు చేస్తున్నారు. అయితే తాను చేయించిన సర్వే ఫలితాలను వివరించడంతో పాటు టిక్కెట్ దక్కని వారికి అధికారంలోకి రాగానే ఏ పదవి ఇస్తానన్నదీ జగన్ స్పష్టంగా చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో కీలక నియోజకవర్గంలో ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదిరిందని, జగన్ తో సమావేశమయిన తర్వాత వారిద్దరూ చేతులు కలుపుకుని వెళ్లారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఇన్ ఛార్జిల ను మారుస్తూ….

జగన్ ఈ ఎన్నికలు కీలకం కావడంతో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కేవలం సామాజిక వర్గాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా, ప్రజల్లో ఆ నేతకు ఉన్న ఫాలోయింగ్ తో పాటు సర్వే ఫలితాలను కూడా చూసి ఒక నిర్ణయానికి వస్తున్నారు. అలాగే నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిలు మార్చాల్సిన అవసరం ఉందని గుర్తించిన జగన్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా దర్శినియోజకవర్గంలో మొన్నటి వరకూ బాదం మాధవరెడ్డి ఉండేవారు. ఆయనకు మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సహకరించకపోవడంతో ఆయన పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో దర్శినియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా మద్దిశెట్టి వేణుగోపాల్ ను నిర్ణయించారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని తనవద్దకు రప్పించుకుని మద్దిశెట్టి గెలుపు బాధ్యతను ఆయనపైనే పెట్టారు. దీంతో దర్శి నియోజకవర్గ వైసీపీ సమస్య తీరినట్లేనని చెబుతున్నారు.

క్లాసు లు పీకుతూ….

అలాగే సమీక్షకు వచ్చిన నేతలకు కూడా జగన్ క్లాస్ పీకుతున్నారు. తాను పాదయాత్ర ఆ నియోజకవర్గం నుంచి వెళ్లిన తర్వాత ఏ ఏ కార్యక్రమాలు వారు చేసిందీ వారికే వివరిస్తున్నారు. పాదయాత్ర జరిగిన తర్వాత నియోజకవర్గాల్లో పెద్దగా పార్టీ కార్యక్రమాలు చేపట్టని కొందరిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ వ్యతిరేకతను సరిగా సొమ్ము చేసుకోలేకపోతున్నారని క్లాస్ పీకినట్లు సమాచారం. తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రకు అనూహ్య స్పందన లభించినా, ఆ తర్వాత అక్కడి నేతలు కొందరు పార్టీని గాలికి వదిలేసినట్లు తెలియడంతో ఆ జిల్లా నేతలపై జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జగన్ పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు. మరికొద్దిరోజులు నియోజకవర్గాల సమీక్ష జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News