అజాత శత్రువు మరణం ఇక మిస్టరీయేనా?

ఆయన అజాత శత్రువు… ఆపద్బాంధువుడిగా పేరు. శత్రువులు ఎవరూ లేని ఆయనను ఎవరు హత్య చేశారు? ఎందుకు చంపేశారు. ఆర్థిక లావాదేవీలు కారణమా? కుటుంబ సభ్యుల ప్రమేయం [more]

Update: 2020-03-15 08:00 GMT

ఆయన అజాత శత్రువు… ఆపద్బాంధువుడిగా పేరు. శత్రువులు ఎవరూ లేని ఆయనను ఎవరు హత్య చేశారు? ఎందుకు చంపేశారు. ఆర్థిక లావాదేవీలు కారణమా? కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందా? బయట వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడ్డారా? ఇవన్నీ ఏడాదిగా తలెత్తుతున్న ప్రశ్నలే. కానీ వీటిలో ఏ ఒక్కటికీ సమాధానం రాలేదు. ఆయనే వైఎస్ వివేకానందరెడ్డి. వివేకాందరెడ్డి హత్య జరిగి ఏడాది గడుస్తున్నా నేటికి నిందితులు ఎవరో తెలియలేదు. ముఖ్యనేత మరణం ఒక సామాన్యుడి హత్యలాగానే పోలీసులు చూస్తున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.

ఏడాది క్రితం…..

సరిగ్గా ఏడాది క్రితం వైఎస్ వివేకానందరెడ్డి హత్కకు గురయ్యారు. జమ్మలమడుగు వెళ్లి వచ్చిన ఆయనను పులివెందులలో తన ఇంట్లోనే దుండగులు నరికి చంపేశారు. అతి కిరాతకంగా కత్తులతో పొడిచారు. ఇంతటి కసితో చంపాల్సిన నేత కాదు ఆయన. ఆయన అజాత శత్రువు. ఆపద్బాంధవుడన్న పేరుంది. వైఎస్ వివేకానందరెడ్డి సామాన్యుల్లో కూడా ఒకరిగా కలసిపోయే నేత. ఎవరైనా ఆయనను సులువుగా కలిసే వీలుంటుంది. అదే ఆయనకు శాపమయింది.

ఎవరు వచ్చినా…..

వైఎస్ వివేకానందరెడ్డి వ్యవసాయశాఖలో డిగ్రీ చేశారు. రాజకీయాలను కూడా వ్యవసాయంలాగే చేశారు. అంటే అంత ప్రేమతో జనం వద్దకు వెళ్లేవారు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లాలో అంతా తానే అయి చూసుకునేవారు. ఎవరు వచ్చి అడిగినా కాదనే స్వభావం కాదు. సౌమ్యుడిగా పేరుంది. ఆగ్రహం అనేది ఆయన ఒంట్లోనూ, ఇంట్లోనూ కన్పించదంటారు. అలాంటి వైఎస్ వివేకా హత్యకు గురైతే ఇప్పటి వరకూ నిందితులెవరో రెండు ప్రభుత్వాలు తేల్చలేకపోవడం సిగ్గుచేటు.

రెండు సిట్ లు ఏమీ తేల్చలేక….

వైఎస్ వివేకా హత్య కు గురయినప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేశారు. ఇది ఏమాత్రం కేసులో పురోగతి సాధించలేకపోయింది. అనంతరం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో సిట్ ను ఏర్పాటు చేశారు. ఎర్ర గంగిరెడ్డి,దుద్ది కుంట శేఖర్ రెడ్డి . కొమ్మా పరమేశ్వర్ రెడ్డి . వీరందరికీ గుజరాత్ లో నార్కో అనాలసిస్ పరీక్షలు సిట్ బృందం నిర్వహించారు. కాల్ డేటా ఆధారంగా దాదాపు పదమూడు వందల మందిని విచారించింది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలను కూడా విచారించింది.

సీబీఐ అయినా…..

కానీ ఈ సిట్ కూడా వైఎస్ వివేకా మృతిపై ఎటూ తేల్చకపోవడంతో వైఎస్ వివేకా కుమార్తె సునీత కేసును సీీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో పిటీషన్ వేశారు. ప్రభుత్వం మాత్రం విచారణ చివరి దశకు వచ్చిందని హైకోర్టుకు తెలిపింది. చివరకు హైకోర్టు వివేకా హత్యకేసును సీబీఐ కి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. సీబీఐ అయినా వైఎస్ వివేకా హత్య కేసులో అసలు నిందితులెవరో తేల్చాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కారణాలు కూడా తెలియాల్సి ఉందంటున్నారు.

Tags:    

Similar News