జగన్ మర్చిపోయినట్లుంది

ఎన్నికల ముందు వరకూ అంటే నాలుగు నెలల క్రితం వరకూ ప్రత్యేక హోదా అన్నది ఏపీలో మారుమోగిపోయింది. పాతిక ఎంపీ సీట్లు మాకు ఇస్తే మేము తెస్తామంటూ [more]

Update: 2019-08-20 12:30 GMT

ఎన్నికల ముందు వరకూ అంటే నాలుగు నెలల క్రితం వరకూ ప్రత్యేక హోదా అన్నది ఏపీలో మారుమోగిపోయింది. పాతిక ఎంపీ సీట్లు మాకు ఇస్తే మేము తెస్తామంటూ అటు టీడీపీ, ఇటు వైసీపీ గట్టిగానే జనంలో చెబుతూ వచ్చాయి. ఎన్నికల్లో జనం వైసీపీకి 22 ఎంపీ సీట్లు కట్టబెట్టారు. అయితే కేంద్రంలో వై.ఎస్.జగన్ అనుకున్నట్లుగా సంకీర్ణ ప్రభుత్వం మాత్రం రాలేదు. గతం కంటే మరిన్ని ఎక్కువ సీట్లు సాధించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాంతో ఆనాడే వై.ఎస్.జగన్ డీలా పడిపోయారు. పార్టీ గెలిచాక తొలిసారి ఢిల్లీ వెళ్ళిన వై.ఎస్.జగన్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి ఇన్ని సీట్లు వస్తాయని అనుకోలేదని అన్నారు. వారికి మా ఎంపీల మద్దతు అవసరం లేదు, ఏపీకి మాత్రం కేంద్రంతో అవసరం ఉంది. అందువల్ల సహనంతోనే హోదా విషయంలో వ్యవహరించాలి అని వై.ఎస్.జగన్ అన్నారు.

హోదా మరిచారా….

ఇదిలా ఉండగా స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో వై.ఎస్.జగన్ మాట్లాడుతూ ఎన్నో విషయాలు చెప్పారు. ఏపీకి సంబంధించి అతి కీలకమైన ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట మాత్రం చెప్పలేదు. అదే వై.ఎస్.జగన్ సర్కార్ ఏర్పడిన మొదట్లో గవర్నర్ ప్రసంగంలో ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించిన వై.ఎస్.జగన్ ఆ తరువాత రోజుల్లో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపారు. అయితే ఇపుడు మాత్రం హోదా మాట అనకపోవడంతో కొత్త సందేహాలు కలుగుతున్నాయి. హోదా విషయంలో వై.ఎస్.జగన్ పట్టు సడలించారా అన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాల‌లో వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు హోదా వూసెత్తవద్దని బీజేపీ నేతలు వై.ఎస్.జగన్ కి హెచ్చరిస్తున్న నేపధ్యంలో జగన్ హోదా మాట అనకపోవడం వెనక వ్యూహం ఏదైనా ఉందా లేక కాడి వదిలేశారా అన్న డౌట్లు అందరిలో వస్తున్నాయి.

ఆ రెండు పార్టీలదీ అంతే….

ఇక ఏపీలో ప్రతిపక్ష పార్టీగా మారిన తెలుగుదేశం సైతం హోదా విషయంలో అసలు మాట్లాడను అని ఒట్టేసుకుంది. ఎందుకు అంటే వై.ఎస్.జగన్ పార్టీని నమ్మి 22 ఎంపీ సీట్లు కట్టబెట్టారు కాబట్టి, ఏపీకి హోదా తేవాల్సిన బాధ్యత వై.ఎస్.జగన్ దేనని చేతులు దులుపుకుంటోంది. మరి టీడీపీ సహకారం ఉంటుందా అని ఎవరూ అడగకూడదు, ఎందుకంటే దానికి సమాధానం అందరికీ తెలిసిందే. ఇక హోదా వచ్చేస్తే ఆ క్రెడిట్ వై.ఎస్.జగన్ కి దక్కుతుంది కాబట్టి ఎటూ టీడీపీ హోదా గురించి పిసరంతైనా మాట సాయం కూడా చేయదు. మరో పార్టీ జనసేన ఉంది. హోదా గురించి రెండేళ్ల క్రితం గట్టిగా మాట్లాడిన పవన్ తరువాత వెనక్కుతగ్గారు. ఇక ఈ మధ్యన ఆయన మాట్లాడుతూ హోదా అన్న సెంటిమెంట్ జనంలో లేదని, అందువల్ల దాని గురించి మాట్లాడడం వేస్ట్ అన్న ధోరణిని వ్యక్తం చేసారు. అప్పట్లో కస్సుమన్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కూడా హోదా మాట అనడంలేదు. బీజేపీ అయితే అది ముగిసిన అధ్యాయమని ఏనాడో చెప్పేసింది. మొత్తానికి చూసుకుంటే నాడు అందరూ ఎత్తుకుని ముద్దు చేసిన హోదా ఇపుడు ఏపీలో ఎవరికీ పట్టని అనాధగా మారింది.

Tags:    

Similar News