Ys sharmila : అడుగులు వడివడిగానే…. నేతలు మాత్రం?

గెలుపోటములు పక్కన పెట్టండి. ప్రజలు తన వైపు చూస్తారా? లేదా? అన్నది మరో సందేహం. అసలు ఇక్కడ రాజకీయ శూన్యత ఉందా? అన్న అనుమానం. అయినా సరే.. [more]

Update: 2021-11-12 11:00 GMT

గెలుపోటములు పక్కన పెట్టండి. ప్రజలు తన వైపు చూస్తారా? లేదా? అన్నది మరో సందేహం. అసలు ఇక్కడ రాజకీయ శూన్యత ఉందా? అన్న అనుమానం. అయినా సరే.. తాను అనుకున్నది సాధించాలి. తెలంగాణ ప్రజల అభిమానాన్ని సంపాదించాలి. ఇదీ ఇప్పడు వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ముందున్న లక్ష్యం. ఆమె పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర ప్రారంభమై పది రోజులు దాటుతుంది. ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలను వింటూ వైఎస్ షర్మిల తన యాత్రను కొనసాగిస్తున్నారు.

తొలిసారి మహిళగా….

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఎవరూ పాదయాత్రను చేయలేదు. ఒకరిద్దరు చేసినా కొంత పరిధి వరకే చేశారు. తొలిసారి వైఎస్ షర్మిల నాలుగువేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. నాలుగు వందల రోజుల్లో ఈ లక్ష్యాన్ని పూర్తి చేయనున్నారు. మొత్తం 90 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కొనసాగనుంది. వైఎస్ షర్మిల పాదయాత్రకు మంచి స్పందన కన్పిస్తుంది. వైఎస్ ను అభిమానించే వారు ఆమెను చూసేందుకు గ్రామాల నుంచి తరలి రావడం కన్పించింది.

మొండితనంతో….

అధికారంలోకి వస్తారా? కనీస స్థానాలను గెలుస్తారా? అన్నది పక్కన పెడితే వైఎస్ షర్మిల ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. మొండిగానే ముందుకు వెళుతున్నారు. ఉదయం పది గంటలకు ప్రారంభమవుతున్న పాదయాత్ర రాత్రి ఆరు ఏడు గంటల మధ్య ముగిస్తున్నారు. రోజుకు 12 కిలోమీటర్ల మేర వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే 150 కిలోమీటర్లకు పైగానే షర్మిల తన పాదయాత్రను పూర్తి చేశారు.

లీడర్లు మాత్రం….

ఇక వైఎస్ షర్మిల టార్గెట్ అంతా అధికార పార్టీనే. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆమె ప్రసంగాలు కొనసాగుతున్నాయి. మరోసారి ప్రజలు మోసపోవద్దంటూ ఆమె ప్రజలను కోరుతున్నారు. మధ్యలో స్థానికులతో ఆగి వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారు. అయితే ఈ ప్రజాప్రస్థానం పాదయాత్రకు మాత్రం జనం నుంచి స్పందన వస్తున్నా, నేతలు మాత్రం పార్టీలో చేరేందుకు పెద్దగా ముందుకు రావడం లేదు. అయినా వైఎస్ షర్మిల ధైర్యంగానే అడుగులు వేస్తున్నారు. ఈ అడుగులు మరి ఎటువైపు వెళతాయన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News