కొల్ల గొట్టేస్తున్నాడుగా

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చే ఎన్నికలపైనే దృష్టి పెట్టినట్లు కనపడుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని వైఎస్ [more]

Update: 2019-10-02 02:00 GMT

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చే ఎన్నికలపైనే దృష్టి పెట్టినట్లు కనపడుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని వైఎస్ జగన్ రికార్డు సృష్టించారు. ప్రతిపక్షం ఉందా? లేదా? అన్న స్థాయిలో రిజల్ట్ వచ్చాయి. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పథకాలను, కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. ఎలాంటి హడావిడి లేకుండానే తన పని తాను చేసుకుపోతూ పటిష్టమైన ఓటు బ్యాంకును సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

శాశ్వత ఉద్యోగాలు…..

ఈ నెల 2వ తేదీ నుంచి ఏపీలో కొత్తగా పరిపాలనా వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు అవుతున్నాయి. లక్షా 26 వేల మందికి గ్రామ సచివాలయాల్లో ఉపాధి కల్పించారు వైఎస్ జగన్. ఇవి ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు. లక్షా 26 వేల అభ్యర్థుల కుటుంబాల్లో ఇంటికి ముగ్గురు ఓటర్లు చొప్పున ఉన్నా దాదాపు నాలుగు లక్షల ఓట్లు వైఎస్ జగన్ తన ఖాతాలో వేసుకున్నట్లేనన్నది పార్టీ వర్గాల అంచనా. ఇప్పటికే గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

లక్షలాది కుటుంబాలు…..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీఎంబర్స్ మెంట్ తో తమ పిల్లలను చదివిస్తే ఆయన తనయుడు జగన్ ఉపాధి కల్పించారని వారు బహిరంగంగా చెబుతున్నారు. వేతనం తక్కువయినా ప్రభుత్వ ఉద్యోగం కావడంతో భవిష్యత్తులో ఎదగవచ్చన్న ఆశతో ఉన్నారు. తిరిగి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను తొలగిస్తారని వారు ఫ్యాన్ గుర్తువైపే చూస్తారన్నది కాదనలేని వాస్తవం. ఇప్పటి వరకూ ఉపాధికోసం ఎదురు చూస్తున్న యువతకు వైఎస్ జగన్ ఆశాకిరణంగా కన్పిస్తున్నారు. యువత కావడంతో నీతి నిజాయితీతో పనిచేసి పౌర సేవలను అందించాలన్న నిశ్చయంతో ఉన్నారు.

ఆర్టీసీ కార్మికులు సయితం…..

ఇక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంతో వైఎస్ జగన్ ఆర్టీసీ కార్మికులు ఆనందోత్సాహాలతో ఉన్నారు. కేవలం మూడు నెలల్లోనే నిర్ణయం తీసుకోవడంతో ఆర్టీసీ కార్మిక కుటుంబాలన్ని వైఎస్ జగన్ వెంటే ఉంటాయనడం వాస్తవమని చెప్పకతప్పదు. తిరిగి చంద్రబాబు వస్తే ఆర్టీసీ యధాస్థితికి వస్తుందన్నది కార్మికులకు తెలియంది కాదు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో వారంతా ఇప్పుడు సైకిల్ వైపు చూడక పోవచ్చు. దాదాపు ఆర్టీసీ కార్మికులకు చెందిన నాలుగులక్షల ఓట్లను జగన్ ఇప్పటికే తన అకౌంట్లో వేసుకున్నట్లయిందంటున్నారు. ఇలా వైఎస్ జగన్ ఇప్పటి నుంచే తన ఓటు బ్యాంకును పెంచుకుంటూ పోతున్నారు. మరి ఎన్నికల సమయానికి ఎలా ఉంటుందో చెప్పలేం కాని, ఇప్పటికైతే జగన్ వెంట లక్షలాది మంది యువత,కార్మిక కుటుంబాలు వెన్నంటే ఉన్నాయి.

Tags:    

Similar News