క్లాస్ బాగానే పీకారటగా…?

అవును! సంక్షేమం పునాదిగా ఏర్పాటు చేసుకున్న ప్ర‌భుత్వానికి అన్ని వ‌ర్గాల నుంచి ఆద‌రాభిమానాలు ద‌క్కేలా వ్య‌వ‌హ‌రించాల‌నే సీఎం వైఎస్ జ‌గ‌న్ సూచ‌న‌ల‌ను కొందరు నాయ‌కులు, మంత్రులు ప‌ట్టించుకోవ‌డం [more]

Update: 2019-09-06 12:30 GMT

అవును! సంక్షేమం పునాదిగా ఏర్పాటు చేసుకున్న ప్ర‌భుత్వానికి అన్ని వ‌ర్గాల నుంచి ఆద‌రాభిమానాలు ద‌క్కేలా వ్య‌వ‌హ‌రించాల‌నే సీఎం వైఎస్ జ‌గ‌న్ సూచ‌న‌ల‌ను కొందరు నాయ‌కులు, మంత్రులు ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో మంత్రుల‌కు వైఎస్ జ‌గ‌న్ క్లాస్ తీసుకునే ప‌రిస్థితి త‌లెత్తుతోంది. తాజాగా నిర్వ‌హించిన నాలుగో ద‌ఫా మంత్రి వ‌ర్గ భేటీలో వైఎస్ జ‌గ‌న్ తన మంత్రుల్లో కొంద‌రికి చుర‌క‌లు అంటించారు. అన్నా అన్నా అంటూనే కొందరు మంత్రుల‌కు.. అమ్మా.. అమ్మా అంటూనే మ‌హిళా మంత్రుల‌కు వైఎస్ జ‌గ‌న్ క్లాస్ ఇచ్చిన విష‌యం విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్రంలో ల‌క్ష‌ల సంఖ్యలో ఉద్యోగ క‌ల్పన జ‌రుగుతోంది.

పార్టీ వారికి ప్రాధాన్యత ఇవ్వాలని….

అదే స‌మ‌యంలో సంక్షేమ కార్య‌క్ర‌మాలు కూడా అమ‌లవుతున్నాయి. అయితే, వీటి విష‌యంలో మంత్రు లు కొన్ని సూచ‌న‌లు చేస్తున్నారు. వీటిని సీఎం వైఎస్ జ‌గ‌న్ సాద‌రంగా ఆహ్వానిస్తున్నారు. వాటిని ఇంప్లిమెంట్ చేయాల‌ని కూడా సూచిస్తున్నారు. అయితే, గ‌తంలో టీడీపీ హ‌యాంలో కొన్ని విధుల‌ను కాంట్రాక్టు ప్రాతి పదిక‌న కొంద‌రికి కేటాయించారు. ఇప్పుడు వారిని తొల‌గించాల‌ని మంత్రులు ప‌ట్టుబ‌ట్టారు. మ‌న వాలంటీర్ల‌కు, మ‌న పార్టీకి చెందిన వారికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని వైఎస్ జ‌గ‌న్ ముందు ప్ర‌తిపాద‌న పెట్టారు. అదే స‌మ‌యంలో స‌చివాల‌య ఉద్యోగాల్లోనూ వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మిన‌హాయింపు ఇవ్వాల‌ని సూచించారు.

పైరవీలకు తావు లేదంటూ…

అయితే, ఈ రెండు విష‌యాల‌ను కూడా సీఎం వైఎస్ జ‌గ‌న్ తోసిపుచ్చారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ పైర‌వీల‌కు తావులేద‌ని, ప్ర‌తిభ, మార్కుల ఆధారంగానే ఉద్యోగ నియామకాలు చేప‌ట్టాల‌ని వైఎస్ జ‌గ‌న్ ఆదేశించారు. ఇదే స‌మ‌యంలో మంత్రుల‌ను ఆయ‌న స్వ‌ల్పంగా హెచ్చ‌రించారు. ఇలాంటి విష‌యాల‌పై ఎందుకు దృష్టి పెడుతున్నారు. మీకు ఈ విష‌యాల‌కు సంబంధం లేదుక‌దా..? మీ మీ శాఖ‌ల పురోగ‌తిని మాత్ర‌మే లెక్క‌లోకి తీసుకోవాల‌ని వైఎస్ జ‌గ‌న్ సూచించారు. ప్ర‌ధానంగా పినిపే విశ్వ‌రూప్‌, పాముల పుష్ప‌శ్రీవాణి, తానేటి వ‌నిత‌, శంక‌ర నారాయ‌ణ‌ల‌కు వైఎస్ జ‌గ‌న్ కొన్ని సూచ‌న‌లు చేసిన‌ట్టు తెలిసింది. మ‌రి వీరు ఇక‌నైనా త‌మ ప‌ద్ధ‌తిని మార్చుకుంటారో లేదో చూడాలి. నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలోనూ వైఎస్ జ‌గ‌న్ మంత్రుల‌కే సుతిమెత్త‌గా వార్నింగ్ ఇచ్చేశార‌ట‌. కేవ‌లం ప్ర‌తిభ ఆధారంగా ఎవ‌రికి ఏ ప‌ద‌వి ఇవ్వాలో తానే నిర్ణ‌యిస్తాన‌ని.. ఈ విష‌యంలో మంత్రులు ఎవ్వ‌రూ త‌న‌పై ఒత్తిడి తీసుకురావొద్ద‌ని చెప్పిన‌ట్టు తెలిసింది.

Tags:    

Similar News