తిడితే… సరిపోదు..జగనూ…!!

ఒక పని చేయకుండా తప్పించుకోవడానికి, ఎదుటి వాళ్లను ఆడిపోసుకోవడానికి రాజకీయాన్ని మించిన సాధనం ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న తంతు ఇదే. అన్ని రకాల నిధులను పక్కదారి [more]

Update: 2019-07-03 15:30 GMT

ఒక పని చేయకుండా తప్పించుకోవడానికి, ఎదుటి వాళ్లను ఆడిపోసుకోవడానికి రాజకీయాన్ని మించిన సాధనం ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న తంతు ఇదే. అన్ని రకాల నిధులను పక్కదారి పట్టించి అధికారాన్ని తిరిగి పొందాలని యత్నించిన తెలుగుదేశం అనుకున్నది సాధించలేకపోయింది. దారి మళ్లిన నిధుల్లో విత్తన కేటాయింపుల సొమ్మూ ఉంది. ఆ పార్టీ ప్రభుత్వం సంగతి పక్కన పెడితే..వ్యవసాయ సీజన్ మొదలైన సంగతి మొదట్లోనే గుర్తించి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేసిన తాజా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు ఇప్పుడు కళ్లు తేలేస్తోంది. ఈ రెండు పార్టీలు ఒకరినొకరు వేలెత్తి చూపుకుంటూ దొంగాట మొదలు పెట్టాయి. అన్నదాతకు గుండె మండుతోంది. విత్తనం దొరక విలవిల్లాడుతున్నాడు. ట్వీట్లు, ప్రెస్ మీట్ల ఆరోపణలు రైతుకు అక్కరకు వచ్చేవి కాదు. అయినా అధికార,ప్రతిపక్షాలు రెండూ పరస్పర దూషణలతో పోటీ పడుతున్నాయి.

తిలాపాపం…

కష్టమే కానీ తప్పదు…నిన్నామొన్నటివరకూ దూషణభూషణలతో హోరెత్తించిన నాయకులు ఒక్కసారిగా సంయమనం పాటిస్తూ సాధు జీవులుగా మారిపోవాలంటే సాధ్యం కాదు. కానీ సర్దుకోవాలి. దిద్దుబాటు చేసుకోవాలి. అవసరం అటువంటిది. రైతు రోడ్డెక్కుతున్నాడు. విత్తనమో రామచంద్రా అంటూ విలపిస్తున్నాడు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతి పక్షాలు దీనిని రాజకీయం చేస్తూ తప్పించుకోవాలని చూడటం భావ్యం కాదు. బాధ్యత అంతకన్నా కాదు. విత్తనపంపిణీలో ఎనలేని జాప్యం చోటు చేసుకున్న మాట వాస్తవం. సకాలంలో చర్యలు తీసుకోకుండా అధికారులు అలసత్వం వహించిన విషయమూ నిజమే. అధికార సాధనే అంతిమ లక్ష్యం కాబట్టి ఆ యావలో పడి గత ప్రభుత్వం ఉదాసీనత కనబరిచిన సంగతీ వందశాతం ఒప్పుకోవాల్సిందే. కానీ టీడీపీని విమర్శించడంతోనే సమస్య పరిష్కారం కాదు. ఆ తప్పునకు ఎన్నికల కమిషన్ సహా అందరూ బాధ్యులే. జనవరి నాటికే విత్తనాలకు సంబంధించి ప్లానింగ్ పూర్తి కావాలి. మార్చి నాటికి శుద్ధి చేసిన వాటిని సేకరించాలి. మే లో తొలకరి ముందు పంపిణీ చేయాలి. కానీ మార్చి నుంచి మే వరకూ ఎన్నికల పేరిట కోడ్ కూతతో ఎక్కడి గొంగళి అక్కడే. పాలన పడకేసింది. అంతా రాజకీయంలో మునిగితేలిపోయారు. ఫలితంగా అధికారయంత్రాంగమూ పట్టించుకోలేదు.

ఒకటి కాదు…వంద కష్టాలు…

గడచిన పదిరోజులుగా ఖరీప్ సీజన్ మొదలైంది. అన్నదాతలకు అన్నీ సమస్యలే. సాగు నీటి కొరత సాగుతున్న సంక్షోభమే. ఇక విత్తనాలు, పెట్టుబడి,రుణాలు, గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి అవస్థలు వారికి కొత్త కాదు. ఏ రోజుకారోజు ఎదురీదుతూ ఎప్పటి కష్టం అప్పుడు తీరితే చాలనుకుంటాడు రైతన్న. ప్రస్తుత కష్టాన్ని తీర్చాల్సిన బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే. గతం గత: అంటూ సరిపెట్టుకోవడం ఏ రాజకీయ నాయకుడికీ ఇష్ఠం ఉండదు. తనకంటే పూర్వం ప్రాతినిధ్యం వహించిన వారి తప్పిదాలను బయటపెడితేనే కదా తన ఘనత తెలిసేది. అంతవరకూ పరిమితమైతే ఫర్వాలేదు. కానీ తక్షణ అవసరం తీర్చడం అంతకంటే ముఖ్యం. నిజానికి విత్తన సేకరణ కు ఉపయోగించాల్సిన 365 కోట్ల మేరకు నిధులు దారి మళ్లడం విత్తన సరఫరాలో జాప్యానికి ఒక ప్రధాన హేతువుగా చెబుతున్నారు. ఆయిల్ ఫెడ్, నేషనల్ సీడ్ కార్పొరేషన్ వంటి సంస్థలను సకాలంలో అప్రమత్తం చేసి అవసరాలను తీర్చేవిధంగా సిద్ధం చేసి ఉంటే ప్రస్తుత పరిస్థితి తలెత్తి ఉండేది కాదు. వ్యవసాయం ఒక పండుగ గా కాకుండా దండుగ అని రైతాంగం భావించకుండా చేయడానికే రకరకాల పథకాలను ప్రవేశపెడుతున్నారు. కానీ వాటి ఫలితాలను చేరువ చేసేందుకు తగినంత చిత్తశుద్ధి కరవు అవుతోంది. సకాలంలో విత్తనాలు దొరకవు. కల్తీ ఎరువులు కాటేస్తుంటాయి. సాగు తర్వాత ఉత్పత్తి కొనరు. గిట్టుబాటు ధర గగనకుసుమమే. ఒకవేళ ప్రభుత్వసంస్థలే కొనుగోలు చేస్తే చేతికి టైముకు సొమ్ములు రావు. ఇన్ని సమస్యలుండబట్టే తమ బిడ్డ పొలం పనిలోకి రావాలని ఏ తల్లిదండ్రులు కోరుకోవడం లేదు. …

చేసింది చాలు…

ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అన్న ఘనతర ఖ్యాతి కూడా గత వైభవమే. ఇక్కడ రాజకీయాలకూ కొదవ లేదు. అందులోనూ బలమైన రెండు పార్టీలు తలపడి తాజాగానే ఎన్నికలు పూర్తయిన ఘట్టం. అందుకే రైతు సమస్య చుట్టూ రాజకీయం వేళ్లూనుకుంటోంది. నిన్నామొన్నటివరకూ రాజ్యాన్ని పాలించిన టీడీపీ వైపు వేలెత్తి చూపుతోంది అధికారపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. గద్దె నెక్కిన దగ్గర్నుంచి మీరేమి చేశారు. ఇది మీవైఫల్యం కాదా? అని వైసీపీని ప్రశ్నిస్తోంది ప్రతిపక్షం. రాజకీయానికి ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే అసలు సమస్య మరుగున పడిపోతుంది. అనవసర రాద్ధాంతం అరంగేట్రం చేస్తుంది. అదే ముఖ్యమన్నట్లుగా చెలరేగిపోతారు నాయకులు. ఎదుటి వాళ్ల తప్పులను గోరంతలు కొండంతలు చేస్తుంటారు. తద్వారా రాజకీయ ప్రయోజనం అనే మైలేజీ తమకు, పార్టీకి ఎంతమేరకు లభిస్తుందన్నదే లెక్కలు వేసుకుంటారు. తాజాగా రైతు విత్తన సమస్య రాజకీయసుడిగుండంలో చిక్కుకుంటుందేమోనన్న ఆవేదన వ్యక్తమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ , మాజీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి , తాజా వ్యవసాయమంత్రి కన్నబాబు వరకూ అంతా మాటల యుద్దంలో మునిగితేలుతున్నారు. చేతలతో దన్నుగా నిలవాల్సిన సమయంలో ఎత్తిపొడుపుల ఎవసాయం ఏమాత్రం సొబగు నివ్వదు. అందులోనూ అధికారపక్షానికి ఇది అత్యంత క్రిటికల్ సమయం. లక్షలమంది అన్నదాతల ఆర్తి తీర్చడమే అసలైన సవాల్. అందుకే ప్రత్యర్థి పాత సర్కారు సంగతి పక్కనపెట్టి పక్కా కార్యాచరణతో కదలాల్సిన తరుణం. అందులోనూ వైఎస్సార్ అన్నదాతల ఆత్మబంధువుగా కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించారు. అదే పేరును స్ఫురింపచేసే జగన్ సర్కారు మనసావాచాకర్మణా కర్షక శ్రేయస్సుకు తక్షణం రంగంలోకి దిగితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. రైతన్న సాగుకు దన్ను లభిస్తుంది. సాధికారత సమకూరుతుంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News