లోటస్ పాండ్ క్యూ కడుతున్నది వారేనా?

వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. గత కొద్దిరోజులుగా షర్మిల జిల్లా స్థాయి నేతలతో సమావేశం అవుతున్నారు. వీరంతా గతంలో కాంగ్రెస్ లో ఉన్న వారు, [more]

Update: 2021-03-04 12:30 GMT

వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. గత కొద్దిరోజులుగా షర్మిల జిల్లా స్థాయి నేతలతో సమావేశం అవుతున్నారు. వీరంతా గతంలో కాంగ్రెస్ లో ఉన్న వారు, ప్రస్తుతం వైసీపీలో ఉన్నవారే. ఆత్మీయ సమావేశానికి అధిక సంఖ్యలోనే జిల్లాల నుంచి వస్తున్నారు. అయితే చెప్పుకోదగ్గ నేతల పేర్లు మాత్రం వినపడటం లేదు. వచ్చిన కొద్దిమంది నేతలు కూడా జనాదరణ, ప్రజల్లో బలం లేని నాయకులే. దీంతో వైఎస్ షర్మిల కొత్త పార్టీ తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇతర పార్టీల నుంచి…..

వైఎస్ షర్మిల తాను కొత్త పార్టీ పెడితే పోలో మని కాంగ్రెస్ నుంచి వచ్చి నేతలు చేరిపోతారని ఆశించలేదు. అలాగే సీనియర్ నేతలు కూడా వచ్చి చేరతారని భావించలేదు. అయితే తన ప్రయత్నాన్ని మాత్రం షర్మిల విరమించదలచుకోలేదు. అందుకే జల్లా స్థాయి నేతలతో కూడా కొత్త నాయకత్వంతోనే పార్టీ ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చెబుతూ వస్తున్నారు. తెలంగాణలోని పాత పది జిల్లాల్లో పేరున్న నేతలందరూ ఏదో ఒక పార్టీలో ఇమిడిపోయారు.

కొత్త పార్టీని నమ్మి….

ఇప్పుడు వైఎస్ షర్మిల పార్టీని నమ్మి సీనియర్ నేతలు వచ్చి చేరే అవకాశం లేదు. ఆర్థికంగా, సామాజికపరంగా బలమైన నేతలు ఎవరూ తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వైపు మాత్రమే చూస్తున్నారు. ఇది వాస్తవం. కొత్త పార్టీలో చేరి చేతులు కాల్చుకుని మరో ఐదేళ్లు వృధా చేసుకునే పరిస్థితి ఉండదన్నది నగ్నసత్యం. అందుకే సీనియర్ నేతలు ఎవరూ లోటస్ పాండ్ వైపు తొంగి కూడా చూడటం లేదు.

కొత్త నాయకత్వంతోనే…?

అయితే వైఎస్ షర్మిల పార్టీలో చేరేందుకు ఎక్కువ మంది యువకులు ఉత్సాహంగా ఉన్నారు. గత పక్షం రోజుల నుంచి లోటస్ పాండ్ దగ్గర గమనిస్తే ముప్ఫయి నుంచి నలభై ఐదు ఏళ్ల లోపు వారే ఎక్కువగా కన్పిస్తున్నారు. మరి వీరి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలియదు. కేవలం వైఎస్ చరిష్మాతోనే వీరు బరిలోకి దిగాల్సి ఉంటుంది. తెలంగాణ వచ్చి ఏడేళ్లు దాటుతోంది. ఇప్పటికీ వైఎస్ ఓటు బ్యాంకు ఇక్కడ ఉందా? లేదా? అన్నది కూడా అనుమానమే. కానీ షర్మిల మాత్రం కొత్త నాయకత్వంతోనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందన్నది మాత్రం నిజం.

Tags:    

Similar News