జగన్ ఆ హామీ మాత్రం బూమ్ రాంగ్

రాజకీయాల్లో ఒక్కొక్కసారి వ‌చ్చే చిక్కులు చాలా గ‌మ్మత్తుగా ఉంటాయి. వాటిని చేధించ‌డం అంత ఈజీకాదు. ఇప్పుడు ఇలాంటి చిక్కులోనే వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ప‌డ్డార‌ని అంటున్నారు [more]

Update: 2019-10-30 15:30 GMT

రాజకీయాల్లో ఒక్కొక్కసారి వ‌చ్చే చిక్కులు చాలా గ‌మ్మత్తుగా ఉంటాయి. వాటిని చేధించ‌డం అంత ఈజీకాదు. ఇప్పుడు ఇలాంటి చిక్కులోనే వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ప‌డ్డార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏపీలోని పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను జిల్లాలుగా మారుస్తాన‌ని ఆయ‌న ప్రజాసంక‌ల్ప పాద‌యాత్రలో ప్రజ‌ల‌కు హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే జగన్ మాట నిల‌బెట్టుకునే ప్రయ‌త్నాలు ఇటీవ‌ల తెర‌మీదికి వ‌చ్చాయి. అంటే రాష్ట్రంలో ఎంత లేద‌న్నా ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను బ‌ట్టి 25 జిల్లాలు ఏర్పడాలి. ప్రస్తుతం 13 జిల్లాలుగా ఉన్న ఏపీ 25 జిల్లాలు ఇంకా చెప్పాలంటే.. ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాలు రెండు పెరుగుతాయ‌ని అంటున్నారు కాబ‌ట్టి 26 జిల్లాలు ఏర్పడినా ఆశ్చర్యం లేదు.

ఎన్టీఆర్ పేరు పెడతారని….

స‌రే! ఈ విష‌యం అలా ఉంచితే.. కృష్ణా జిల్లాలో పాద‌యాత్ర జ‌రిగిన స‌మ‌యంలో జ‌గ‌న్ మ‌రో ఆస‌క్తిక‌ర ప్రక‌ట‌న చేశారు. అదే.. తాను అధికారంలోకి వ‌చ్చాక చేప‌ట్టే జిల్లాల ఏర్పాటులో భాగంగా కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడ‌తాన‌ని ప్రక‌టించి రాజ‌కీయంగా సంచ‌ల‌నం రేపారు. నిజానికి ఇది అప్పట్లో తీవ్ర వివాదం కూడా అయింది. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబుపై తీవ్ర మైన ఒత్తిడి ప‌డింది. రాజ‌కీయంగా చంద్రబాబుకు ఇబ్బందులు సృష్టించేందుకే జ‌గ‌న్ ఇలాంటి వ్యాఖ్యలు చేశార‌ని అంద‌రూ వ్యాఖ్యానించారు. టీడీపీ వ్యవ‌స్థాప‌కుడి పేరుతో చంద్రబాబు నిత్యం రాజ‌కీయం చేసినా.. ఏనాడూ ఆయ‌న ఇలా ఆలోచించ‌లేక‌పోయారంటూ.. వైసీపీ నాయకులు విమ‌ర్శలు గుప్పిస్తే.. టీడీపీని తిడుతూ.. టీడీపీ వ్యవ‌స్థాప‌కుడు ఎన్టీఆర్‌ను ఎలా పొగుడుతార‌ని టీడీపీ నాయ‌కులు ఫైర‌య్యారు.

ఏ జిల్లాకు పేరు….?

ఓ విధంగా చెప్పాలంటే నాడు జ‌గ‌న్ చేసిన ఈ ప్రక‌ట‌న‌తో బాబుతో పాటు టీడీపీ నేత‌లు అంద‌రూ డైల‌మాలో ప‌డ్డారు. దీంతో అప్పట్లో ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర వివాదం ఏర్పడింది. ఇక‌, ఇప్పుడు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలంటే ఎలా? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. అన్నగారు ఎన్టీఆర్ పుట్టి, పెరిగింది అంతా కూడా నిమ్మకూరు, గుడివాడ త‌దిత‌ర ప్రాంతాలు. ఆయ‌న విద్య, పాల వ్యాపారం చేసింది విజ‌య‌వాడ ప్రాంతం. దీంతో ఈ జిల్లాను రెండుగా విభ‌జిస్తే.. నిమ్మకూరు, గుడివాడ‌ల‌తో కూడిన ప్రాంతాన్ని మచిలీపట్నం కేంద్రంగా కృష్ణాజిల్లాగానే ఉంచుతార‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో విజ‌య‌వాడ, కొండ‌ప‌ల్లి, ఇబ్రహీంప‌ట్నం, గొల్లపూడి, నందిగామ‌, జ‌గ్గయ్యపేట‌, తిరువూరు త‌దిత‌ర ప్రాంతాల‌ను క‌లుపుతూ.. విజ‌య‌వాడ జిల్లాగా ఏర్పాటు చేయాలి.

చిక్కుముడి తప్పదు….

అయితే, అదేస‌మ‌యంలో సామాజిక వ‌ర్గాల వారీగా చూస్తే.. గుడివాడ త‌దిత‌ర ప్రాంతాల‌తో ఏర్పాటు చేసే జిల్లాలో కాపుల ఆధిప‌త్యం ఎక్కువ‌గాను, విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాలో క‌మ్మ సామాజిక వ‌ర్గం ఆధిప‌త్యం ఎక్కువ‌గాను ఉంటుంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్.. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాల్సి వ‌స్తే.. క‌మ్మ వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న విజ‌య‌వాడ జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. అప్పుడు గుడివాడ‌, బంద‌రు, పెడ‌న‌, అవనిగ‌డ్డ త‌దిత‌ర ప్రాంతాలు బంద‌రు కేంద్రంగా కృష్ణా జిల్లాలోకి వ‌స్తాయి. అయితే, ఆయ‌న పుట్టిన ప్రాంతాన్ని, ఆయ‌న పోటీ చేసి గెలిచిన గుడివాడ నియోజ‌వ‌ర్గాన్ని వ‌దిలేసి విజ‌య‌వాడ‌కు అన్నగారి పేరు పెడ‌తారా? అనేది సందేహం. వైసీపీలో ఉన్న లక్ష్మీపార్వతి సయితం దీనిపై ఇంతవరకూ స్పందించలేదు. మ‌రి ఈ విష‌యంలో ఉన్న చిక్కుముడిని జ‌గ‌న్ ఎలా అధిగ‌మిస్తారో చూడాలి.

Tags:    

Similar News