ఫ్యాన్ గుర్తు ఇక ఉండదట

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని వదిలేసినట్లే. ఆయన ఎన్నికలకు ముందే ఈరకమైన సంకేతాలు ఇచ్చారు. తెలంగాణలో ఇక వైసీపీ లేదన్నది దాదాపుగా స్పష్టమయింది. తెలంగాణలో [more]

Update: 2019-09-25 13:30 GMT

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని వదిలేసినట్లే. ఆయన ఎన్నికలకు ముందే ఈరకమైన సంకేతాలు ఇచ్చారు. తెలంగాణలో ఇక వైసీపీ లేదన్నది దాదాపుగా స్పష్టమయింది. తెలంగాణలో వైసీపీ ఒకప్పుడు బలంగానే ఉండేది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అభిమానులు కూడా తెలంగాణలో ఎక్కువగా ఉన్నారు. వైఎస్ మరణం తర్వాత ఏర్పాటయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తెలంగాణలో అనేక మంది కాంగ్రెస్ నేతలు వైసీపీలోచేరారు. 2014 ఎన్నికలలో వైసీపీ ఒక పార్లమెంటు స్థానాన్ని, నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది.

ఏపీపైనే ఎక్కువగా….

అయితే రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ జగన్ తన దృష్టి మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ పైనే ఉంచారు. ఇక్కడ పార్టీని నామమాత్రంగానే ఉంచారు. పార్టీ కార్యవర్గం తెలంగాణలో ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ వారితో సమావేశం కాలేదు. 2018 ఎన్నికల్లో కూడా తెలంగాణలో జరిగిన ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో సయితం పోటీ చేయలేదు. అయితే భవిష్యత్తులో తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని అప్పట్లో వైఎస్ జగన్ చెప్పారు. తాను పాదయాత్రలో ఉండగా కలసిన తెలంగాణ పార్టీ నేతలకు పోటీ వద్దని సూచించారు.

నవ్వే సమాధానంగా….

కానీ తాజాగా జరుగుతున్నరాజకీయ పరిణామాలతో ఇక పార్టీని పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనన్నది అర్థమవుతుంది. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలోనూ తెలంగాణ వైసీపీకి చెందిన కొందరు ముఖ్యులకు స్థానం కల్పించారు. ఇప్పుడు వైఎస్ జగన్ దృష్టి మొత్తం ఏపీపైనే ఉంది. లెక్కకు మిక్కిలి సమస్యలు ఉండటంతో అక్కడ పాలన సజావుగా చేయాల్సి ఉంది. ఇటీవల కలిసిన తెలంగాణ నేతలకు కూడా జగన్ నుంచి సమాధానం నవ్వు మాత్రమే వచ్చిందని తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ పరిస్థితిని గురించి వారు ప్రస్తావించగా నవ్వే సమాధానం అయిందంటున్నారు.

కేసీఆర్ తో మిత్రత్వం….

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో వైఎస్ జగన్ మిత్రత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆయన మూడు సార్లు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదలు, విభజన అంశాలతో పాటు రాయలసీమకు నీటి పరిష్కారం కోసం వైఎస్ జగన్ కేసీఆర్ సాయం కోరుతున్నారు. కేసీఆర్ కూడా ఉమ్మడి శత్రువైన చంద్రబాబును ఎదుర్కొనేందుకు జగన్ ను దగ్గరకు తీశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణలో పార్టీని కొనసాగించే యోచనలో జగన్ లేరన్నది దాదాపుగా తేలిపోయింది. దీంతో ఇక్కడ పార్టీని జగన్ మూసినట్లేనన్నది దాదాపుగా నిర్ధారణ అయింది.

Tags:    

Similar News