వైఎస్ ఫార్ములాయే కరెక్టా?

ముఖ్యమంత్రిగా వైఎస్సార్ ఉన్నపుడు పాలనాపరంగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అదే విధంగా ఆయన శాంతిభద్రతలను ప్రత్యేకంగా పర్యవేక్షించేవారు. ఆయన హయాంలో సరిగ్గా పదకొండేళ్ళ క్రితం వరంగల్ [more]

Update: 2019-12-06 15:30 GMT

ముఖ్యమంత్రిగా వైఎస్సార్ ఉన్నపుడు పాలనాపరంగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అదే విధంగా ఆయన శాంతిభద్రతలను ప్రత్యేకంగా పర్యవేక్షించేవారు. ఆయన హయాంలో సరిగ్గా పదకొండేళ్ళ క్రితం వరంగల్ లో ఒక యాసిడ్ దాడి కేసు జరిగింది. స్వప్నిక, ప్రణీత అనే ఇద్దరు యువతుల మీద కొందరు యువకులు యాసిడ్ దాడి చేసిన ఘటనపైన ఉమ్మడి ఏపీ అంతటా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. దీంతో కేసు విచారణ పేరిట నిందితులను బయటకు తీసికెళ్ళినపుడు వారు దాడి చేశారన్న కారణంతో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దాంతో నాడు అంతా పోలీసులు చేసిన పనిని మెచ్చుకున్నారు. వైఎస్సార్ సర్కార్ లో అప్పట్లో అదో సంచలనంగా ఉంది. అయితే ఆ తరువాత పదకొండేళ్ళకు అదే తెలంగాణాలో మరో ఎన్ కౌంటర్ అచ్చం అలాగే జరగడం విశేషం. చిత్రమేంటంటే తాజాగా యువ పశు వైద్యాధికారిణి దిశ హత్యోదంతంలో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడానికి నాటి ఘటన ఒక స్పూర్తిగా కూడా ప్రచారం సాగుతోంది.

నిర్భయ చట్టం వచ్చినా…?

నిజానికి దేశంలో అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. కొత్తగా నిర్భయ చట్టం వచ్చింది. అయినా ఎక్కడా అత్యాచారాలు మాత్రం ఆగడంలేదు. దాంతో మరో మారు ఎన్ కౌంటర్ తోనే తీర్పు చెప్పడం బట్టి చూస్తూంటే ఇలాంటి కేసులకు అదే సరైన జవాబుగా ఉందా అన్న మాట వినిపిస్తోంది. నిజానికి ఎన్ కౌంటర్ చేయలేకపోబట్టే తన కుమార్తెకు ఏడేళ్ళు అయినా న్యాయం జరగలేదని నిర్భయ తల్లి అసక్తికరమైన వ్యాఖ్యలతో స్పందించారు. ఈ కేసులో ఇప్పటికీ ఉరికంబానికి చేరువగా ఉన్నా కూడా నిందితులను జైళ్ళో మేపుతున్నారంటూ సోషల్ మీడియాలో సైతం హాట్ కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. ఇక మరో వైపు చూసుకుంటే ఏపీలో పన్నెండెళ్ళ క్రితం నాటి అయేషా మీరా హత్యోదంతం లో కూడా నిందితులకు శిక్షలు లేవు. అసలు తెర వెనక సూత్రధారులు ఎవరన్నది కూడా తేలలేదు. మరి వీటికి పరిష్కారం దొరికిన వారిని దొరికిన‌ట్లుగా ఎన్ కౌంటర్ చేయడమే కరెక్ట్ అని అయేషా మీరా తల్లి అంటున్నారంటే కూడా ఆలోచించాలి. ఇక అంతకు ముందు అంటే 2003 టైంలో సినీ నటి పత్యూష హత్యోదంతంలో కూడా ఇలాంటి విధానాలు అవలంబిస్తే తమకు న్యాయం జరిగేదని ఆమె తల్లి సరోజినీదేవి అంటున్నారంటే వైఎస్సార్ ఫార్ములా గుర్తుకురాక మానదు.

కఠిన చట్టాలు తెస్తారా..?

ఇపుడు దిశా నిందితుల ఎన్ కౌంటర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. డిల్లీ డీజీపీ కూడా శభాష్ తెలంగాణా పోలీస్ అంటున్నారంటే కఠిన చట్టాల ఆవశ్యకత ఏమిటో అది తెలియచేస్తోంది. మరి అవి లేని నాడు ఎన్ కౌంటర్లే శరణ్యం అన్న మాట వినిపిస్తోంది. ఈ విషయంలో ప్రజల మైండ్ సెట్ కూడా అనుకూలంగా ఉండడంతో ఎన్నో సంస్కరణలు తెస్తున్నా పాలకులు ఈ విషయంలో కూడా ద్రుష్టి సారిస్తారేమో చూడాలి. ఏది ఏమైనా వైఎస్సార్ ని ఇప్పటివరకూ పాలనాపరంగానే అంతా స్పూర్తిగా తీసుకునే వారు, ఇపుడు అఘాయిత్యాలు, మహిళల మీద దాడులు పెరిగిపోయిన తరుణంలో పదకొండేళ్ళ క్రితమే ఆయన చూపిన బాట ఇపుడు దేశానికి మార్గదర్శకం చేస్తుందా? ఈ దిశగా కొత్త చట్టాలు రూపుదిద్దుకుంటాయా అన్నది వేచి చూడాల్సిందే. తెలంగాణాలో కేసీయార్ సర్కార్ ఈ విషయంలో వైఎస్సార్ ని అనుసరించిందని అంతా అంటున్నారు మరి.

Tags:    

Similar News