సరైన టైమింగ్ ఇదేనా..?

అమరావతిలో రాష్ట్రరాజధాని ఉంటుందా? లేదా? అన్న చర్చ మళ్లీ మొదలైంది. టెస్టింగ్ వాటర్స్ అని రాజకీయాల్లో అద్భుతమైన సిద్దాంతమొకటి వినియోగిస్తుంటారు. ప్రజలతో ముడిపడిన అంశాలు, వివాదాస్పద విషయాల్లో [more]

Update: 2019-08-21 15:30 GMT

అమరావతిలో రాష్ట్రరాజధాని ఉంటుందా? లేదా? అన్న చర్చ మళ్లీ మొదలైంది. టెస్టింగ్ వాటర్స్ అని రాజకీయాల్లో అద్భుతమైన సిద్దాంతమొకటి వినియోగిస్తుంటారు. ప్రజలతో ముడిపడిన అంశాలు, వివాదాస్పద విషయాల్లో ప్రజలు, ప్రతిపక్షాలు ఏవిధంగా స్పందిస్తాయో తెలుసుకునే ప్రక్రియలో భాగంగా సూచన ప్రాయంగా ఉన్నతస్థానంలోని వ్యక్తులు కొన్ని ప్రకటనలు చేస్తుంటారు. ఆ ప్రకటన పట్ల సమాజంలోని వివిధ వర్గాల స్పందనను బేరీజు వేస్తుంటారు. తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైతే ఆ ప్రకటనను ఉపసంహరించుకుంటారు. అగ్రనాయకులు రంగంలోకి దిగి దానిని ఖండించి దిద్దుబాటు చేస్తుంటారు. ఒకవేళ ప్రజలనుంచి సానుకూలత వ్యక్తమైనా, వ్యతిరేకత తట్టుకోగలమనే నమ్మకం కలిగినా అడుగు ముందుకు వేస్తుంటారు. గో ఎహెడ్ అని ప్రభుత్వ పెద్దలు యంత్రాంగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తాము ఓన్ చేసుకుంటారు. వివాదాస్పదంగా కనిపించిన అంశాలపై ఏం తేల్చుకోవాలనే దానిపై దిశానిర్దేశం చేస్తుంది టెస్టింగ్ వాటర్స్ సిద్దాంతం.

ఇది ప్రభుత్వ భావనే..?

తాజాగా రాజధానిపై అమరావతి పై మునిసిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన, అదే రకమైన అభిప్రాయాన్ని బలపరిచే విధంగా వైసీపీ లో నెంబర్ టు పొజిషన్ లో ఉన్న విజయసాయిరెడ్డిచేసిన ట్వీట్.. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ ప్రధానిని కలిసిన సందర్భంలో రాజధాని నిధుల విషయంలో తొందరపాటు లేదని చెప్పినట్లుగా సాగుతున్న ప్రచారం . ఈ మూడు అంశాలు ఒకదానికొకటి అనుసంధానం కావడంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం మొదలైంది. ప్రజల్లో అనుమానాలు, అపోహలు, వదంతులు వ్యాపిస్తున్నాయి. ప్రభుత్వంలోని కీలక నాయకులు సమయం కాని సమయంలో ఎందుకు ఈ ప్రకటనలు చేశారు? తద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వ యోచనను బయటపెట్టేందుకు వరదల సమయాన్ని మించిన సందర్బం లేదని భావించారా? ప్రకృతి విరుచుకుపడటంతో ఫీల్డులో ఉన్న పరిస్థితిని తమ ఆలోచనతో ముడిపెట్టి ప్రజల ముందుకు తెస్తే ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా మలచుకోవడానికి వీలవుతుంది. అందుకు ఇదే సరైన టైమింగ్ అని భావించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

టీడీపీ ఏకపక్షం…

నిజానికి రాజధాని అమరావతి ప్రకటన నుంచే వివాదాలు కొనసాగుతున్నాయి. శివరామకృష్ణ కమిటీ ఎనిమిది ప్రాంతాలపై అధ్యయనం చేసి నాలుగు ప్రాంతాలను సిఫార్సు చేసింది. అందులో విజయవాడ ఉంది. కానీ ఈ నగరానికి 30, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి లేదనేది ఆరోపణ. తెలుగుదేశం పార్టీ రాజధానిని ఎంపిక చేసేముందు తమ అనుయాయుల చేత భారీ ఎత్తున భూములు కొనిపించి ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడిందనేది మరొక అభియోగం. రాజధాని అనేది శాశ్వత నిర్మాణం. కొన్ని వందల సంవత్సరాలు, తరతరాలు కొనసాగాల్సి ఉంటుంది. ఆయా దేశాలకు గుర్తింపు అంతర్జాతీయంగా చెప్పాలంటే రాజధాని పేరు మీదనే ఉంటుంది. అంతటి కీలకమైన అంశంపై తెలుగుదేశం ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందనేది మరొక ఆరోపణ. శివరామకృష్ణ కమిటీ, ఇన్ సైడ్ ట్రేడింగ్ లను పక్కనపెట్టినా రాజధాని నిర్ణయం విషయంలో టీడీపీ ఏకపక్షంగా వ్యవహరించిన అంశం మాత్రం సుస్పష్టం. అనువైన ప్రాంతాలన్నిటిపైనా విస్త్రుతంగా ప్రజాశ్రేణుల్లో, మేధోవర్గాల్లో చర్చకు పెట్టి ఉంటే వైసీపీ వ్యతిరేకించే పరిస్థితి ఉండేది కాదు. ప్రజారాజధాని అని పెట్టుకున్న టాగ్ లైన్ కు సార్థకత చేకూరి ఉండేది. అయిదేళ్ల పాటు అధికారం అప్పగిస్తే ప్రజలను సంప్రతించకుండా కనీసం నిపుణుల కమిటీ నివేదికను కూడా పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకోకుండా తెలుగుదేశం ప్రభుత్వం తొందరపాటుకు పాల్పడింది. ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించకుండా పచ్చని పంట పొలాలను కాంక్రీట్ జంగిల్ గా మార్చేందుకు పూనుకున్నారు. ఈ ఎంపికపై చంద్రబాబు నాయుడి కుండే వాస్తు విశ్వాసం తదితర కారణాలపై అభియోగాలున్నాయి. ఏదేమైనప్పటికీ దేశ చరిత్రలోనే తొలిసారిగా భూసమీకరణ పేరిట 34 వేల ఎకరాలను పైసా ఖర్చు లేకుండా ప్రజల నుంచి సేకరించడం మాత్రం రికార్డుగానే చెప్పుకోవాలి. అప్పుల్లో ఉన్న ఆంద్రప్రదేశ్ కు దాదాపు 50 వేల కోట్ల రూపాయల విలువైన భూమి ఉచితంగా సమకూరింది.

కేంద్రం వైఖరి…?

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల సంయుక్త బాధ్యత. అమరావతి శంకుస్థాపన స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా జరిగింది. దీని నిర్మాణానికి పదిహేను వందల కోట్లరూపాయల మేరకు నిధులనూ విడుదల చేశారు. అంతేకాదు, కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల్లో టీడీపీ, బీజేపీ రెండూ సంయుక్త భాగస్వాములుగా ఉన్నప్పుడే పునాదిరాళ్లు పడ్డాయి. అందువల్ల అమరావతికి సంబంధించి ఎటువంటి మార్పు ప్రతిపాదనలు వచ్చినా కేంద్రం వెంటనే అంగీకరించే పరిస్థితి ఉండదు. ఇప్పటికే పోలవరం, పీపీఏ ల విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. రెండున్నర లక్షల కోట్ల రూపాయల పైచిలుకు అప్పుల్లో ఉన్న రాష్ట్రం మళ్లీ కొత్త ప్రాంతంలో రాజధాని అంటే తలప్రాణం తోకకు వస్తుంది. అదంత సులభసాధ్యం కాదని అధికారులు, రాజకీయ విశ్లేషకులు తేల్చి చెప్పేస్తున్నారు. ఉచితంగా వచ్చిన 34 వేల ఎకరాల భూములను, ఎంతోకొంత తాత్కాలికంగా ఏర్పడిన మౌలిక వసతులను కాదని ప్రభుత్వం ముందుకు వెళ్లదనేది మెజార్టీ ప్రజల అభిప్రాయం.

జగన్ తేల్చాలి…

సాంకేతికంగా రాజధాని అమరావతిపై వెనక్కి వెళ్లడం సాధ్యం కాదు. ఈ స్థితిలో మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ప్రకటనల్లోని ఆంతర్యమేమిటన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. గత తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేసిందన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడమే వీరి ప్రకటనల లక్ష్యం కావచ్చు. రాజధాని ప్రాంతంలో సకల హంగులను, అధికారాలను, ఆర్థిక వనరులను కేంద్రీకరించేందుకు నవనగరాల పేరిట తెలుగుదేశం ప్రభుత్వం గ్రాఫిక్ డిజైన్లతో ప్రణాళిక రూపకల్పన చేసింది. దానిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు వైసీపీపై పడింది. ఇక్కడ ఉన్న వాతావరణ , వరద పరిస్థితుల ద్రుష్ట్యా అది సాధ్యం కాదని నిరూపించేందుకు కూడా మంత్రులు ప్రకటన చేసి ఉండవచ్చు.

పరిపాలనకు పరిమితమా..?

నవనగరాల కాన్సెప్టును పక్కనపెట్టి కేవలం పరిపాలన కు మాత్రమే రాజధానిని పరిమితం చేసి మిగిలిన చోట్లకు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను, ప్రణాళికలను వికేంద్రీకరించే యోచన చేస్తూ ఉండవచ్చు. అందుకుగాను ముందస్తుగా ప్రజలను సన్నద్దం చేసే ప్రక్రియలో భాగంగానే కీలక నేతలు వ్యాఖ్యలను చూడాలనే అభిప్రాయం వినవస్తోంది. ప్రజల నుంచి వచ్చే స్పందన, ఆందోళన , ప్రతిఘటనలను అనుసరించి ప్రభుత్వం తరఫున తదుపరి చర్యలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. గతంలో ఒకసారి తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్ మెంట్ పై ఒక ప్రకటన చేశారు. పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అటువంటిదేమీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తన కార్యాలయం నుంచి వివరణ ఇప్పించి ప్రభుత్వ ప్రతిష్ఠకు నష్టం వాటిల్లకుండా చూసుకున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే అమ్మ ఒడి పథకమంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంధ్రనాథరెడ్డి ఒక ప్రకటన చేశారు. దీనిపై భిన్నమైన స్పందన రావడంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని అన్ని పాఠశాలల విద్యార్థులకూ అమ్మ ఒడి అంటూ ప్రకటించారు. ఈ రెండు సందర్బాల్లోనూ ప్రజా స్పందనను టెస్ట్ చేసిన తర్వాత ఫైనల్ నిర్ణయం తీసుకున్నారు. తాజా రాజధాని వివాదంలోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటన చేసి వివాదానికి తెర దించాల్సి ఉంటుంది. అంతవరకూ కీలకనేతల ప్రకటనల పర్యవసానంగా ఏర్పడిన అలజడి, సస్పెన్స్, రాజకీయ విమర్శలు, ప్రజల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంటాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News