పాతోళ్లందరూ మంచోళ్లేనా?

వైసీపీ ఇపుడు అందమైన పదహారణాల ఆడపిల్లలా రాజకీయ జీవులకు కనిపిస్తోంది. చేతిలో అధికారం ఉంది. ఇంకా నాలుగున్నరేళ్ల పాటు అది స్థిరంగా ఉంటుంది. దాంతో అటు వైపు [more]

Update: 2019-10-08 14:30 GMT

వైసీపీ ఇపుడు అందమైన పదహారణాల ఆడపిల్లలా రాజకీయ జీవులకు కనిపిస్తోంది. చేతిలో అధికారం ఉంది. ఇంకా నాలుగున్నరేళ్ల పాటు అది స్థిరంగా ఉంటుంది. దాంతో అటు వైపు చేరితే పనులు చక్కబెట్టుకోవచ్చునని తెలివిడి గలిగిన నాయకులు ఆలోచిస్తున్నారు. వీరిలో మాజీ వైసీపీ నేతలు ముందు వరసలో ఉంటే ఆ వెనక ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారు. వీరంతా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పార్టీ జెండా కప్పుకోవాలనుకుంటున్నారు. జగన్ సైతం గతంలోలా కాకుండా వచ్చిన వారిని వచ్చినట్లే పార్టీ కండువా కప్పుతూండడం నాయకులకు ఉత్సాహాన్ని ఇస్తోంది. విశాఖ జిల్లాలో ఇపుడు జంపింగ్ జపాంగుల హడావుడి ఎక్కువగా ఉంది.

వారంతా ఓకేనా…?

వైసీపీ ప్రారంభించినపుడు ఆ పార్టీలో ఉంటూ జగన్ కి వెన్నుదన్నుగా ఉన్న నేతలకు తాజా రాజకీయ పరిణామాలు కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయట. జగన్ ని దారుణంగా తిట్టిన వారు సైతం వైసీపీ గూటికి సులువుగా చేరిపోతున్న వైనాన్ని గమనిస్తున్న వారు తాము కూడా వస్తామంటూ సంకేతాలు పంపుతున్నారట. విశాఖ వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న విజయసాయిరెడ్డి ద్వారా రాయబేరాలు నెరపుతున్నారట. విశాఖలో మాజీ వైసీపీ నేతలుగా ఉన్న వారిలో మాజీ ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సీనియర్ నేతలు. వీరు రాజకీయంగా డక్కామొక్కీలు తిన్నవారు. జగన్ కి, వైఎస్సార్ కి కూడా ఒకనాడు వీర విధేయులుగా ఉన్నారు. ఈ ఇద్దరు నేతల విషయంలో జగన్ చేర్చుకునేందుకు ఇపుడున్న పరిస్థితుల్లో సుముఖమేనని మాట గట్టిగా వినిపిస్తోంది. సబ్బం హరికి విశాఖ సిటీలో బలం ఉంది. మేయర్ గా కూడా పనిచేసిన ఆయన తిరిగి వైసీపీలో చేరితే బాగానే ఆదరిస్తారని అంటున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇక కొణతాల రామక్రిష్ణకు అనుచరగణం రూరల్ జిల్లాలో ఉంది. ఆయనతో పాటు వచ్చి చేరే వారి వల్ల లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీకి అవకాశాలు బాగా పెరుగుతాయని అంటున్నారు.

ఏజెన్సీలో ఆ ఇద్దరూ….

ఇక విశాఖ ఏజెన్సీలో ఇద్దరు నాయకులు వైసీపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి, జనసేన నేత పసుపులేటి బాలరాజు వైసీపీలోకి వద్దామనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి జనసేనలో చేరారు. అదే రాంగ్ స్టెప్ అంటున్నారు ఆయన సన్నిహితులు. పాడేరులో మంచి పట్టున్న గిరిజన నేతగా, నిజాయతీపరునిగా బాలరాజుకు పేరుంది. ఇక వైసీపీలోనే రాజకీయంగా పుట్టి ఎమ్మెల్యే అయిన గిడ్డి ఈశ్వరి సొంత గూటికి చేరాలని తహతహలాడుతున్నారని అంటున్నారు. ఆమె ఈ మేరకు రాయబేరాలు నడుపుతున్నారని కూడా చెబుతున్నారు. మరి జగన్ ఈ ఇద్దరిని చేర్చుకునే విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏజెన్సీ మొత్తం వైసీపీ మయం అవుతుందని అంటున్నారు. వీరు కాకుండా విశాఖ అర్బన్ జిల్లా గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, అదే విధంగా టీడీపీలోని కొంతమంది నాయకులు కూడా వైసీపీలో చేరెందుకు రెడీ అవుతున్నారు. దీంతో జగన్ ఒకే అంటే ఓ పెద్ద నాయకుల బృందమే విశాఖ నుంచి వైసీపీలో చేరిపోతుందంటున్నారు.

Tags:    

Similar News