టార్గెట్ రీచ్ అవుదామనేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అచ్చం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారు. ఆయన చేపట్టిన పథకాలను తానూ అమలు పరుస్తూ ఓటు బ్యాంకును పటిష్టం [more]

Update: 2019-09-27 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అచ్చం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారు. ఆయన చేపట్టిన పథకాలను తానూ అమలు పరుస్తూ ఓటు బ్యాంకును పటిష్టం చేసేదిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలకు ముందు కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం పెట్టారు. కంటి చూపు మందగించిన వారికి వారి గ్రామాల్లోనే పరీక్షించి అక్కడికక్కడే కంటి అద్దాలను కూడా కేసీఆర్ ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ పథకం కేసీఆర్ కు ఎన్నికల్లో కలసి వచ్చిందనే చెప్పాలి.

అందరికీ వైద్య పరీక్షలు…

కోటిన్నరకు మందికి పైగా వైద్య పరీక్షలు జరిపి కంటి అద్దాలు ఇవ్వడంతో వారు కొంతకాలంగా ఎదుర్కొంటున్నసమస్యకు కేసీఆర్ పరిష్కారం చూపగలిగారు. ఎన్నికల్లో వృద్ధులు, మధ్య వయసు వారు ఈ పథకంతో కేసీఆర్ పట్ల ఆకర్షితులయ్యారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వచ్చే నెల 10వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఐదు కోట్ల 30 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇది పెద్ద లక్ష్యమే. వీరందరికీ ఆధునిక పరీక్షలు చేసి కంటి అద్దాలను ఇవ్వనున్నారు.

వైఎస్సార్ కంటి వెలుగు….

ఈ పథకానికి వైఎస్సార్ కంటి వెలుగు అని పేరు పెట్టారు. ఈ పథకానికి 560 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. ఈ పథకం కింద నిజంగా ఐదు కోట్ల మందికి ప్రయోజనం చేకూరితే రాజకీయంగా వైసీపీకి లబ్ది చేకూరుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్ జగన్ యోచిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తొలిసారి భేటీ అయిన తర్వాత ఆయన కంటి వెలుగు కార్యక్రమం గురించి జగన్ కు వివరించినట్లు చెబుతున్నారు. దీనివల్ల వృద్ధులతో పాటు మధ్యవయస్కులు ప్రభుత్వానికి ఫేవర్ గా మారతారని చెబుతున్నారు.

విజయవంతం కావాలని….

అందుకోసం ఈ పథకం పూర్తిగా విజయవంతం అవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు. అవసరమైన వారికి అక్కడే కంటి శస్త్ర చికిత్సలు చేయాలని చెప్పారు. కేవలం వృద్ధులకు మాత్రమే కాకుండా అందరికీ ఈ పరీక్షలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే కంటి అద్దాలు పంపిణీ చేయాలని చెప్పారు. ఎక్కడా ఈ కార్యక్రమానికి ఆటంకం లేకుండా చూసుకోవాలని, నిధుల కొరతలేదని స్పష్టమైన ఆదేశాలు జగన్ జారీ చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు కంటి వైద్యులను ఈ కార్యక్రమం అమలులో భాగస్వామ్యం చేయాలని కోరారు. మొత్తం మీద కేసీఆర్ పథకం అక్కడ సక్సెస్ కావడంతో సేమ్ టు సేమ్ ఏపీలోనూ జగన్ ప్రవేశపెడుతున్నారు. కేసీఆర్ జగన్

Tags:    

Similar News