తెలంగాణ డయాస్.. ఆంధ్రా ఫోకస్..?

పోరాడితే పోయిందేముంది? బానిస సంకెళ్లు తప్ప. అని చాలా కాలంగా నానుడి. షర్మిల తెలంగాణ రాజకీయ అరంగేట్రం అలానే ఉంది. సోదరుడి నుంచి వేరు పడి రాజకీయంగా [more]

Update: 2021-02-10 15:30 GMT

పోరాడితే పోయిందేముంది? బానిస సంకెళ్లు తప్ప. అని చాలా కాలంగా నానుడి. షర్మిల తెలంగాణ రాజకీయ అరంగేట్రం అలానే ఉంది. సోదరుడి నుంచి వేరు పడి రాజకీయంగా సొంత వేదికను నిర్మించుకోవాలనే ఆమె ఆలోచనను ఎవరూ తప్పు పట్టలేరు. కానీ బలమైన ప్రభావం చూపగల ఆంధ్రప్రదేశ్ ను వదిలేసి తెలంగాణను ఎంచుకోవడమేమిటనే ప్రశ్న కు సమాధానం దొరకదు. ఇందులో అనేక వ్యూహాలు, ఎత్తుగడలు, అస్తిత్వ పోరాటాలు కనిపిస్తాయి. నిజంగానే షర్మిల తన నాయకత్వాన్ని నిరూపించుకుని దీటైన రాజకీయవేత్తగా ఎదగాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ను మించిన వేదిక మరొకటి లేదు. జగన్ పట్ట ప్రజల్లో ఇప్పటికే మొదలైన అసంతృప్తి ఆమెకు వరంగా మారుతుంది. కానీ రాజన్న రాజ్యం అంటూ తెలంగాణను ఎన్నికల రణ క్షేత్రం చేసుకోదలచుకున్నట్లు ఆమె ప్రకటించారు. ఎంతగా ప్రచారం చేసినా, ఉర్రూతలూగించినా ఆమె మూలాల దృష్ట్యా ఇక్కడ ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశాలు శూన్యం. ఓట్ల చీలికకు మినహా పెద్దగా ప్రభావం చూపుతారనే ఆశలు లేవు. ముఖ్యంగా కాంగ్రెసు పార్టీకి , ఎంతో కొంత టీఆర్ఎస్ కు డ్యామేజీ చేసే సూచనలే కనిపిస్తున్నాయి.

నిలదొక్కుకునేందుకే…

చాలా యాక్టివ్ నాయకురాలిగా వైసీపీ పార్టీ తొలి దశ ప్రస్తానంలో షర్మిల చురుకైన పాత్ర పోషించారు. తల్లి అండతో ఆమె ఉమ్మడి రాష్ట్రాన్ని చుట్టి వచ్చారు. పార్టీకి ప్రతిష్టాత్మకమైన 2012 ఉప ఎన్నికల్లో అన్నీ తానన్నట్లుగా ప్రచారం చేశారు. అన్న కోసమే అదంతా చేస్తున్నానని చెప్పారు. అయినప్పటికీ రాజకీయ ఆకాంక్షలు లేకుండా అంతటి ఉద్యమ స్ఫూర్తి ఎవరికీ రాదు. తెలంగాణ రాష్ట్రం కోసమే తాను అంటూ కేసీఆర్ పధ్నాలుగేళ్లు పోరాడినా చివరికి ముఖ్యమంత్రి పీఠం వేరేవాళ్లకు దక్కకుండా చూసుకున్నారు. షర్మిల సీఎం సీటు స్థాయిని ఊహించుకోలేదు. కానీ వైసీపీ లో పార్టీ బాధ్యతలు, ఢిల్లీ లో ఒకింత హోదా కల్పిస్తారనే భావనలో ఉండేవారని సన్నిహితుల సమాచారం. జగన్ ఆమెను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఇరువురి మధ్య అంతరం పెంచింది. అన్నాచెల్లెళ్ల మధ్య భిన్నాభిప్రాయాలు మాత్రమే అంటూ వైసీపీ పార్టీ ప్రతినిధులు బహిరంగంగా వివరణ ఇస్తున్నారు. సర్దుబాటు ధోరణిలో విషయ తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వ్యక్తిగత అభిప్రాయభేదాలు తీవ్రమయ్యాయనేది ఆంతరంగికుల సమాచారం. ఏదేమైనప్పటికీ ఆమె తొలి అడుగు వేసేశారు.

అన్న అంతరంగం..లో…

అన్న కోసం అంతగా శ్రమించి కష్టపడిన చెల్లాయికి వేరే రాష్ట్రంలో పోరాటం చేస్తున్న సందర్భంలో జగన్ ఆశీస్సులు లభిస్తాయా? అన్న ప్రశ్నకు కచ్చితంగా లేదనే సమాధానం వస్తోంది. పార్టీపెట్టే ఆలోచనలను విరమించుకోవాలనే జగన్ నచ్చచెప్ప చూసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆరునెలలుగా షర్మిల పార్టీకి సంబంధించి చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ జగన్ దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించలేదు. వైఎస్సార్ అభిమానుల్లో షర్మిలకు సొంత ఇమేజ్ ఉన్నమాట వాస్తవం. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆమె పర్యటించినా వేలాది మంది కదలి వస్తారు. కుటుంబ పరంగా తక్షణ ప్రబావం చూపుతుంది. అందుకే ఆచితూచి తెలంగాణ పేరిట వేదికను ఏర్పాటు చేయడంలోనే వ్యూహం దాగి ఉంది. కాంగ్రెసు, టీఆర్ఎస్ లకు కొంత ఇబ్బంది కరంగా మారవచ్చు. బహిరంగంగా చూసేవారికి ఈ అంశాలే ఫోకస్ గా కనిపిస్తాయి. కానీ రాజశేఖరరెడ్డి పాలనను అనుక్షణం గుర్తు చేస్తుంటారామె. ఆమె ధోరణి కచ్చితంగా ఏపీలో జగన్ పరిపాలనకు పోలిక తెస్తుంది. ఇది అన్నయ్యకు నెగటివ్ ఫాక్టర్ గానే చెప్పాలి. నిధుల పంపిణీ , సంక్షేమ పథకాల విషయంలో జగన్ కొత్తరికార్డులు సృష్టిస్తున్నారు. కానీ సంక్షేమం, అభివృద్ధి మధ్య వై.ఎస్. హయాంలో కనిపించిన బ్యాలెన్స్ మాత్రం లోపించింది.

తెలంగాణలో సాధించేదేముంది..?

తెలంగాణలో షర్మిల ఏం సాధిస్తారంటే పెదవి విరుపులే కనిపిస్తున్నాయి. ఎన్టీరామారావు మరణం తర్వాత లక్ష్మీ పార్వతి పార్టీ పెట్టినప్పటికీ నామమాత్రపు ప్రబావాన్నే చూపించారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఒక మహిళ నేతృత్వంలో పార్టీ రానుండటం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పై ఎన్టీయార్ తర్వాత అంతటి బలమైన ముద్ర వేసిన నాయకుడు వై.ఎస్. అటువంటి నేత వారసత్వాన్ని క్లెయిం చేస్తోంది షర్మిల. అయితే రాజకీయంగా నేటి పరిస్థితులు భిన్నం. స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ప్రజలు రాయలసీమ మూలాలు కలిగిన షర్మిలను అందలం ఎక్కిస్తారని ఎవరూ చెప్పరు. అందుకే వ్యక్తిగతంగా ప్రత్యేక లక్ష్యాలతో ఆమె పావులు కదుపుతున్నారు.. జగన్ ఎలాగూ తెలంగాణకు రారు కాబట్టి ఇక్కడ ఉన్న ఓటు బ్యాంకులో షేర్ తీసుకోవాలనే ఆలోచనా? లేక టీడీపీ బలహీన పడిన నేపథ్యంలో ఒక కొత్త ప్రాంతీయ పార్టీకి తెలంగాణలో స్కోప్ ఉందనే అంచనాతో రంగ ప్రవేశం చేస్తున్నారా? కొందరు దూరాలోచన చేస్తున్నట్లు రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెసు వెనక గోడ కట్టకుండా చీల్చే కుట్ర సాగుతోందా? ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలే. ఏదేమైనా పురుషాధిక్యం రాజ్యం చేసే రాజకీయాల్లో ఒక మహిళ నాయకత్వంలో ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకోనుండటం మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామమే. ఇప్పటికే జయలలిత, మాయావతి, మమత వంటి వారు సొంత ముద్రతో రాజకీయాలను శాసించారు. నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు. షర్మిల కూడా పోరాట తత్వాన్ని కనబరిచి నిలదొక్కుకుంటే మహిళలు రాజకీయాల్లో రాణించగలరన్న నమ్మకం పెరుగుతుంది. హోదాలు, పదవులతో సంబంధం లేకుండా ప్రజాజీవితంలో దీర్ఘకాలం కొనసాగడమే సక్సెస్. ఆ మేరకు పాలిటిక్స్ లో షర్మిల తనదైన ముద్ర వేయాలని కోరుకుందాం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News