ఫ్యూచర్ లో పరేషాన్ చేస్తుందా?

పాతిక మంది ఎంపీలను ఇస్తే.. కేంద్రంలోని ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా తెస్తాను. మీ ఆశీర్వాద‌మే మాకు బ‌లం!!“- ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ అధినేత‌గా, ప్రతిప‌క్ష నేత‌గా [more]

Update: 2019-10-11 03:30 GMT

పాతిక మంది ఎంపీలను ఇస్తే.. కేంద్రంలోని ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా తెస్తాను. మీ ఆశీర్వాద‌మే మాకు బ‌లం!!“- ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ అధినేత‌గా, ప్రతిప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్ ప్రజ‌ల‌ను కోరింది ఇదే. అయితే, ఆయ‌న‌పై ఉన్న విశ్వాసంతో ప్రజ‌లు ఆయ‌న‌కు 22 మంది ఎంపీల‌ను అందించారు. ట‌ఫ్ ఫైట్‌లో ముగ్గురు మాత్రం ఓట‌మి పాల‌య్యారు. వాళ్లు కూడా చాలా స్వల్ప తేడాతోనే ఓడిపోయారు. దీంతో ఏపీ ప్రజ‌లు హోదాపై ఆశ‌లు పెట్టుకున్నారు. న‌యానో.. భ‌యానో.. జ‌గ‌న్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తార‌ని ఆశ‌లు పెట్టుకున్నారు.

పక్కదారి పట్టిందా?

అయితే, ఈ విష‌యంపై జ‌గ‌న్ ఆదిలోనే చేతులు ఎత్తేయ‌డం తెలిసిన విష‌య‌మే. కేంద్రానికి త‌గిన విధంగా బ‌లం చేకూరింద‌ని, ఇప్పుడు మ‌నం ప్లీజ్‌.. ప్లీజ్‌.. అంటూ ప్రాధేయ ప‌డ‌డం త‌ప్ప చేయ‌గ‌లిగింది కూడా ఏమీ లేద‌ని ఆయ‌న ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత ప్రధాని మోడీని క‌లిసిన‌ప్పుడు ఢిల్లీలో ప్రక‌టించేశారు. ఈ నేప‌థ్యంలో హోదా విష‌యం ప‌క్కదారి ప‌ట్టింద‌నే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే, హోదాను వ‌దిలేది లేద‌ని, మాకు ప్రజ‌లు అందించిన 22 మంది ఎంపీల‌తో కేంద్రాన్ని ఎప్పటిక‌ప్పుడు అలెర్ట్ చేస్తామ‌ని జ‌గ‌న్ ప్రక‌టించారు.

హోదాను పక్కన పెట్టి….

ఇక‌, ఇప్పటికి నాలుగు మాసాలు గ‌డిచాయి. అయితే, కేంద్రం మాత్రం తాను ప‌ట్టిన ప‌ట్టు విడిచి పెట్టేది లేద‌ని స్పష్టంగా తెలుస్తోంది. మ‌రి ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఐదేళ్లపాటు కూడా హోదా సాధించ‌క‌పోతే.. జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటి? ప‌్రజ‌ల‌కు ఏమ‌ని స‌మాధానం చెప్పాలి? ఎన్నిక‌ల్లో ఎలాంటి హామీ ఇవ్వాలి? ఇప్పుడు వైసీపీలోనే కాదు.. వైసీపీ అభిమానుల‌లోనూ ఈ త‌ర‌హా ప్రశ్నలు చ‌క్కర్లు కొడుతున్నాయి.

ఎవరి పనుల్లో వారు….

ఇక‌, రాష్ట్రం నుంచి గెలిచిన 22 మంది ఎంపీల్లో చాలా వ‌ర‌కు వారి వారి సొంత వ్యవ‌హారాల్లో మునిగి తేలుతున్నార‌నేది వాస్తవం. కొంద‌రు ఇప్పటికీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్యటించని వారు కూడా ఉన్నారు. మ‌రి వీరికి జ‌గ‌న్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు. టీడీపీ బీజేపీతో అంట కాగిన‌న్నాళ్లు ప‌క్కన పెట్టినా ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆ పార్టీ ఎంపీలు గ‌ట్టిగానే ఫైట్ చేశారు. ఇక హోదా కోసం అప్పట్లో వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. ఇప్పుడు వీరు నోరు మెద‌ప‌క‌పోవ‌డంతో ? రాష్ట్ర ప్రజ‌ల్లో అనేక సందేహాలు త‌లెత్తడం ఖాయం.

నిధుల లేమితో…

అటు అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి నిధులు సేక‌రించే బాధ్యత కూడా వీరిపైనే ఉంది. ఇంత కీల‌క స‌మ‌యంలో ఎంపీల‌ను వినియోగించుకునేందుకు జ‌గ‌న్ దూకుడుగా నిర్ణయాలు తీసుకోవ‌డం లేద‌నే విమ‌ర్శలు కూడా వినిపిస్తున్నాయి.మ‌రోప‌క్క, వైసీపీ ఎంపీలో మెజారిటీ భాగం ఉన్నత విద్యావంతులు ఉన్నారు. వీరైనా.. విభ‌జ‌న చ‌ట్టంలో అంశాల‌ను ఆక‌ళింపు చేసుకుని ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల‌ను రాబ‌ట్టే ప్రయ‌త్నం చేస్తేనే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీ మొహం చెల్లుంత‌ద‌నేది నిపుణుల మాట‌. మ‌రి జ‌గ‌న్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

Tags:    

Similar News