జగన్ కి వారు అంత శత్రువులా?

జగన్ లో ఒకప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చిందని దగ్గరుండి చూసిన వారు అంటారు. పదేళ్లకు ముందు జగన్ రాజకీయాల్లో ఓ బేబీ. చెప్పాలంటే తండ్రి చాటు [more]

Update: 2019-10-18 02:00 GMT

జగన్ లో ఒకప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చిందని దగ్గరుండి చూసిన వారు అంటారు. పదేళ్లకు ముందు జగన్ రాజకీయాల్లో ఓ బేబీ. చెప్పాలంటే తండ్రి చాటు బిడ్డ. బిజినెస్ చేసుకుంటూ హఠాత్తుగా 2009 ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తండ్రి సీఎం. దాంతో మూడు నెలల పాటు అలాగే హాయిగా జరిగిపోయింది. అప్పట్లో జగన్ కాంగ్రెస్ ఎంపీలతో పెద్దగా మాట్లాడేవారు కూడా కాదని అంటారు. అలా బింకంగా బిడియంగా మొదలైన జగన్ రాజకీయ జీవితం వైఎస్సార్ మరణంతో అనుకోని మలుపు తిరిగి రాజకీయ కక్షలకు బలి అయ్యేంతవరకూ సాగిపోయింది. అప్పట్లో ఉడుకురక్తమో మరేమో కానీ జగన్ అందరినీ గుర్తుంచుకుంటానని చెప్పుకొచ్చేవారట. నాకూ ఒక రోజు వస్తుందన్న ధీమా మాత్రం అప్పట్లోనే జగన్ లో ఉండేదట. అయితే జగన్ రోజు ఇపుడు వచ్చింది, కానీ పాత ప్రతినలు మాత్రం ఇపుడు గుర్తుకురాకపోవడమే అసలైన రాజకీయ‌ చిత్రం అంటున్నారు.

తిట్టిన వారినే…

ఒకపుడు జగన్ ని ఎవరైనా తిట్టారని తెలిస్తే చాలు వారిని దగ్గరకు రానిచ్చేవారు కాదు. అది చెప్పుడు మాట అయినా సరే జగన్ నమ్మేసేవారు అంటారు. మరి ఇపుడు మారిన జగన్ అయిదేళ్ళ పాటు తనని తిట్టిన జూపూడి ప్రభాకరరావుని పార్టీలోకి తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోగానే తనని నియంత అని దారుణంగా విమర్శించిన దాడి వీరభద్రరావుని కూడా చేర్చుకున్నారు. ఇదే వరసలో ఎన్నిక ముందు పార్టీకి చేటు చేసిన పరుచూరు నేతను కూడా మళ్ళీ టీడీపీ నుంచి తీసుకొచ్చి కలుపుకున్నారు. ఇవన్నీ చూసుకునే ఇపుడు చాలా మంది జంపింగ్ నేతలు కూడా జగన్ కంట్లో పడాలనుకుంటున్నారుట. రేపో మాపో రాజకీయ అవసరాల కోసం తీసుకున్నా తీసుకుంటారని అంటున్నారు. మరి ఇంతమందిని తీసుకున్న జగన్ తన తండ్రి కాలం నుంచి వైఎస్ ఫ్యామిలీ అంటే ఇష్టపడే ఆ ఇద్దరు సీనియర్ల విషయంలో ఎందుకు వెనకాడుతున్నారన్నదే అందరికీ ఆశ్చర్యంగా ఉందిట.

నీ దయ రాదా…?

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వైఎస్సార్ భక్తుడు, సౌమ్యుడు, అవినీతి మరక అంటనివారు, నిజాయతీగా ఉంటారు. ఎంపీగా, మంత్రిగా పనిచేసిన ఆయనను జగన్ పక్కన పెట్టేశారు. ఎన్నికల ముందు చేరేందుకు వచ్చినా కూడా పెద్దగా ఉత్సాహం చూపించలేదంటారు. దాంతో కొణతాల ఇపుడు రాజకీయ వనవాసమే అనుభవిస్తున్నారు. తండ్రి వైఎస్సార్ నమ్మి మొత్తం విశాఖ జిల్లాకు ఏకైన మంత్రిగా చేస్తే జగన్ మాత్రం దూరం పెట్టారని అంటున్నారు. మరో నేత సబ్బం హరి. ఆయన్ని వైఎస్సార్ ఆదరించి అప్పట్లో ఆయన మీద ఉన్న పార్టీ బహిష్కరణను సైతం తొలగించి అనకాపల్లి ఎంపీ టికెట్ ఇప్పించారు. దగ్గరుండి గెలిపించారు. సబ్బం హరి తరువాత కాలంలో జగన్ వైపు వుంటూ వచ్చారు. కానీ ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యల మూలంగా జగన్ ఆగ్రహానికి గురి అయి వైసీపీని వీడిపోయారు. ఇప్పటికీ వైఎస్ అంటే ఇష్టపడే సబ్బం జగన్ తనను పార్టీలోకి తీసుకోలేదన్న అక్కసుతోనే విమర్శలు చేస్తున్నారు. జగన్ మరి ఇంతకన్నా దారుణంగా తిట్టిన వారిని పార్టీలోకి తీసుకున్నారు. వైఎస్సార్ ఫ్యామిలీగా ముద్ర పడిన ఈ ఇద్దరు నేతలను కూడా తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది. మరి జగన్ ఆలోచిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News