షర్మిలే నారి సంధిస్తే…?

జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏడేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ఉప్పెనలా విరుచుకుపడిన షర్మిల మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారారు. 16 నెలల పాటు [more]

Update: 2021-02-09 03:30 GMT

జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏడేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ఉప్పెనలా విరుచుకుపడిన షర్మిల మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారారు. 16 నెలల పాటు జైలు లో ఉన్న అన్నకు అండగా , వైసీపీ పార్టీ జెండాను పాదయాత్ర రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత ఆమెకే దక్కుతుంది. ఒక ప్రాంతీయ పార్టీగా వైసీపీ తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ సానుభూతి ప్రకంపనలు సృష్టించడానికి షర్మిల ఇంధనమై ఉపయోగపడ్డారు. అయితే జగన్ జైలు నుంచి ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత సహజంగానే షర్మిల ప్రాధాన్యం కుచించుకుపోయింది. అధికారిక పదవులేమీ దక్కలేదు. పార్టీ పరంగానూ ఆమెను పక్కనపెట్టేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కుటుంబ పరంగానూ తగు ప్రాధాన్యం దక్కడం లేదనేది షర్మిల ఆవేదనగా కొందరు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తమ్మీద షర్మిల తన ప్రభావాన్ని తెలుగు రాజకీయ రంగంలో చూపాలనుకుంటున్నట్లుగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. అయితే తెలంగాణ వేదికగా పార్టీని పెడతారన్న జోస్యాల్లోని అంతరార్థమే ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పటికే ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కు అడ్డురాకూడదనే భావనతో ఆమె ఈ నిర్ణయం తీసుకోబోతున్నారా? లేక తెలంగాణలో అత్యధికంగా ఉన్న రెడ్డి, క్రిస్టియన్, మైనారిటీలలో గుర్తింపు కలిగిన నేతగా ఎదిగేందుకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నారా? పూర్తిగా తెలంగాణ గడ్డను టీఆర్ఎస్, కాంగ్రెసు, బీజేపీలకే ఎందుకు వదిలేయాలనే ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డియే స్వయంగా ఆమెను రంగంలోకి దింపుతున్నారా? ఇవన్నీ ప్రస్తుతానికి ఎదురుచూడాల్సిన అంశాలే. అసలు షర్మిల రంగప్రవేశం పక్కాగా నిశ్చయమైపోయిందా? అన్న విషయంలోనూ సందేహాలున్నాయి. పరిణామాలు మాత్రం ఆసక్తి గొలుపుతున్నాయి.

సొంత అస్తిత్వం…

ద్వితీయ వివాహ నిర్ణయం మొదలు అన్నిటా షర్మిల స్వతంత్ర వ్యక్తిత్వం కల అమ్మాయిగా ముద్ర వేసుకున్నారు. ఆడపిల్లకు రాజశేఖరరెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ అది. ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం, సాహసం , సవాళ్లు, సంక్షోభాలకు ఎదురువెళ్లగల ఆత్మ స్థైర్యం మెండు. షర్మిల దేనికైనా వెనుకాడరనేది ఆమెను సన్నిహితంగా పరిశీలించిన వారి అభిప్రాయం. వైసీపీ నిలదొక్కుకోవడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె నామమాత్రమై పోయారు. పాలనకు సంబంధించి కీలక పదవులు కాకపోయినా, ఎంపీ స్థాయి హోదానైనా ఆమెకు కల్పించలేకపోయారు. నాయకత్వ లక్షణాలు నిండుగా ఉన్న షర్మిల ఈ విషయంలో అన్న జగన్ నుంచి నిరాశనే ఎదుర్కొంటున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. మరోవైపు టీఆర్ఎస్ లో కవిత, పక్క రాస్ట్రమైన తమిళనాడులోని డీఎంకేలో కనిమొళి వంటి మహిళలు రాజకీయంగా రాణిస్తున్నారు. వారి పార్టీల పరంగా చూస్తే వారికంటే వైసీపీకి షర్మిల చాలా తోడ్పాటునందించారు. అయినప్పటికీ తగిన ప్రాముఖ్యం లేదు. సొంత అస్తిత్వం కరవు అయ్యింది. తన బలాన్ని నిరూపించుకునేందుకే షర్మిల రంగంలోకి దిగుతారనేది ఆమెను సమర్థించేవారి వాదన.

కుటుంబ వివాదం…

వైఎస్ వారసత్వం విషయంలో జగన్ కు ఎంత అధికారముందో షర్మిలకూ అంతే పాత్ర ఇవ్వాలనేది మరికొందరి వాదన. రాజకీయంగా తాను మాత్రమే కీలకం అన్న జగన్ మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూ లోభాగంగానే షర్మిలను పక్కనపెట్టేశారని చెబుతున్నారు. సాక్షి గ్రూపునకు ఛైర్మన్ గా తన అడ్మినిస్ట్రేటివ్ నైపుణ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్న జగన్ భార్య భారతికి సైతం రాజకీయపరంగా ఆకాంక్షలు ఉన్నాయనేది కొందరి అంచనా. జగన్ మోహన్ రెడ్డి కేసులు రానున్న రోజుల్లో కీలక దశకు చేరుకుంటాయి. ఆయన రాజకీయ జీవితంలో ఒడుదుడుకులు ఇంకా చల్లారిపోలేదు. ఈ స్థితిలో షర్మిల రంగంలోకి దిగితే జగన్ వారసత్వం ఆమెకే దక్కుతుందనడంలో సందేహం లేదు. జగన్ భార్యకు ఎంతటి ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ ఇప్పటికే ప్రజల్లో ఒక ముద్ర వేసుకున్న చెల్లి షర్మిల తో పోటీపడటం భారతికికష్టసాధ్యం. అందుకే షర్మిలను వ్యూహాత్మకంగా రాజకీయ చాయలకు రాకుండా అన్న జగన్ నియంత్రించారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.

కాంగ్రెసు కట్ ..బీజేపీ బూస్ట్…

షర్మిల ఒక వేళ పార్టీ పరమైన పని ప్రారంభించినప్పటికీ ఇమ్మీడియెట్ గా అన్నకు పోటీ కాదలచుకోలేదంటున్నారు. సామాజిక సమీకరణల రీత్యా ఎంతో బలమున్నప్పటికీ పార్టీ చేజేతులారా వదిలేసుకున్న తెలంగాణపై షర్మిల దృష్టి పెడతారంటున్నారు. రెడ్డి, క్రిస్టియన్, ముస్లిం, దళిత సామాజిక వర్గాల్లో వై.ఎస్ కు చాలా పేరుంది. ఆ వర్గాలు ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో కాంగ్రెసు, టీఆర్ఎస్ లకు మద్దతు పలుకుతున్నాయి. షర్మిల రంగంలోకి దిగితే రెడ్డి , దళిత, క్రిస్టియన్, మైనారిటీ వర్గాలలో ఆదరణ ఖాయమంటున్నారు. అదే జరిగితే కాంగ్రెసు పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. బీజేపీ బలపడుతుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా చెక్ పాయింట్ గా పార్టీ నిలబడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అంతా ఊహాగానాలు, రాజకీయ అంచనాల నేపథ్యంలోనే ప్రచారం సాగుతోంది. షర్మిల రాజకీయ ఆశలు, ఆకాంక్షలు, సాగుతున్న ప్రచారం పై స్పష్టత రావాలంటే ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే. అయితే వై.ఎస్. వారసురాలే రంగంలోకి దిగితే రాజకీయ సంచలనం మాత్రం ఖాయం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News