అమరావతిని అలా చేస్తారా..?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఫ్రీజోన్ చేయాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదంటున్నారు. వైఎస్ [more]

Update: 2019-09-25 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఫ్రీజోన్ చేయాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదంటున్నారు. వైఎస్ జగన్ ఇప్పుడు అమరావతిపై పెద్దగా దృష్టి సారించడం లేదు. అమరావతి నిర్మాణాలు దాదాపుగా నిలిచిపోయాయి. అయితే జగన్ మాత్రం అమరావతిని ఫ్రీజోన్ గా మార్చే విషయంలో ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో చంద్రబాబు హయాంలోనూ ఈ డిమాండ్ విన్పించినా చంద్రబాబు పట్టించుకోలేదు.

డిమాండ్ ఊపందుకోవడంతో….

అమరావతిని ఫ్రీజోన్ గా మారిస్తే అన్ని ప్రాంతాల వారికీ సమ న్యాయం జరుగుతుంది. ఇప్పటికే రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఈ డిమాండ్ ఊపందుకుంది. అమరావతిలో సీమ వాసులకు ఉద్యోగ భద్రత లేదని ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రకటించారు. నిజానికి రాజధాని నగరం అంటే అందరికీ హక్కు ఉండాలన్నది ఆయన వాదన. కొందరికే రాజధాని అమరావతి పరిమితం కాకూడదన్నది టీజీ వెంకటేష్ అభిప్రాయం. టీజీ వెంకటేష్ అభిప్రాయాన్ని పక్కన పెడితే నిజానికి అమరావతి ఫ్రీజోన్ గా ప్రకటించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.

నాలుగు జిల్లాల నుంచి….

ఇప్పుడు వైఎస్ జగన్ దీనిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమలోని కర్నూలు, కడప జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని విజయనగరంతో పాటు సీమలో భాగం కాకపోయినా నెల్లూరు జిల్లాలో కూడా మొన్నటి ఎన్నికల్లో జగన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ నాలుగు జిల్లాల్లోనూ అమరావతిని ఫ్రీజోన్ చేయాలన్న డిమాండ్ బాగానే విన్పిస్తుంది. అందుకోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు తెలుస్తోంది.

స్పందన లోనూ…

దీంతో పాటు స్పందన కార్యక్రమంలో కూడా అనేక ప్రాంతాల్లో అమరావతి ఫ్రీజోన్ ను చేయాలని అర్జీలు అందుతున్నాయి. తొలుత అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత ఫ్రీజోన్ వ్యవహారాన్ని వైఎస్ జగన్ తేల్చేస్తారంటున్నారు. దీనిపై త్వరలోనే ఒక కమిటీని వేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. రాయలసీమకు చెందిన ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ అమరావతి ఫ్రీజోన్ విషయాన్ని ప్రస్తావించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద అమరావతి ఫ్రీజోన్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News