విజయమ్మ, షర్మిల లక్ష్యం నెరవేరినట్లేనా …?

మహానేత వైఎస్సార్ గతించిన తరువాత గత కొంతకాలంగా ఆయన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు తెరతీస్తున్నాయి. వైఎస్ భార్య విజయమ్మ, కుమార్తె షర్మిల [more]

Update: 2021-09-05 03:30 GMT

మహానేత వైఎస్సార్ గతించిన తరువాత గత కొంతకాలంగా ఆయన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు తెరతీస్తున్నాయి. వైఎస్ భార్య విజయమ్మ, కుమార్తె షర్మిల ఒక పక్క కుమారుడు వైఎస్ జగన్, ఆయన కోడలు భారతి మరో పక్క గా కుటుంబం రెండుగా చీలిపోయిందన్నది పెద్దాయన జయంతి నుంచి వర్ధంతి వరకు జరిగిన కార్యక్రమాలు చెప్పకనే చెప్పేస్తున్నాయి. వైసీపీ లో జగన్ తరువాత ఎవరు అనే అంశమే వైఎస్ కుటుంబంలో విభేదాలకు ప్రధాన కారణం గా టిడిపి మీడియా లో గట్టి ప్రచారమే సాగుతుంది. మరోపక్క జగన్ కు దూరంగా ఉన్న చాలామంది వైఎస్ సన్నిహితులు రాజశేఖర రెడ్డి సంస్మరణ సభకు అయితే హాజరు అయ్యారు. కానీ వారంతా షర్మిల వెంట నడిచేందుకు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.

షర్మిల దీవించమన్నారు …

వైఎస్ సంస్మరణ సభ విజయమ్మ ప్రారంభోపన్యాసం తో ప్రారంభమై షర్మిల ఉపన్యాసంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో వైఎస్ ఆత్మ గా పేరొందిన కెవిపి రామచంద్రరావు, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్, నల్గొండ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరెవ్వరు షర్మిల కొత్త పార్టీ తెలంగాణ లో దూసుకుపోవాలని దీవించలేదు. వైఎస్ తో తమ అనుబంధాన్ని జ్ఞాపకాలను మాత్రమే పంచుకోవడం విశేషం. అయితే షర్మిల మాత్రం తండ్రి బాటలో నడుస్తున్న తనకు అండగా ఉండాలని దీవించాలని కోరడం ఈ సంస్మరణ సభ ప్రధాన ఉద్దేశ్యాన్ని చాటి చెప్పేసింది.

ఆ మీడియా లో హైలైట్ …

వైఎస్ కుటుంబంలో ఏర్పడిన విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్నది వైఎస్ భారతి పర్యవేక్షిస్తున్న సాక్షిఛానెల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడం గమనిస్తే తేటతెల్లం అవుతుంది. అదే టిడిపి అనుకూల మీడియా ఛానెల్స్ భాగ్యనగర్ వేదికగా సాగిన వైఎస్ సంస్మరణ కార్యక్రమం తెలుగుదేశం కార్యక్రమాలను ఎలా హైలైట్ చేస్తాయో అంతకు మించే ప్రాధాన్యత కల్పించడం విశేషమనే అంతా చెబుతున్నారు. ఈ ఒక్క ప్రసార అంశాల్లో ఉన్న తేడా గమనిస్తే చాలు అని జగన్ కు షర్మిలకు నడుమ పెరిగిన దూరం అందరికి అర్ధమౌతుందన్న రాజకీయ విశ్లేషణలు ఇప్పుడు జోరందుకున్నాయి. వైఎస్ రాజకీయ వారసత్వం లో తనకు సమాన వాటా ఉందని చాటి చెప్పడంలో ఆయన కుమార్తె షర్మిల మాత్రం సక్సెస్ అయినట్లే చెప్పొచ్చు. అయితే ఈ పరిణామాలు మాత్రం ఏపీ వైసిపి లో మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి మరి.

Tags:    

Similar News