అప్పుడేనా ఫ్యూచర్…?

ఏపీలో రెండు అంశాలు ఇపుడు హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఓ విధంగా అవి ఏపీకి అతి కీలకమైన అంశాలు కూడా. వాటితోనే ఏపీ భవిత, బతుకు [more]

Update: 2019-08-28 12:30 GMT

ఏపీలో రెండు అంశాలు ఇపుడు హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఓ విధంగా అవి ఏపీకి అతి కీలకమైన అంశాలు కూడా. వాటితోనే ఏపీ భవిత, బతుకు ఆధారపడితున్నాయి. వాటిని జాగ్రత్తగా డీల్ చేస్తేనే ఏ పార్టీకైనా భవిష్యత్తు ఉంటుంది. ఆ రెండు పోలవరం, అమరావతి. వైఎస్ జగన్ కి నిన్న కాక మొన్న జనం అయిదేళ్ళ పాటు పాలించమని అధికారం ఇచ్చారు. వైఎస్ జగన్ సైతం తనదైన పాలన ఉండేలా చూసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా పోలవరం, అమరావతి ఈ రెండూ వైఎస్ జగన్ సర్కార్ ప్రతిష్టగా తీసుకుంటోంది. ఈ రెండింటినీ అలా వదిలేసి వాటి మానన నిధులు కేటాయిస్తే వచ్చే నష్టమేంటని కొందరు అంటున్నారు. అలా కనుక చేస్తే వాటి మూలపురుషుడుగా చంద్రబాబు రాజకీయంగా మైలేజ్ పొందుతారన్న ఆలోచన వైసీపీలో ఉంది. అంతే కాదు. పోనీ అని ఉదారంగా వదిలేసినా టీడీపీ చూస్తూ ఊరుకోదు. పోలవరంలో భారీ అవినీతి జరిగింది అన్నారు, అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అన్నారు. అధికారంలోకి వచ్చి కూడా నిరూపించలేక తోక ముడిచారు, మా దారికే వచ్చారు, ఈ అభివృధ్ధి అంతా మా ముందు చూపు, గొప్పదనమేనని కూడా టముకు వేసుకుంటుంది. వైఎస్ జగన్ సర్కార్ ని ఆ విధంగా కూడా తిన్నగా ఉండనీయదు. ఏ విధంగానూ విమర్శలు వస్తాయి. పైగా తాము వచ్చింది ఏదో మంచి చేయాలనుకుని కదా. అందువల్ల ప్రక్షాళన చేసిందేదో గట్టిగానే చేయాలనుకుంటోంది వైసీపీ.

ఊహించని షాకులు….

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే నాటికి కేంద్రంలోని బీజేపీ, ఏపీలోని ఆ పార్టీ నాయకులు మిత్రులుగానే ఉన్నారు. పైగా అమరావతి, పోలవరం విషయంలో వైసీపీ కంటే కూడా ఎక్కువగా మాట్లాడారు. ఏకంగా ప్రధాని మోడీ పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎం గా వాడుకుంటున్నారని ఏపీకి వచ్చి మరీ ఘాటుగా విమరించి వెళ్లారు. ఇక కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు అయితే పోలవరం విషయంలో ఎన్ని మాటలు టీడీపీని అన్నారో లెక్కలేదు అమరావతి విషయం తీసుకున్నా కూడా అక్కడ రాజధాని కాదు, అవినీతి అంటూ కమలనాధులు కామెంట్స్ చేశారు. బీజేపీ ఈ దూకుడు చూసి కూడా వైఎస్ జగన్ ఈ రెండు కీలకమైన అంశాల విషయంలో రాగానే వేగం పెంచారనుకోవాలి. ఎటూ కేంద్రం అండ ఉంటుంది కాబట్టి సులువుగా టీడీపీ అవినీతి తీయగలమని, జనాలకు ఆ విధంగా అసలు నిజాలు చెప్పి తమ పాలన ఏంటో చూపించాలని కూడా వైఎస్ జగన్ ఆశ పడ్డారు. అయితే అక్కడే కధ అడ్డం తిరిగింది.

పాలు నీళ్ళల్లా…..

ఇపుడు ఏపీలో బీజేపీ, టీడీపీ వేరు అంటేనే నమ్మేవారు లేరు. వైఎస్ జగన్ సీఎం కావడానికి తామే కారణమని, అలాగే బాబు ఓటమి కూడా తమ స్క్రిప్ట్ అని చెప్పుకుంటూ లేని బలాన్ని ఊహించుకుంటున్న కమలదళంలో అరువు గొంతుకలుగా టీడీపీ నుంచి జంప్ అయిన ఎంపీలు కూడా తయారయ్యారు. ఇంకేముంది వైఎస్ జగన్ కి ఎక్కడికక్కడ బ్రేకులు పడిపోయాయి. పోలవరం రివర్స్ టెండరింగ్ కి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గేట్లు వేయడానికి కారణం ఏపీలోని టీడీపీ నుంచి జంప్ అయిన ఎంపీల లోపాయికారి రాజకీయమేనని అంటున్నారు. ఇక అమరావతి విషయంలో కూడా వేలూ కాలూ పెట్టనీయకుండా అటునుంచే నరుక్కువస్తున్నారు. బాబు ఎంపీలు ఎందుకు బీజేపీలోకి జంప్ అయ్యారో అర్ధం పరమార్ధం తెలిశాక బాబు మాస్టర్ ప్లాన్ కి జోహార్ అనక‌ తప్పది ఎంతటి రాజకీయ పండితుడికైనా.

అదే ఒక ఆశ…..

ఈ సమయంలో ఎంతో ప్రతిష్టకు పోయిన వైఎస్ జగన్ కి కేంద్రంలోకి మోడీ, అమిత్ షాలే దిక్కు అయ్యారు. ఆ ఇద్దరు కూడా ఈ రాజకీయ క్రీడలో భాగం కాదని అంతా అనుకుంటున్న మాట. ఎందుకంటే బాబు విషయంలో ఆ ఇద్దరికీ సానుకూల భావన లేదు. అదే ఇపుడు వైఎస్ జగన్ కి మిగిలిన ఆశ. అందుకే వైఎస్ జగన్ షా, మోడీతోనే కధ నడపాలనుకుంటున్నారు. అయితే ఏపీలోని తమ పార్టీ నేతల మాటను కాదని వైఎస్ జగన్ కి మద్దతు ఇచ్చే పరిస్థితి మోడీ షాలకు ఉంటుందా అన్నది ఒక ప్రశ్న. ఒకవేళ వారు కూడా ఏపీ బీజేపీ నేతల వాదనకే అవునంటే కూడా వైఎస్ జగన్ ముందుకు సాగగలరా. అలా అందరికీ కాదని వైఎస్ జగన్ ఈ రెండు కీలక అంశాల్లో తాను కోరుకున్నట్లుగా అవినీతిని నిరూపించి, వికేంద్రీకరణ పాలన, అవినీతి రహిత పాలన తీసుకురాగలరా అన్నదే ఇపుడు చర్చ. అది సాధిస్తేనే వైఎస్ జగన్ కి కూడా భవిష్యత్తు.

Tags:    

Similar News