షర్మిలను అసలు లెక్కలోకి తీసుకోవడం లేదా?

వైఎస్ షర్మిల వచ్చే నెల 8వ తేదీన పార్టీని ప్రకటించనున్నారు. అంటే పదిహేను రోజులు కూడా సమయం లేదు. వైఎస్సార్ తెలంగాణ పార్టీగా వైఎస్ షర్మిల ప్రజల [more]

Update: 2021-06-24 00:30 GMT

వైఎస్ షర్మిల వచ్చే నెల 8వ తేదీన పార్టీని ప్రకటించనున్నారు. అంటే పదిహేను రోజులు కూడా సమయం లేదు. వైఎస్సార్ తెలంగాణ పార్టీగా వైఎస్ షర్మిల ప్రజల ముందుకు రానున్నారు. అయితే గత ఆరు నెలలకు ఇప్పటికి పార్టీలో పెద్దగా తేడా కన్పించడం లేదు. వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన వెంటనే పెద్దయెత్తున నేతలు వచ్చి చేరతారని అందరూ భావించారు. కానీ నెలలు గడుస్తున్నా ఆ పార్టీ వైపు చూసే వారు కరువయ్యారు.

తెలంగాణ బిడ్డనంటూ…

వైఎస్ షర్మిల తాను తెలంగాణ బిడ్డనని చెబుతున్నా ప్రజలు కాని, నేతలు కాని నమ్మడం లేదు. వైఎస్ షర్మిలను ఓన్ చేసుకోలేక పోతున్నారు. ఆమెను ఆంధ్రనేతగానే భావిస్తున్నారు. ఇందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణం కావచ్చు. ఇప్పుడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కావచ్చు. వీరిద్దరి ప్రభావం వైఎస్ షర్మిలపై పడుతుంది. తెలంగాణలో ప్రత్యేకంగా పార్టీ పెట్టినా వైఎస్ షర్మిలను పరాయి నేతగానే చూస్తున్నారనుకోవాలి.

నెలలు గడుస్తున్నా….

పార్టీని పెడతానని వైఎస్ షర్మిల ప్రకటించి నెలలు గడుస్తుంది. అయితే పేరున్న నేత ఎవరూ ఇప్పటి వరకూ పార్టీలో చేరలేదు. తాను నమ్మకంగా వస్తారనుకున్న నేతలు కూడా లోటస్ పాండ్ వైపు చూడటం లేదు. తాను పార్టీ పెట్టిన వెంటనే కొందరు ముఖ్యనేతలు వస్తారనుకున్నారు. వారికి పార్టీలో కీలక పదవులు అప్పగించాలని వైఎస్ షర్మిల భావించారు. కానీ వారికి ఆహ్వానం పంపినా మొహం చాటేయడంతో పార్టీ పదవులను కూడా ద్వితీయశ్రేణి నేతలతో నింపేయాల్సి వచ్చింది.

పార్టీ పేరును…

ఇక జులై 8వ తేదీన వైఎస్ షర్మిల పార్టీని ప్రకటించబోతున్నారు. ఇందుకోసం ఆమె గత కొంతకాలంగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలపై స్పందిస్తూ వైఎస్ షర్మిల నేరుగా బాధిత కుటుంబాలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా వైఎస్ షర్మిల పట్ల ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదన్నది వాస్తవం. ఆమెను పరాయి రాష్ట్ర నేతగానే భావిస్తుండటమే ఇందుకు కారణం. మరి షర్మిల తన కొత్త పార్టీని తెలంగాణలో ఎలా ముందుకు తీసుకెళతారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News