జగన్ చూస్తూ ఊరుకుంటారా…?

బలవంతమైన సర్పం చలి చీమల చేత చిక్కి చావదే సుమతీ అని ఓ తెలుగు పద్యం ఉంది. ఒకనాడు తోపు అనుకున్న వారు మరో సందర్భంలో వీపు [more]

Update: 2019-08-08 05:00 GMT

బలవంతమైన సర్పం చలి చీమల చేత చిక్కి చావదే సుమతీ అని ఓ తెలుగు పద్యం ఉంది. ఒకనాడు తోపు అనుకున్న వారు మరో సందర్భంలో వీపు వాచి మూలన కూర్చుంటారు. అంతా మాది, అన్నీ మేమే అన్న వారు కూడా ఉనికిపోరాటం చేస్తూ దీనంగా బతుకులీడుస్తున్నారు. హిస్టరీ అంటే మాది అని డబ్బాలు కొట్టే బ్యాచ్ కూడా ఇపుడు బ్యాక్ బెంచ్ కి పరిమితమైపోయారు. ఇదంతా ఎందుకంటే. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ గురించి చెప్పుకోవాలిక్కడ. ఆ పార్టీ ఈ దేశాన్ని అర చేతిలో పెట్టి పాలించింది. ఎమర్జెన్సీని కూడా విధించింది. నియంత పోకడలు పోయింది. చివరకి ఆ దురహంకారమే ఆ పార్టీని నామ రూపాలు లేకుండా చేసేసింది. కాంగ్రెస్ ఇపుడు ఎక్కడ ఉంది అని ఆ పార్టీ వాళ్ళే బూతద్దంతో వెతుక్కుంటున్న పరిస్థితి. మరి ఇంతలా దిగజారిపోయి దిష్టి బొమ్మ అయిపోయిన కాంగ్రెస్ పార్టీ ఒకనాడు జగన్ నిఎంతలా వేధించిందో అందరూ చూశారు. జగన్ మీద ఎన్నో కేసులు పెట్టి పదహారు నెలలు జైలు పాలు చేసిన కాంగ్రెస్ ని ఇపుడు అధికార వైభోగంతో వెలిగిపోతున్న జగన్ అలా చూస్తూ ఊరుకుంటారా.

ఉతికి ఆరేస్తున్నారుగా….

అందుకే సమయం దొరికితే చాలు తన పార్టీ వారి చేత ఉతికి ఆర వేయించేస్తున్నారు. రాజ్యసభలో అది ట్రిపుల్ తలాక్ బిల్లు కానీ, మరోటి కానీ చర్చకు వచ్చినపుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నిర్వాకాన్ని ఏకరువు పెట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. చట్టాలను చట్టు బండలు చేసి వేధించిన చరిత్ర కాంగ్రెస్ దేనంటూ విజయసాయిరెడ్డి రెచ్చిపోవడం వెనక జగన్ మీద పెట్టిన అక్రమ కేసులే ఉన్నాయని చెప్పకతప్పదు. ఇక లోక్ సభలోనూ అదే విషయం జరిగింది. కాశ్మీర్ విభజన అప్రజాస్వామికం అని పెద్ద నోరు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ మనీష్ తివారీని వైసీపీ ఎంపీలు ఆ ఆట ఆడుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ని రెండు ముక్కలు చేసినపుడు మీరు చేసిందేంటి అంటూ కడిగి పారేశారు. అసెంబ్లీ తీర్మానం విభజన వద్దు అని చెప్పినా కూడా మీరు చేసి పారేశారే. నాడు లేని తప్పు నేడు వచ్చిందా అని ఓ స్థాయిలో విరుచుకుపడుతూంటే కాంగ్రెస్ ఎంపీలకు నోట మాట రాలేదుగా.

మూలన చేరి మాట పడుతోందిగా….

జగన్ ఒంటరివాడు, ఏం చేయలేడు, ఆయన్ని పార్టీ నుంచి పంపించి కేసులు పెడితే ఇలా శాశ్వతంగా జైలులోనే ఉంటాడనుకున్న కాంగ్రెస్ పెద్దలకు జగన్ ఇపుడు తాను ఎక్కడ ఉన్నాడో చూపించాడు. అంతే కాదు, తనని విడిచిపెట్టినందుకు, కేసులు పెట్టి వేధించినందుకు, ఏపీని అడ్దగోలుగా ముక్కలు చేసినందుకు కాంగ్రెస్ ఇపుడు ఏ స్థితిలో ఎక్కడ ఉందో కూడా చూపిస్తున్నాడు. ఓ విధంగా జగన్ కాంగ్రెస్ ని తమ ఎంపీల ద్వారా కడిగేస్తూ కక్ష తీర్చుకుంటున్నాడనే చెప్పాలి. ఇప్పటికి రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి కనీసం ప్రతిపక్ష పాత్రకు కూడా సరిపోని సీట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ ఎక్కడ. బంపర్ విక్టరీతో వెలిగిపోతున్న జగన్ ఎక్కడ. కాంగ్రెస్ చేసిన తప్పులే ఆ పార్టీని అలా మూలన పెడితే ఆ పార్టీ ఎన్ని దెబ్బలు కొట్టినా తాను ఎలా ఎదిగానే చూపిస్తూ జగన్ కాంగ్రెస్ మీద బాగానే కక్ష సాధిస్తున్నారుగా.

Tags:    

Similar News