సిఫార్సులు మామూలుగా లేవటగా

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కొంత ఇబ్బందిగా మారింది. సిఫార్సులు అన్ని వైపుల నుంచి ఎక్కువగా వస్తుండటంతో టీటీడీ పాలకమండలిపై [more]

Update: 2019-09-03 02:00 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కొంత ఇబ్బందిగా మారింది. సిఫార్సులు అన్ని వైపుల నుంచి ఎక్కువగా వస్తుండటంతో టీటీడీ పాలకమండలిపై వైఎస్ జగన్ ఇంకా కసరత్తుల చేస్తూనే ఉన్నారు. వత్తిళ్లు ఎక్కువగా ఉండటం, సిఫార్సులు విపరీతంగా వస్తుండటంతో టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్యను 25 మందికి పెంచాలని నిర్ణయించారు. దీనికి ఈ నెల 4వ తేదీన జరిగే కాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించనున్నారు.

నెల రోజులు గడుస్తున్నా…

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పటికే ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని జగన్ నియమించారు. ఆయన నియామకం పూర్తయి నెల రోజులు గడుస్తున్నా ఇంకా పాలకమండలి నియామకం జరగలేదు. జగన్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత కసరత్తులు ప్రారంభించారు. అందుతున్న సమాచారం మేరకు యలమంచలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్లను జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

కేంద్రం నుంచి వత్తిడి…..

వీరితో పాటుగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి పేరు కూడా దాదాపు ఖరారయినట్లు చెబుతున్నారు. కార్పొరేట్ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి కూడా టీటీడీ సభ్యురాలిగా కొనసాగాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరిని సభ్యులుగా నియమించాల్సి ఉంది.

అయితే కొందరికే అంటున్న…..

అయితే కేందమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, గజేంద్ర షెకావత్ నుంచి కూడా కొందరి పేర్లతో కూడిన సిఫార్సులు జగన్ కు నేరుగా అందినట్లు చెబుతున్నారు. మహారాష్ట్రకు చెందిన మరో కేంద్రమంత్రి కూడా తన సతీమణికి బోర్డులో స్థానం కల్పించాలని జగన్ కు నేరుగా ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ట్రాక్ రికార్డు బాగున్న వారికే వైఎస్ జగన్ ఓకే చెప్పే అవకాశముంది. దీంతో కొందరు నేతలు చేసిన సిఫార్సులకు వెంటనే జగన్ నో చెప్పారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రముఖులతో కూడిన టీటీడీ బోర్డు జాబితా త్వరలోనే వైఎస్ జగన్ విడుదల చేసే అవకాశముంది.

Tags:    

Similar News