జగన్ ఒకటనుకుంటే..?

తాను అధికారంలోకి వస్తే వెంటనే జిల్లాల సంఖ్యను పెంచుతానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రతి చోటా హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. [more]

Update: 2019-07-19 13:30 GMT

తాను అధికారంలోకి వస్తే వెంటనే జిల్లాల సంఖ్యను పెంచుతానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రతి చోటా హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. తాను పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చని హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు జగన్. కొత్త రాష్ట్రం కావడం, గత ప్రభుత్వం అప్పులు మిగిల్చి పోవడంతో కొన్ని హామీలను జగన్ ఇప్పటికిప్పుడు నెరవేర్చే పరిస్థితి లేదన్నది జగన్ కు అవగాహనకు వచ్చింది.

జిల్లాల ఏర్పాటుపై…..

వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది జిల్లాల ఏర్పాటు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తానని పాదయాత్ర సమయంలో జగన్ ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే జిల్లాల ఏర్పాటు అంత సులువు కాదన్నది అర్థమయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు ఉన్నాయి. పార్లమెంటు నియోజకవర్గాలు 25 ఉండటంతో మరో 12 జిల్లాలను అధికంగా చేయాల్సి ఉంటుంది.

అధికారులను పరుగులు పెట్టించి….

జగన్ ముఖ్యమంత్రిగా చేపట్టిన తొలినాళ్లలో అధికారులను జిల్లాల ఏర్పాటుపై పరుగులు పెట్టించారు. ప్రాంతాలు, రెవెన్యూ సమస్యలు, భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి తనకు త్వరగా నివేదిక సమర్పిచాలని జగన్ అధికారులను ఆదేశించారు. కొన్ని పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాలను జిల్లాలుగా ఏర్పాటు చేస్తే ఉత్పన్నమయ్యే సమస్యలను కూడా ఆ ప్రాంత ప్రతినిధులతో జగన్ చర్చించారని చెబుతారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే జిల్లాలను ఏర్పాటు చేస్తే తమకు రాజకీయంగా ఉపయోగపడుతుందని జగన్ భావించారు.

ఆర్థిక ఇబ్బందులతో….

అయితే ఇప్పుడు జగన్ కొత్త జిల్లాల ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఆర్థికకారణాలే. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భవనాలు, కొత్త ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించడంతో పాటు మౌలిక వసతులు కూడా కల్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కొత్త జిల్లాల ఏర్పాటు ఇబ్బందేనని జగన్ కు అధికారులు సూచించినట్లు తెలిసింది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడప్పుడే అవకాశం లేదని తెలుస్తోంది.

Tags:    

Similar News