కూడికలు – తీసివేతలు అస్సలు ఉండవు

రాజశేఖర్ రెడ్డి చదివింది వైద్య శాస్త్రం. ఇందులో కూడికలు, తీసివేతలు ఉండవు. రోగం, వైద్యం మాత్రమే ఉంటాయి. 1978లోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినా 1999లో ప్రతిపక్ష నేతగా [more]

Update: 2020-09-03 03:30 GMT

రాజశేఖర్ రెడ్డి చదివింది వైద్య శాస్త్రం. ఇందులో కూడికలు, తీసివేతలు ఉండవు. రోగం, వైద్యం మాత్రమే ఉంటాయి. 1978లోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినా 1999లో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టే వరకూ రాజశేఖర్ రెడ్డికి ఒక లక్ష్యం లేదు. రాజకీయాల్లో ఉండాలి అనే నిర్ణయం తప్ప రాజకీయాలను శాసించాలి లేదా శాసించే స్థాయికి చేరుకోవాలి అనే లక్ష్యం ఆయనకు లేదు. తన వైఖరిని తప్పు పట్టే వారిని తీవ్రంగా వ్యతిరేకించడం, తాను వ్యతిరేకించేవారు, విబేధించేవారు ఎంతటి వారైనా ఎదురు తిరగడం ఆయన వ్యక్తిత్వం. ఈ క్రమంలో ఆయన అవకాశాలకోసం ప్రయత్నం చేయలేదు.

ఎదురు తిరగడమే….

ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని గానీ, వచ్చిన అవకాశాలను చేజారిపోకుండా చూసుకోవాలని గానీ ఆయన అనుకున్నట్టు కనిపించదు. ఏదో లక్ష్యం నిర్దేశించుకుని ఆ లక్ష్యం చేరుకోడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా ఎప్పుడూ కనిపించలేదు. ఒక రకంగా చెప్పాలంటే లక్ష్యం లేని రాజకీయాలు. అన్నీ ముక్కుసూటి వ్యవహారాలే. నావాళ్ళెవరూ, నా ప్రత్యర్థులెవరూ అని సాగిన ప్రయాణం. ఈ కారణంగానే 1990లో హైదరాబాద్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని పదవీచ్యుతుణ్ణి చేసేందుకు జరిగాయని, వీటికి రాజశేఖర్ రెడ్డి కారణమని లేదా బాధ్యుడని ఆయన ప్రత్యర్ధులు ఆరోపించినా ఆయన స్పందించ లేదు. అప్పటికి కూడా ఆయనకు ఒక రాజకీయ లక్ష్యం లేదు. అందుకోసం ఒక వ్యూహం లేదు. ఎత్తులూ, పై ఎత్తులూ ఏమీ లేవు.

అదే వైఎస్ కు తెలిసిన రాజకీయం….

కాంగ్రెస్ లో ఉన్న మహామహుల కారణంగా కావచ్చు లేదా మరోటి కావచ్చు… ఈ రాష్ట్రానికి తాను నాయకుణ్ణి కావాలన్న ఆకాంక్ష అప్పటికి ఆయనలో లేదు. అప్పటికే ఉన్న నాయకుల్లో ఎవరికోసమో పనిచేయడమో, ఇంకెవరినో అడ్డుకోవడమో తప్ప తనకంటూ స్వంత రాజకీయం లేదు. స్వంత వర్గం ఉన్నా అది తనకోసం కాక తాను ఇష్టపడే పెద్దనాయకులకోసం ఉపయోగించే వారు. రాజకీయాల్లోకి వచ్చాం… ఎన్నికల్లో పులివెందులనుండి అసెంబ్లీకో, కడప నుండి పార్లమెంటుకో పోటీ చేస్తున్నాం… గెలుస్తున్నాం… అసెంబ్లీకి గెలిస్తే హైదరాబాద్ కు, పార్లమెంటుకు గెలిస్తే ఢిల్లీకి వెళతాం… తిరిగి మళ్ళీ ఇడుపులపాయకు వెళతాం… మధ్యలో అప్పుడప్పుడూ తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం విజయవాడకో, విశాఖపట్నానికో వెళ్ళొస్తాం… ఇవే అప్పటికి ఆయనకు తెలిసిన రాజకీయం.

చంద్రబాబు సీఎం అయ్యాక…..

1995లో తన సహచరుడు ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళిన తర్వాత రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో మార్పు వచ్చింది. తన రాజకీయాలు ఎవరికోసం అనే ప్రశ్న తలెత్తింది. తన రాజకీయాలు తనకు ఉపయోగపడాలనే ఆలోచన మొదలయింది. అందుకే 1999 ఎన్నికల్లో లోక్ సభకు వెళ్ళకుండా రాష్ట్ర శాసనసభకు తిరిగి వచ్చారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని గెలుపు అంచువరకూ తీసుకెళ్ళాయి. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే అనే పుకార్లు కూడా వచ్చాయి. అప్పటివరకు ప్రతిపక్ష నేతగా ఉన్న పి జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రి పదవి రేసులో దిగి ఢిల్లీలో మకాం వేశారు. అయితే ఎన్నికల ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ముఖ్యమంత్రి అవుతానన్న జనార్ధన రెడ్డి ఢిల్లీలో ఉండగానే ఓడిపోయినట్టు వార్తలొచ్చాయి. జనార్ధన రెడ్డి ఓటమితో ప్రతిపక్ష నేత పదవి రాజశేఖర్ రెడ్డికి వచ్చింది. ఈ పదవి రాజశేఖర్ రెడ్డికి అప్పటివరకు తాను చేస్తున్న రాజకీయాలకు భిన్నమైన కోణం పరిచయం చేసింది.

ప్రతిపక్ష నేతగా……

1999లో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న క్రమంలో రాజశేఖర్ రెడ్డిలో ప్రత్యేకించి ఆయన రాజకీయాల్లో మార్పు వచ్చింది. తన వాళ్ళెవరూ, తన ప్రత్యర్థులెవరూ అని చూడ్డంతో మంచేంటి, చెడేంటి అనే విచక్షణ శాసనసభలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడే మొదలయ్యింది. అప్పుడే నేనేంటి అనే ప్రశ్న కూడా తలెత్తింది. నేనేంటి అనే ఈ ప్రశ్నకు జవాబు వెతికే ప్రయత్నంలో భాగంగా మొదలయిందే 2003నాటి ప్రజాప్రస్థానం పాదయాత్ర. ఈ యాత్రలోనే నాయకత్వంపై ధిక్కార స్వరం కూడా వినిపించి “నేనేంటి” అనే ప్రశ్నకు జవాబు వెతుక్కుంటూ చేవెళ్ళ నుండి ఇచ్చాపురం వరకూ నడక సాగింది. ఈ నడకలోనే ఏదో సినిమాలో చెప్పినట్టు “తనని తాను కనుగొన్నారు” రాజశేఖర్ రెడ్డి.

మీసం.. రోషం పోయి…..

నేనేంటి అనే ప్రశ్నకు ఈ పాదయాత్రలో దొరికిన జవాబు ప్రజలు. “నేను అంటే నేనొక్కడినే కాదు. నాచుట్టూ ఉన్న ప్రజలు” అని అర్ధం చేసుకున్న తర్వాత రాజశేఖర్ రెడ్డి రాజకీయాలు, వ్యవహార శైలి, వ్యక్తిత్వం, మారిపోయాయి. నేను అంటే రైతులు. నేను అంటే ప్రజలు అనే ఆలోచన వచ్చిన తర్వాతనే రాజశేఖర్ రెడ్డి విజన్ మారింది. ఆరోగ్యశ్రీ వచ్చింది. ఎంతో మందిని మృత్యుముఖం నుండి కాపాడింది. పాలనలో ప్రజా సంక్షేమం పెనవేసుకుపోయింది. బహుశా ఈ బంధం వేరుచేయడం ఇక ఏ పాలకుడికీ సాధ్యం కాకపోవచ్చు. అంత బలమైన ముద్రవేశారు రాజశేఖర్ రెడ్డి. 1990 హైదరాబాద్ అల్లర్ల నాటికి ఉన్న రాయలసీమ ఫ్యాక్షనిస్టు ముద్రను 2003 పాదయాత్రలో చెరిపేసుకున్నారు. 1990 దశకం వరకూ ఉన్న కోరమీసం కూడా పోయింది. ఆ మీసంలో ఉండే రోషం కూడా పోయింది. చిరునవ్వు ప్రత్యక్షమయ్యింది. ఈ చిరునవ్వే, జనం-సంక్షేమం అనే రాజకీయ ఎజెండాయే రాజశేఖర్ రెడ్డిని 2004లో తిరిగి 2009లో ముఖ్యమంత్రిని చేశాయి. ఆ చిరునవ్వే… ఆ ఎజెండాయే సెప్టెంబర్ 2, 2009న అనంతలోకాలకు వెళ్లేంతవరకూ చెక్కు చెదరకుండా ఉండిపోయింది. ఇంకా ఉంటోంది.

ఆయన అడిగింది అర్ధం కాలే…..

భుజంమీద చెయ్యేసి మాట్లాడడం వైఎస్ మానరిజం.
మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక ఓసారి విజయవాడ వచ్చారు. ప్రెస్ మీట్ అయిపోయింది.
హాల్లో నుండి బయటకు వస్తూ నన్ను చూసి భుజంమీద చెయ్యి వేసి ‘ఏంటి విశేషాలు’ అన్నారు.
నా భుజంమీద చెయ్యి పడగానే సెక్యూరిటీ సిబ్బంది కాస్త దూరంగా జరిగారు. మిగతా వారిని కూడా కొంచెం దూరంగానే ఉంచారు.
ఇద్దరం అలా నడుస్తున్నప్పుడు “ఏమన్నా అడుగుతావా?” అని నా భుజమ్మీద మృదువుగా నొక్కి అడిగారు.
“ఇంకా ఏమడుగుతాం సర్. అన్నీ ప్రెస్ మీట్లో అడిగేశాగా” అన్నాను.
గట్టిగా నవ్వేసి భుజమ్మీద ఆప్యాయంగా చరిచి అలా ముందుకెళ్లిపోయారు.
ఆ తర్వాత తెలిసింది. ‘ఏమన్నా అడుగుతావా?’ అని ఆయన అంటే ‘నీకేమన్నా కావాలా?’ అని అర్థం అంట.
ఏమన్నా అడగాలని కాదుగాని, ఈ అర్ధం నాకు తెలిసే నాటికి మళ్ళీ ఆయన్ను కలిసే అవకాశం లేకుండా పోయింది.

(మూడవ భాగం)

-గోపీ దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News