జగన్ అంటే అంత భయమా…!!

జగన్ పాదయాత్రకు ముందు జనాలకు పెద్దగా ఆయన గురించి తెలియదు. జగన్ గురించి మీడియాలో రావడం వరకే తెలుసు. జగన్ ముక్కోపి అని, మొండి అని అప్పట్లో [more]

Update: 2019-07-16 15:30 GMT

జగన్ పాదయాత్రకు ముందు జనాలకు పెద్దగా ఆయన గురించి తెలియదు. జగన్ గురించి మీడియాలో రావడం వరకే తెలుసు. జగన్ ముక్కోపి అని, మొండి అని అప్పట్లో టీడీపీ అనుకూల మీడియాలో కధనాలు వచ్చేవి. అయితే జగన్ పాదయాత్ర ద్వారా అవన్నీ తప్పు అని జనాల్లో నిరూపించుకున్నారు. కానీ జగన్ ది ముక్కుసూటితనమని, క్రమశిక్షణ, పట్టుదల ఆయన లక్షణాలని ఇపుడు అందరికీ తెలుస్తున్నాయి. తాను మంచి అని అనుకుంటే జగన్ చేయడానికి ఎక్కడా వెనకంజ వేయరు. ఇక ముఖ్యమంత్రి హోదాలో జగన్ అనేక కీలక‌మైన నిర్ణయాలు తీసుకున్నారు. అవినీతి లేని పాలన అంటూ ఆయన తన అజెండా చెప్పుకున్నారు. నాటి ప్రభుత్వం చేసిన దుర్వినియోగం తాను చేయను అంటూ జనం సాక్షిగా బాస చేశారు. ఇపుడు ఆ పనిలో జగన్ నిమగ్నమై ఉన్నారు.

భయంతోనేనట….

ఇక జగన్ అవినీతి విషయంలో కచ్చితంగా ఉంటున్నారన్న సంకేతాలు ఇప్పటికే పంపించారు. ఎక్కడా లంచం అన్న మాట వినకూడదని కూడా ఆయన గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. తన మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా ఈ విషయంలో కట్టడి చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో చెడ్డ పేరు వచ్చింది ఇలాంటి నాయకుల వల్లేనని జగన్ బాగానే గ్రహించారు. ఇక జగన్ పాలనపై సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్ది మాట్లాడుతూ జగన్ పాలనలో అవినీతి లేదని ఇప్పటికైతే గట్టిగా చెప్పగలనని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వరకూ మంచిగా ఉన్నా ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతికి దూరంగా ఉంటారంటే నమ్మలేమని కూడా ఆయన అన్నారు. అయితే జగన్ ను చూసి వారు భయపడుతున్నారని జేసీ కామెంట్స్ చేశారు. జగన్ ఎక్కడ చూస్తాడోనని భయం వల్లనే అవినీతికి ఎమ్మెల్యేలు పాల్పడడంలేదని ఆయన విశ్లేషించారు. మరి భయం లేకపోతే ఎమ్మెల్యేలు కచ్చితంగా అవినీతి పనులు చేస్తారని కూడా జేసీ మాటల్లో చెప్పకనే చెబుతున్నారు.

కొసదాకా ఉండగలరా….

జేసీ చెప్పిందే నిజమనుకుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతికి అలవాటు పడిన దేహాలు ఎంతవర‌కూ అలా నోరు కట్టుకుని ఉంటారన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. జగన్ కి ఏంటి ఆయన బాగా సెటిల్ అయ్యారు, మేము రాజకీయాల్లో నాలుగు రాళ్ళు సంపాదించుకోవద్దా అన్న ధోరణి కనుక ఎమ్మెల్యేలలో మొదలైతే జగన్ ఏ విధంగా అకట్టడి చేయగలరు, ఇక పాతిక, ముప్పయి కోట్లకు పైగా ఖర్చు చేసి ఎమ్మెల్యేలుగా అయిన వారు రాబట్టుకోవాలనే చూస్తారు, అది సహజం, మరి వచ్చీ రాగానే నోళ్ళు కట్టేస్తే వారు ఏవిధంగా సంభాళించుకుని రాజీ పడగలరన్నది కూడా పెద్ద ప్రశ్న.

అధికారుల్లో సయితం…..

ఇక జగన్ వంటి నాయకుడు గట్టిగా నిలబడితే ఎమ్మెల్యేలు ఏంటి అధికారులు, ఆఖరుకు ప్రజలు కూడా అవినీతికి దూరంగా ఉంటారని మేధావులు అంటున్నారు. జగన్ ఒక్క మాట చెబితే అక్రమ ఇసుక ఆగిపోయిందని, ఇది జగన్ నిబద్ధతకు నిదర్శనమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారంటే జగన్ మాట రామబాణంగా అధికారులు కూడా భావిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి వ్యవస్థలను ఒక్క రోజులో బాగు చేయలేం కానీ నాయకుని మీద భయంతోనైనా కాస్తా మారితే అదే పదివేలు అని సామాన్య జనం అంటున్నారు.

Tags:    

Similar News